మినిమం 3 బీహెచ్‌కే కంప్లల్సరీ అంటున్న హైదరాబాదీలు.. మారిన ట్రెండ్ వైపు అడుగులు..!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా కొత్త పుంతలు తొక్కుతోంది.;
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు 'సొంత ఇల్లు' అంటే 2 బీహెచ్‌కే అనేది మధ్య తరగతి కలగా ఉండేది, కానీ ఇప్పుడు ఆ ఆలోచనా ధోరణిలో స్పష్టమైన మార్పు వచ్చింది. కేవలం తల దాచుకోవడానికే కాకుండా, ఇంటిని ఒక ఆఫీసుగా, వినోద కేంద్రంగా మార్చుకోవాలనే తపన హైదరాబాద్ వాసుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
4బీహెచ్‌కే లే హాట్ కేకులు!
హైదరాబాద్ మహానగరం ఇప్పుడు కేవలం ఐటీ హబ్‌గానే కాదు.., లగ్జరీ రియల్ ఎస్టేట్ రాజధానిగా కూడా అవతరిస్తోంది. గతంలో ఇల్లు అంటే కేవలం బెడ్రూంలు, హాల్ మాత్రమే అనుకునే వారు, కానీ కొవిడ్ తర్వాత మారిన జీవనశైలి ప్రజల ప్రాధాన్యతలను పూర్తిగా మార్చేసింది. నేడు కొనుగోలుదారులు చిన్న ఇళ్ల కంటే విశాలమైన 3బీహెచ్‌కే లేదంటే 4బీహెచ్‌కే ఫ్లాట్ల వైపునకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా కోకాపేట నుంచి తెల్లాపూర్ వరకు ఆకాశహర్మ్యాలు వెలుస్తూ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరాలు
హైదరాబాద్‌లో ఈ మార్పు రావడానికి ప్రధాన కారణం ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ లేదా ‘హైబ్రిడ్ వర్కింగ్’ మోడల్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, కార్పొరేట్ ఉద్యోగులు రోజుకు కనీసం 8 నుంచి10 గంటలు ఇంటి నుంచే పని చేయాల్సి వస్తోంది. దీంతో బెడ్రూమ్‌లో కూర్చొని పని చేయడం కంటే, ఏకాంతంగా ఉండే ఒక ప్రత్యేకమైన ఆఫీస్ గది అవసరమని భావిస్తున్నారు. అందుకే 2బీహెచ్‌కే లో సరిపెట్టుకోకుండా, అదనంగా ఒక గది ఉండేలా 3బీహెచ్‌కే లేదా 4బీహెచ్‌కే కావాలని కోరుకుంటున్నారు. ఆ నాలుగో గదిని ఆఫీసుగానో, లైబ్రరీగానో లేదా కిడ్స్ ప్లే ఏరియాగానో వాడుకుంటున్నారు.
లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ వెస్ట్ హైదరాబాద్
నగరంలోని పడమర (West) భాగం ఇప్పుడు లగ్జరీ నిర్మాణాలకు చిరునామాగా మారింది. కోకాపేట, నార్సింగి, తెల్లాపూర్, గండిపేట వంటి ప్రాంతాల్లో చదరపు అడుగు ధర ₹9,000 నుంచి ₹15,000 వరకు ఉన్నప్పటికీ, డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. కోకాపేటలో వెలుస్తున్న నియోపోలిస్ వంటి అత్యాధునిక లేఅవుట్లు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో క్లబ్ హౌస్‌లు, ఒలింపిక్ సైజ్ స్విమ్మింగ్ పూల్స్, విశాలమైన బాల్కనీలు, గ్రీన్ జోన్స్ ఉండడం సంపన్న వర్గాలను, సీనియర్ ఐటీ ప్రొఫెషనల్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది.
భవిష్యత్తు అవసరాల కోసం ముందస్తు ప్లాన్!
ప్రజలు ఇల్లు కొనేటప్పుడు కేవలం ప్రస్తుత అవసరాలనే కాకుండా, రాబోయే 10-15 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబాల సంస్కృతి మళ్లీ కొంత మేర పెరుగుతుండడం లేదా తల్లిదండ్రులు, అతిథులు వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలని పెద్ద ఇళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు. చిన్న ఇళ్ల కంటే పెద్ద లగ్జరీ ఇళ్లకు భవిష్యత్తులో రీసేల్ వాల్యూ ఎక్కువగా ఉంటుందని పెట్టుబడిదారులు నమ్ముతున్నారు.
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా ప్రకారం, 2026 చివరి నాటికి హైదరాబాద్‌లో అమ్ముడయ్యే మొత్తం ఫ్లాట్లలో 60 శాతానికి పైగా 3బీహెచ్‌కే , అంతకంటే పెద్దవే ఉండే అవకాశం ఉంది. ఇది హైదరాబాద్‌ను ముంబై, బెంగళూరు వంటి నగరాల కంటే ఖరీదైన మార్కెట్‌గా మారుస్తోంది. కేవలం మధ్యతరగతి మార్కెట్ నుండి 'ప్రీమియం మార్కెట్' వైపు హైదరాబాద్ అడుగులు వేస్తోంది.
ఈ లగ్జరీ ట్రెండ్ నగర ప్రతిష్టను పెంచుతున్నప్పటికీ, సామాన్యుడికి మాత్రం గగణం అవుతోంది. భూముల ధరలు పెరగడంతో బిల్డర్లు కూడా చిన్న ఇళ్ల కంటే లాభాలు ఎక్కువగా వచ్చే పెద్ద ప్రాజెక్టులకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ₹50-60 లక్షల బడ్జెట్‌లో ఇల్లు దొరకడం అనేది ఇప్పుడు హైదరాబాద్‌లో అసాధ్యంగా మారిపోయింది. ఏదేమైనా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్‌ను సంపాదించుకుంది.