గ్రీన్‌లాండ్‌పై అమెరికా కన్ను: ఆర్కిటిక్‌లో యుద్ధ మేఘాలు.. అసలేం జరుగుతోంది?
ఆర్కిటిక్ మంచు ఖండంలో వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన గ్రీన్‌లాండ్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో ప్రధాన కేంద్రంగా మారింది.;
ఆర్కిటిక్ మంచు ఖండంలో వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన గ్రీన్‌లాండ్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో ప్రధాన కేంద్రంగా మారింది. ఈ ద్వీపాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు అమెరికా వేస్తున్న అడుగులు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. తాజాగా అమెరికా యుద్ధ విమానాల మోహరింపు వార్తలు ఈ ఉద్రిక్తతను మరింత పెంచాయి.
అమెరికా-కెనడా ప్రకటనతో మొదలైన కలకలం
అమెరికా-కెనడాల సంయుక్త రక్షణ సంస్థ ఎన్.ఓ.ఆర్.ఏ.డీ (నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్) చేసిన ఒక ప్రకటన ఈ వివాదానికి ఆజ్యం పోసింది. గ్రీన్‌లాండ్‌లోని అత్యంత కీలకమైన పిటుఫిక్ స్పేస్ బేస్ కు అమెరికా యుద్ధ విమానాలు చేరుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆర్కిటిక్ ప్రాంతంలో రక్షణ సామర్థ్యాలను పెంచుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. అయితే డెన్మార్క్ ప్రభుత్వం దీనిపై అధికారికంగా స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
డెన్మార్క్ అప్రమత్తం.. బలగాల తరలింపు
అమెరికా కదలికలను గమనిస్తున్న డెన్మార్క్ కూడా వెనక్కి తగ్గడం లేదు. గ్రీన్‌లాండ్‌లో తమ పట్టును నిలుపుకునేందుకు అదనపు సైనిక బలగాలను, యుద్ధ పరికరాలను మోహరించినట్లు సమాచారం. సోమవారం భారీగా సైనిక విమానాలు గ్రీన్‌లాండ్ వైపు వెళ్లడం అక్కడ పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.
ట్రంప్ ఫ్యాక్టర్: ఎందుకింత ఆసక్తి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదన తెచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. భౌగోళికంగా గ్రీన్‌లాండ్ అమెరికాకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. ముఖ్యంగా రష్యా, చైనాల నుంచి ఎదురయ్యే ముప్పులను అడ్డుకోవడానికి అక్కడి అపారమైన ఖనిజ సంపదను చేజిక్కించుకోవడానికి అమెరికా ఈ ప్రాంతాన్ని కీలకంగా భావిస్తోంది.
ఫ్రాన్స్ ఆగ్రహం.. యూరప్ దేశాల హెచ్చరిక
అమెరికా ధోరణిపై ఫ్రాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. "ఇల్లు తగలబడక ముందే అగ్నిమాపక సిబ్బంది కోసం ఇల్లు తగలబెట్టుకోవడం" లాంటి నిర్ణయమని అమెరికాను ఎద్దేవా చేసింది. అమెరికా గ్రీన్‌లాండ్ విషయంలో దూకుడుగా వెళ్తే అది ఐరోపా దేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలను దెబ్బతీస్తుందని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి హెచ్చరించారు.
గ్రీన్‌లాండ్ ఎందుకు ముఖ్యం?
రష్యా నుంచి వచ్చే క్షిపణులను గుర్తించేందుకు అమెరికా ఇక్కడ రాడార్ వ్యవస్థలను కలిగి ఉంది.ఇక్కడ అరుదైన రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. ఇవి టెక్నాలజీ తయారీకి కీలకం. మంచు కరుగుతున్న కొద్దీ ఆర్కిటిక్ ద్వారా కొత్త రవాణా మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి.
యుద్ధం వైపా.. దౌత్యం వైపా?
గ్రీన్‌లాండ్ విషయంలో అమెరికా మొండి వైఖరి అవలంబిస్తే అది నాటో మిత్రదేశాల మధ్యే చిచ్చు పెట్టే అవకాశం ఉంది. డెన్మార్క్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో ఆర్కిటిక్ ప్రాంతంలో పెగుతున్న ఈ వేడి భవిష్యత్తులో ప్రపంచ దేశాల మధ్య కొత్త సమీకరణాలకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.