తుర్కియే అధ్యక్షుడి కుక్కబుద్ది.. కశ్మీర్ పై మళ్లీ అదే వాగుడు

తుర్కియే (టర్కీ) అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు.;

Update: 2025-09-24 05:47 GMT

తుర్కియే (టర్కీ) అధ్యక్షుడు రెసిప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కారు. ఐక్యరాజ్యసమితి 80వ సర్వసభ్య సమావేశంలో ప్రపంచ నేతలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న కశ్మీర్ వివాదాన్ని మళ్లీ ప్రస్తావించారు. కశ్మీర్ సమస్యను ఐరాస భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అక్కడి ప్రజలకు చర్చల ద్వారానే శాంతి, అభివృద్ధి సాధ్యమని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్, పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ప్రస్తావించిన ఎర్డోగాన్, ఉద్రిక్తతలు ఘర్షణలకు దారితీసినట్టు వ్యాఖ్యానించారు. అనంతరం ఇరుదేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించారు. "ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్-పాక్ సహకారం అత్యంత కీలకం" అని ఆయన అన్నారు.

పాత పల్లవి, కొత్త వేదిక

ఎర్డోగాన్ కశ్మీర్ అంశాన్ని ఐరాస వేదికపై ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ప్రతి ఏడాది ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. 2019 నుంచి ఐరాస ప్రసంగాల్లో కశ్మీర్ అంశాన్ని నిరంతరం ప్రస్తావిస్తూ వస్తున్నారు. భారతదేశం ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, కశ్మీర్ సమస్య పూర్తిగా తమ అంతర్గత వ్యవహారం అని స్పష్టం చేసినప్పటికీ, ఎర్డోగాన్ తన పాత వైఖరినే కొనసాగిస్తున్నారు.

ఎర్డోగాన్ వ్యాఖ్యలపై భారత్ అసహనం

భారత ప్రభుత్వం ఎర్డోగాన్ వ్యాఖ్యలపై పలుమార్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధులు ఎర్డోగాన్ వ్యాఖ్యలు అనుచితమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కావని స్పష్టం చేశారు. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. టర్కీ తన సొంత అంతర్గత సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు.

రాజకీయ అజెండాపై విమర్శలు

ప్రపంచ శాంతి కోసం ఏర్పడిన ఐరాస వేదికను టర్కీ అధ్యక్షుడు తన రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పాకిస్థాన్‌తో తన బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, ఇస్లామిక్ దేశాల మధ్య తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ఎర్డోగాన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో భారత్, టర్కీ మధ్య సంబంధాలు దెబ్బతినడానికి కూడా ఈ వ్యాఖ్యలు ఒక కారణమని చెప్పవచ్చు.

టర్కీకి భారత్ ప్రతిఘటన

ఎర్డోగాన్ ప్రకటనలకు దీటుగా భారత్ కూడా ప్రతిఘటిస్తోంది. టర్కీకి చెందిన అనేక ప్రాజెక్టులలో వ్యాపార సంబంధాలను తగ్గించుకుంటోంది. టర్కీకి అతిపెద్ద శత్రువుగా ఉన్న సైప్రస్‌తో రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ పరిణామాలు టర్కీకి ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడంలో టర్కీ పాత్ర ఉందని భారతదేశం ఆధారాలతో బయటపెట్టడం కూడా అంతర్జాతీయంగా టర్కీకి ఎదురుదెబ్బగా మారింది.

మొత్తంగా ఎన్ని హెచ్చరికలు చేసినా తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ తన తీరును మార్చుకోవడం లేదు. భారత్ పట్ల ఆయన వ్యతిరేక వైఖరి అంతర్జాతీయ వేదికపై మరోసారి స్పష్టమైంది.

Tags:    

Similar News