అత్యంత బలవంతుడివి !

చాలా మంది తమ గురించి తాము తక్కువ చేసుకుంటారు. సెల్ఫ్ సింపతీ చూపించుకుంటారు. నేను అమాయకుడిని అనర్హుడిని అని భావనను బలంగా మెదడులోకి ఎక్కించుకుంటారు.;

Update: 2026-03-28 06:30 GMT

ఈ సృష్టిలో మనుషులు అందరికీ సమానంగానే బలం ఉంటుంది. తెలివి ఉంటుంది. బుద్ధి జ్ఞానం ఉంటుంది. అయితే వాటిని ఎవరు ఎంత వాడుతున్నారు అన్న దానిని బట్టే వారి విజయాలు ఆధారపడి ఉంటాయి. జేబులో వంద రూపాయలు అందరికీ ఇస్తే ఎక్కువ ఖర్చు చేసిన వాడు ధనవంతుడిగా కనిపిస్తాడు. పది ఇరవై ఖర్చు చేసిన వాడు లేని వాడుగా ఉంటాడు. ఇదే అసలైన వాస్తవం. ఉన్న తెలివిని బయటకు తీయాలి. సరిగ్గా వాడుకోవాలి. అపుడు అందరితో పాటుగా విజయం తలుపు తడుతుంది.

భావోద్వేగాలు అంతే :

ఇక మనుషులు అందరిలోనూ భావోద్వేగాలు దాదాపుగా సమానంగానే ఉంటాయి. కొందరు వాటిని అదిమి పట్టుకుంటారు, లౌక్యంగా ఉంటూ అందులో సౌఖ్యం చూసుకుంటారు. మరి కొందరు మాత్రం తొందరగా బయటపడతారు. వాటిని జాగ్రత్తగా డీల్ చేయడంలోనే సక్సెస్ సూత్రం ఉంది అని నిపుణులు అంటారు. బేలతనం తో ఉంటే అదే స్పీడ్ బ్రేకర్ గా మారుతుంది అని చెబుతారు. అతిగా స్పందించడం ఒకే విషయాన్ని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోవడం వంటివి చేయడం వల్ల చాలా మంది వెనకబడిపోతూంటారు. దేనికి ఎంత విలువ ఇవ్వాలో దీనికి ఎంత మెదడులో స్టోరేజ్ చేయాలో తెలుసుకోవడంలోనే జయం ఆధారపడి ఉంటుందని చెబుతారు.

సెల్ఫ్ సింపతీ కాన్సెప్ట్ :

చాలా మంది తమ గురించి తాము తక్కువ చేసుకుంటారు. సెల్ఫ్ సింపతీ చూపించుకుంటారు. నేను అమాయకుడిని అనర్హుడిని అని భావనను బలంగా మెదడులోకి ఎక్కించుకుంటారు. దాని వల్లనే అసలు ఇబ్బందులు వస్తున్నాయని అంటారు మానసిక వైద్య నిపుణులు. స్వీయ సానుభూతిని మించిన తప్పిదం వేరొకటి లేదని అంటారు. ఈ విధంగా చేసుకోవడం వల్ల అభివృద్ధిని సాధించలేక ఎక్కడో అగాధంలో పడిపోతారు అని చెబుతారు. సానుభూతి పక్క వారి మీద సమయానుసారం చూపించడంలో మానవత్వం ఉండొచ్చేమో కానీ తన మీద తానే సానుభూతిని చూపించడం ద్వారా మనిషి తాను దేనికీ పనికి రాని వాడిని అని నిర్ధారణకు వచ్చేలా సెల్ఫ్ సెర్టిఫికేట్ ఇచ్చేసుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు.

సమస్యలు అన్నీ అంటూ :

ఈ భూమి మీద సమస్త జీవ రాశులూ బతుకు పోరాటం చేస్తూ ఉంటాయి. చిన్న చీమనే తీసుకుంటే అది ఎక్కడో పంచదార రేణువుని మోసుకుని వస్తూ సదూరం ప్రయాణిస్తుంది. ఈ క్రమంలో ఎన్నో సార్లు దాని నుంచి ఆ పంచదార రేణువు పక్కకు పోతుంది. అయినా సరే సరిచేసుకుని దానిని తన గమ్య స్థానానికి చేర్చుకుంటుంది. ఈ క్రమంలో ఎక్కడా నిరాశ పడదు, చికాకు పడదు, అదే మనిషి అయితే ఒక సమస్య రాగానే నిలువునా నీరు అవుతాడు. బేల చూపులు చూస్తాడు, ఇంకా మాట్లాడితే అన్ని సమస్యలు తనకే వస్తున్నాయని బావురు మంటాడు. కాస్తా తల పైకెత్తి చూస్తే అందరూ ఇదే కాకపోయినా ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు.

సానుకూల దృక్పధంతో :

సమస్య వచ్చిందని బాధ పడడం కాదు దానికి పరిష్కారం వెతకడంలో శ్రద్ధ పెట్టడం లేదని ఆవేదన చెందాలని నిపుణులు అంటారు. సమస్యలు సవాళ్ళు ఎక్కువగా వస్తున్నాయంటే నీవు అతి బలవంతుడివి అని కూడా పాజిటివ్ గా అర్ధం చేసుకోవాలి. ఒక మాస్టర్ క్లాస్ లో పాఠం చెబుతూ తెలివైన విద్యార్ధినే ఎక్కువగా దెబ్బలు కొడతాడు. ఎందుకు అంటే వాడే రాణిస్తాడు రాటు తేలతాడు అని. అదే సూత్రం ఇక్కడా వర్తిస్తుంది. సమస్యలు వచ్చిన వాడు తాను వాటిని ఎదుర్కొనే సమర్ధుడిని అని ఎప్పుడైతే భావిస్తాడో అపుడే సగం విజయం సాధించేసినట్లే అంటారు. అందువల్ల అతి ధీమాతో కాదు కానీ సానుకూల దృక్పధంతో ప్రతీ వారూ ముందుకు సాగాలి. తాము తెలివైన వాళ్ళమని, మానసికంగా కడు బలవంతులమని ఎప్పటికపుడు నమ్ముతూ ముందుకు సాగినపుడు మెదడు కూడా అదే నిక్షిప్తం చేసుకుంటుంది. ఆ విధంగా ముందుకు సాగేలా చూస్తుంది.

Tags:    

Similar News