కేశినేని వర్సెస్ కేశినేని.. తమ్ముడుపై ఈడీకి అన్న ఫిర్యాదు!

గత కొంతకాలంగా సైలెంటుగా ఉన్న విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని మళ్లీ యాక్టివ్ అయ్యారు.;

Update: 2025-11-04 12:06 GMT

గత కొంతకాలంగా సైలెంటుగా ఉన్న విజయవాడ మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అలియాస్ కేశినేని నాని మళ్లీ యాక్టివ్ అయ్యారు. తన చిరకాల ప్రత్యర్థి, సొంత తమ్ముడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఏపీ లిక్కర్ స్కాంలో మనీలాండరింగ్ పై దర్యాప్తు చేస్తున్న ఈడీ.. విజయవాడ ఎంపీ చిన్ని, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల ద్వారా జరిగిన నగదు లావాదేవీలపైనే దృష్టి పెట్టాలని నాని కోరారు. లిక్కర్ స్కాంలో ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డితో విజయవాడ ఎంపీ చిన్నికి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, వీరిద్దరి మధ్య జరిగిన నగదు లావాదేవీలతో లిక్కర్ స్కాంకు సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు మాజీ ఎంపీ నాని.

వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం అంటూ ఏం లేదని ఆ పార్టీ నేతలు చెబుతుండగా, అదే పార్టీకి చెందిన మాజీ ఎంపీ నాని మాత్రం లిక్కర్ స్కాంలో విజయవాడ ఎంపీ చిన్ని పాత్ర కూడా ఉందని ఆరోపణలు చేయడం, ఏకంగా ఈడీకి ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. మాజీ ఎంపీ తీరు వల్ల వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయే పరిస్థితి వస్తోందని అంటున్నారు. అయితే మాజీ ఎంపీ నాని ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నందున ఆయన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని వైసీపీ తప్పించుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కానీ, నైతికంగా వైసీపీని ఇబ్బందిపెట్టేలా మాజీ ఎంపీ కేశినేని నాని అడుగులు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ పోలీసులు మనీలాండరింగుపై ఇచ్చిన సమాచారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ఇప్పటికే విచారణ మొదలుపెట్టింది. అయితే ఇప్పటివరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయకపోయినప్పటికి పలువురిని విచారించింది. ఇలాంటి సమయంలో ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డికి చెందిన పలు కంపెనీల వివరాలను తెలియజేస్తూ, ఆయా కంపెనీల్లో విజయవాడ ఎంపీకి భాగస్వామ్యం ఉందని ఆరోపిస్తూ మాజీ ఎంపీ కేశినేని నాని ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. లిక్కర్ స్కాం నిందితులు, ఎంపీ చిన్ని కుటుంబ సభ్యులకు కొన్ని వ్యాపార సంస్థల్లో భాగస్వామ్యం ఉందని చెప్పిన మాజీ ఎంపీ, ఆయా సంస్థలను నగదును విదేశాలకు పంపేందుకు వాడుకున్నట్లు ఆరోపించారు.

చిన్ని, అతని భార్య జానకిలక్ష్మి వ్యాపార భాగస్వామి రాజ్ కేసిరెడ్డి (లిక్కర్ స్కాంలో ఏ1) 'ప్రైడ్ ఇన్‌ఫ్రాకామ్ ఎల్‌ఎల్‌పి' తోపాటు ఇతర సంస్థల్లో భాగస్వాములుగా ఉన్నారని నాని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సంస్థలను 'ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్' (నేరం ద్వారా సంపాదించిన డబ్బు) మళ్లించడానికి ఉపయోగించి ఉండవచ్చని, ఇది మనీ-లాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002ని ఉల్లంఘించడమేనని మాజీ ఎంపీ స్పష్టం చేశారు

Tags:    

Similar News