రాష్ట్రపతి డిజిటల్ పేమెంట్.. సరస్ మేళాలో ద్రౌపది ముర్ము స్పెషల్ అట్రాక్షన్

దేశ సర్వోన్నత పీఠంలో ఉన్న రాష్ట్రపతి స్వయంగా డిజిటల్ పేమెంట్ చేయడం డిజిటల్ ఇండియా సాధిస్తున్న విజయానికి నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.

Update: 2026-10-15 08:33 GMT

సామాన్యుల నుంచి సంపన్నుల వరకు.. చిల్లర వ్యాపారి నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు.. నేడు దేశంలో ఎక్కడ చూసినా ‘యూపీఐ పేమెంట్లు’ సర్వసాధారణమైపోయాయి. రూపాయి బిళ్ల అవసరం లేకుండా కేవలం ఒకే ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ తో క్షణాల్లో చెల్లింపులు చేసే సాంకేతికత ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమైంది. డిజిటల్ విప్లవంలో దేశ ప్రథమ పౌరురాలే స్వయంగా భాగస్వామ్యం కావడం విశేష ఆకర్షణగా నిలిచింది. విజయవాడలో జరుగుతున్న 'సరస్ మేళా'ను సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అక్కడ ఒక స్టాల్‌లో చీర కొనుగోలు చేసి, తన మొబైల్ ద్వారా యూపీఐ పద్ధతిలో నగదు చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

విజయవాడ వేదికగా జరుగుతున్న జాతీయ సరస్ మేళా ప్రదర్శనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచ్చేశారు. ఈ సందర్భంగా మహిళా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను ఆమె ఆసక్తిగా పరిశీలించారు. అక్కడి హస్తకళలు, చేనేత వస్త్రాల ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఒక స్టాల్‌లో తనకు నచ్చిన చీరను కొనుగోలు చేశారు. బిల్లు చెల్లించే సమయాన తన మొబైల్ ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేశారు. యూపీఐ ద్వారా క్షణాల్లో చెల్లింపులు పూర్తి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

దేశ సర్వోన్నత పీఠంలో ఉన్న రాష్ట్రపతి స్వయంగా డిజిటల్ పేమెంట్ చేయడం డిజిటల్ ఇండియా సాధిస్తున్న విజయానికి నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ కలసి 2016 ఏప్రిల్ 11న యూపీఐ వ్యవస్థను ప్రారంభించాయి. కేవలం కొన్ని బ్యాంకులతో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్ నేడు దేశ ఆర్థిక వ్యవస్థనే మార్చివేసిందని అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం డిజిటల్ రియల్-టైమ్ లావాదేవీలలో దాదాపు 50% వాటా మన దేశానిదే కావడం విశేషంగా చెబుతున్నారు. ప్రతి నెలా వందల కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. చిన్న వ్యాపారులు, కూరగాయల అమ్మకందారుల నుంచి పెద్ద వ్యాపారాల వరకు ప్రతి లావాదేవీ డిజిటల్ రూపంలోనే సాగుతోంది.

యూపీఐ సాంకేతికత ఇక్కడితో ఆగడం లేదు. రాబోయే రోజుల్లో ఇది మరింత సంచలనాత్మక మార్పులు తేనుందని చెబుతున్నారు. ఏఐ ఆధారిత వాయిస్ కమాండ్ల ద్వారా మాటలతోనే సులువుగా చెల్లింపులు చేసే సదుపాయం రాబోతోందని నిపుణులు చెబుతున్నారు. సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, శ్రీలంక వంటి అనేక దేశాల్లో ఇప్పటికే యూపీఐ అందుబాటులోకి రాగా, భవిష్యత్తులో ప్రపంచమంతటా భారతీయులు కరెన్సీ మార్పిడి లేకుండా నేరుగా చెల్లింపులు చేయవచ్చు. అలాగే ఇంటర్నెట్ లేని మారుమూల ప్రాంతాల్లోనూ ఫీచర్ ఫోన్ల ద్వారా నేరుగా లావాదేవీలు జరిపేలా సాంకేతికత విస్తరిస్తోంది. విజయవాడ మేళాలో రాష్ట్రపతి డిజిటల్ చెల్లింపు చేయడం నుంచి గ్రామీణ మహిళలు క్యూఆర్ కోడ్ స్కానర్లు వాడడం వరకు.. భారత్ ఎంత వేగంగా డిజిటల్ వైపు అడుగులు వేస్తోందో స్పష్టమవుతోంది. ఆర్థిక పారదర్శకతకు, సులువైన జీవనానికి యూపీఐ వేసిన బాట భవిష్యత్తులో భారత్‌ను మరింత బలమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మార్చుతుందని అంటున్నారు.

Tags:    

Similar News