ఐస్ క్రీంతో అనారోగ్యం.. సంస్థకు.. డెలివరీ చేసిన జొమాటోలకు ఫైన్

విచారణ సందర్భంగా తయారీ తేదీలను ఫిర్యాదు చేసిన వ్యక్తే చెరిపేసి ఉంటారంటూ ప్రతివాదులు వాదన వినిపించారు.;

Update: 2026-04-30 05:30 GMT

ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించిన ఐస్ క్రీం తిన్నంతనే అనారోగ్యానికి గురి కావటం.. దీనిపై సదరు సంస్థతో పాటు.. డెలివరీలో పాలుపంచుకున్న జొమాటోలపై సేవాలోపానికి జరిమానా విధించి న్యాయం చేయాలని కోరుతూ వినియోగదారుల కోర్టును ఆశ్రయించిన బాధితుడికి ఎట్టకేలకు న్యాయం దక్కిన ఉదంతంగా దీన్ని చెప్పాలి. ఐస్ క్రీం తిని అనారోగ్యానికి కారణమైన సంస్థకు.. డెలివరీ జొమాటోలకు కలిపి రూ.10వేలు ఫైన్.. కోర్టు ఖర్చుల కింద రూ.5వేలతో పాటు.. ఐస్ క్రీం ఖర్చును కూడా తిరిగి చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఈ ఉదంతం హైదరాబాద్ లోని సైదాబాద్ కాలనీలో చోటు చేసుకుంది. 2023 నవంబరు మూడున జొమాటో ద్వారా ఫ్యాన్సీ ఐస్ క్రీం నుంచి లీటరు అమెరికన్ డ్రైప్రూట్ ఐస్ క్రీం కంటైనర్.. 60 ఎంఎల్ చాకోబార్ ను కొనుగోలు చేశారు. ఐస్ క్రీం తిన్న తర్వాత బాధితుడు పవన్.. అతడి కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఐస్ క్రీం పాకెట్ ను పరిశీలించగా.. అందులో తయారీ తేదీతో పాటు.. ఎమ్మార్పీలు లేవన్న విషయాన్ని గుర్తించారు. ఇదే విషయాన్ని సదరు ఐస్ క్రీం సంస్థకు సమాచారం ఇవ్వగా వారు పట్టించుకోలేదు. దీంతో బాధితుడు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు.

విచారణ సందర్భంగా తయారీ తేదీలను ఫిర్యాదు చేసిన వ్యక్తే చెరిపేసి ఉంటారంటూ ప్రతివాదులు వాదన వినిపించారు. ఈ నేపథ్యంలో బాధితుడు మరోసారి సదరు ఐస్ క్రీంను ఆర్డర్ పెట్టారు. సదరు ఐస్ క్రీం పాకెట్ మీద తయారీ తేదీ లేదన్న విషయాన్ని గుర్తించారు. అంతేకాదు ఎమ్మార్పీలు కూడా వేయటం లేదన్న విషయాన్ని ఫోటోలు తీసుకోవటం ద్వారా ఆధారాల్ని కోర్టును సమర్పించారు. ఈ నేపథ్యంలో కేసు పూర్వాపరాల్ని పరిశీలించిన హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ 2 అధ్యక్షుడు.. సభ్యులు ప్రతివాద సంస్థ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా పేర్కొంటూ తీర్పును ఇచ్చింది.

ఈ సందర్భంగా తాము కేవలం డెలివరీలు చేస్తామే తప్పించి.. తమకు నాణ్యతకు సంబంధించిన బాధ్యత లేదన్న వాదనను జొమాటో తరఫు వాదనలు వినిపించారు. దీనికి అంగీకరించని కమిషన్.. బాధితుడికి ఎదురైన కష్టానికి బాధ్యత సంయుక్తంగా బాధ్యత వహించాలని పేర్కొంటూ ఇరువురికి ఫైన్ విధిస్తూ తీర్పును ఇచ్చారు.

Tags:    

Similar News