మాజీ మావోయిస్టుల రాంప్ వాక్.. వీడియోలు వైరల్
చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో తుపాకులు పట్టి విప్లవోద్యమాన్ని నడిపిన మహిళా మావోయిస్టులు ఇప్పుడు చేనేత వస్త్రాలకు మోడలింగ్ చేసేందుకు రాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవుల్లో తుపాకులు పట్టి విప్లవోద్యమాన్ని నడిపిన మహిళా మావోయిస్టులు ఇప్పుడు చేనేత వస్త్రాలకు మోడలింగ్ చేసేందుకు రాంప్ వాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా మావోయిస్టులు అనగానే మనకు గుర్తొచ్చేది దట్టమైన అడవుల్లో తుపాకులతో సంచరించే తిరుగుబాటుదారులే. అయితే ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ప్రభుత్వానికి లొంగిపోయిన మావోయిస్టులు ఇప్పుడు కొత్త తరహాలో కనిపిస్తున్నారు.
జాతీయ చేనేత దినోత్సవ వేదికగా రాంప్ వాక్
రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా లొంగిపోయిన మహిళా మావోయిస్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకప్పుడు అడవుల్లో గడిపిన మహిళలు చేనేత వస్త్రాలను ధరించి, నమ్మకంతో రాంప్ మీద నడిచారు. వీరిని చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యంతో పాటు ఎంతో ఆసక్తిని ప్రదర్శించారు. కాగా, ఈ రాంప్ వాక్ కేవలం ఫ్యాషన్ షోలా కాకుండా మాజీ మావోయిస్టుల్లో మార్పుకు ఒక నిదర్శనంగా చెబుతున్నారు. హింసాత్మక మార్గాన్ని వీడి, ప్రధాన స్రవంతిలోకి వచ్చిన తర్వాత వారికి దక్కిన గౌరవానికి, వారిలో కలిగిన ఆత్మవిశ్వాసానికి ఇది చిహ్నంగా నిలుస్తుందని అభివర్ణిస్తున్నారు. కొద్ది నెలల క్రితం లొంగిపోయిన వీరు ప్రస్తుతం వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, కొత్త ఉద్యోగ అవకాశాలతో మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారని చెబుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. "ఇది నమ్మశక్యం కాని మార్పు. కొన్ని ఏళ్ల క్రితం ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు," అని ఒకరు కామెంట్ చేయగా, "నిజమైన మహిళా సాధికారత అంటే ఇదే" అని మరొకరు ప్రశంసించారు. చాలా మంది నెటిజన్లు, సమాజంలోకి తిరిగి వచ్చిన వీరికి దక్కుతున్న అవకాశాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పటి అడవి బాట నుండి రాంప్ వరకు వీరు సాగించిన ప్రయాణం, ఎవరైనా సరే సరైన మార్గంలోకి వస్తే మంచి జీవితాన్ని పొందగలరని నిరూపిస్తోందని అంటున్నారు. మాజీ మావోయిస్టులలో వచ్చిన ఈ మార్పు ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తోందని అంటున్నారు.