డీలిమిటేషన్ బిల్లు పాస్ అవుతుందా ?

డీలిమిటేషన్ గురించి చర్చించేందుకు రాజ్యాంగ సవరణ చేసి ఈ ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్ళేందుకు ఈ సమావేశాలలో నిర్ణయం తీసుకుంటారు.;

Update: 2026-04-14 18:36 GMT

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈ నెల 16 నుంచి మొదలవుతున్నాయి. డీలిమిటేషన్ గురించి చర్చించేందుకు రాజ్యాంగ సవరణ చేసి ఈ ప్రక్రియను ముందుకు తీసుకుని వెళ్ళేందుకు ఈ సమావేశాలలో నిర్ణయం తీసుకుంటారు. అయితే ఎన్డీయేకు లోక్ సభలో సాధారణ మెజారిటీ ఉంది. అదే సమయంలో పార్లమెంట్ లో ఈ బిల్లు విషయంలో ఇండియా కూటమి వ్యతిరేకిస్తోంది. దాంతో బిల్లు పాస్ అవుతుందా లేదా అన్న చర్చ అయితే సాగుతోంది.

ఎన్డీయేతో ఢీ :

ఇండియా కూటమి అయితే ఎన్డీయేతో ఢీ కొట్టడానికే చూస్తోంది. అసలు ఇపుడే అర్జంటుగా ఎందుకు ఈ బిల్లుని తీసుకుని వస్తున్నారు అని ప్రశ్నిస్తోంది. 2027లో జన గణన పూర్తి అయ్యాక ఆ లెక్కల ఆధారంగా కనుక డీలిమిటేషన్ చేపడితే బాగుంటుంది కదా అని సూచిస్తోంది. ఈ నేపధ్యంలోనే ఇండియా కూటమి పార్టీల నేతలు అంతా బుధవారం న్యూ ఢిల్లీలో సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ఏ రకమైన వ్యూహం రూపొందిస్తారు అన్నది ఆసక్తిగా ఉంది.

బీజేపీ ఆలోచనలు :

ఇక పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లు-2026 ముఖ్య ఉద్దేశ్యం లోక్‌సభ సీట్లను 850కి పెంచడం. కొత్త జనాభా లెక్కల డేటా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. ఈ బిల్లు అమలు తో దేశంలోని వివిధ రాష్ట్రాలలో పడే ప్రభావం పట్ల ప్రతిపక్షాలలో తీవ్ర ఆందోళన కలుగుతోంది. అంతే కాదు ఈ బిల్లుకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంది. నియోజకవర్గాలను పునర్నిర్మించడానికి ఒక డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారాన్ని కల్పించేలా రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంది.

కమిషన్ నియామకం:

కొత్తగా నియోజకవర్గాల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసే డీలిమిటేషన్ కమిషన్ లో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు మెంబర్లుగా ఉంటారు. పదవీ విరమణ చేసిన లేదా పదవిలో ఉన్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఒక డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ మీదట ఈ కమిషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఇదిలా ఉంటే డీలిమిటేషన్ వల్ల దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యంపై అక్కడ ఆందోళన ఉంది దీని వల్ల దేశంలో మొత్తం మీద రాజకీయ సమతుల్యత దెబ్బ తింటుందని కూడా చర్చ సాగుతోంది.

అయ్యే పనేనా :

మరో వైపు చూస్తే ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన ఇండియా బ్లాక్ లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా గట్టి వైఖరిని తీసుకుంది. ఈ ప్రక్రియ భారత సమాఖ్యవాదానికి గణనీయమైన ముప్పును కలిగిస్తుందని అలాగే దక్షిణ రాష్ట్రాలను ఇబ్బందిలో నెడుతుందని కూడా ఇండియా కూటమి నేతలు వాదిస్తున్నారు. దాంతో రాజ్యాంగ సవరణ అంటే ఇండియా కూటమి నుంచి మద్దతు లభిస్తుందా అన్న చర్చ సాగుతోంది. ఒక వేళ మద్దతు ఇవ్వకపోతే కనుక బిల్లు పాస్ అవుతుందా అన్న డౌట్లు వస్తున్నాయి. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News