తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై మరో కొత్త పార్టీ.. దళపతి వర్సెస్ ధనుష్
రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో ఉన్న ధనుష్ ఇటీవల కాలంలో ఈ దిశగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.
తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి మధ్య ఉన్న విడదీయరాని బంధం ఉంది. ద్రవిడ నాట రాజకీయాల్లో దశాబ్దాలుగా సినీ రంగ ప్రముఖులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. వీరిలో దివంగత మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత వెండితెరపై ఓ వెలుగు వెలిగిన నటీనటులు కావడం గమనార్హం. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా సినీ రచయితగా, దర్శకుడిగా వెండితెర మీదుగానే రాజకీయాల్లో ఆరితేరారు. ఇక ప్రస్తుత సీఎం దళపతి విజయ్ లిఖించిన చరిత్ర అందరికీ తెలిసిందే. పార్టీని పెట్టి తక్కువ సమయంలో తొలి ప్రయత్నంలో ముఖ్యమంత్రి అయిన చరిత్ర దళపతి విజయ్ ది. ఈ నేపథ్యంలో తమిళ తెర మీదుగా మరో స్టార్ హీరో కూడా రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమవుతున్నారని సంకేతాలు అందుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ అల్లుడు ధనుష్.
తమిళనాడులో కొత్త పార్టీ పెట్టాలని ధనుష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆసక్తిరేపుతోంది. తమిళగ ఎళుచ్చి కళగం (తమిళనాడు పురోగమన పార్టీ) అనే పేరుతో ధనుష్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. తమిళగ ఎళుచ్చి కళగం పేరుతో ఎన్నికల సంఘంలో ప్రాంతీయ పార్టీని రిజిస్టర్ చేయడంతో ఈ ఊహాగానాలు మరింత ఎక్కువగా వ్యాపిస్తున్నాయని చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాట రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది వెండితెర వేల్పులు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ధనుష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోందని అంటున్నారు.
రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తితో ఉన్న ధనుష్ ఇటీవల కాలంలో ఈ దిశగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ముందుగా తన లక్ష్యాలను ప్రజలకు వివరించేందుకు అభిమాన సంఘాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల తన అభిమాన సంఘాల పతాకాన్ని ఆవిష్కరించిన ధనుష్ పరోక్షంగా తన రాజకీయ ఆకాంక్షలపై సంకేతాలిచ్చారని విశ్లేషిస్తున్నారు. వరుస పరిణామాలను గమనిస్తున్న విశ్లేషకులు ద్రవిడ రాజకీయాల్లో ఉనికి చాటుకోడానికి ధనుష్ సిద్ధమవుతున్నారని నమ్ముతున్నారు. అభిమాన సంఘాల జెండా ఆవిష్కరించడం దగ్గర నుంచి పార్టీ పేరు రిజిస్టర్ చేయడం వరకు గమనిస్తే ధనుష్ ఆలోచనలు ఏంటో అర్థమవుతున్నాయని అంటున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయవచ్చిని అంటున్నారు.
టార్గెట్ 2031
2031లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి బరిలోకి దిగాలని ధనుష్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా, ఈ రాజకీయ ప్రయాణంలో సూపర్‌స్టార్, తన మాజీ మామ రజినీకాంత్ మద్దతు, మార్గదర్శకత్వం కూడా ఆయనకు ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. తమిళనాట దశాబ్దాలుగా పాతుకుపోయిన ప్రధాన ద్రావిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిప్యతకు చెక్ పెడుతూ.. నటుడు విజయ్ తన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీతో అనూహ్య విజయం సాధించి సీఎం పీఠాన్ని అధిరోహించడం తమిళ రాజకీయాల్లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారింది. విజయ్ అనుసరించిన వ్యూహాలు, తక్కువ కాలంలోనే ప్రజల్లోకి దూసుకెళ్లిన వైనం ఇటు తమిళ చిత్రసీమలోని ఇతర హీరోలు, హీరోయిన్లలోనూ కొత్త ఆలోచనలను రేకెత్తించాయని అంటున్నారు. దళపతి విజయ్ సాధించగలిగినప్పుడు, తాము ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదు? అనే ప్రశ్న ఇప్పుడు కోలీవుడ్ స్టార్స్ ను ఆలోచనలకు గురిచేస్తోందని అంటున్నారు. ఇందులో భాగంగానే ధనుష్ రాజకీయాల దిశగా ప్రయాణం వేగవంతం చేశారని అంటున్నారు.