ఉగ్ర డాక్టర్ల నెట్ వర్క్ బయటపెట్టిన మరో డాక్టర్.. ఈయన తెలుగువారే!
దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న బాంబు పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.;
దేశ రాజధాని ఢిల్లీలో నెలకొన్న బాంబు పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. 13 మంది ప్రాణాలను బలిగొన్న ఈ ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ పేలుడు కేసు దర్యాప్తులో పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగా.. ఈ పేలుళ్లకు ఉపయోగించిన ఐ20 కారులో ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ (టీఏటీపీ) ఉన్నట్లు తెలిసిందనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.
అవును... ఢిల్లీలో ఎర్రకోట వద్ద ఐ20 కారును పేల్చేందుకు బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ అత్యంత ప్రమాదకర కెమికల్ ను వాడాడని.. దాని శాస్త్రీయ నామం ట్రైఅసిటోన్ ట్రైపెరాక్సైడ్ కాగా.. దీన్ని మీడియా, భద్రతా వర్గాలు 'మదర్ ఆఫ్ సైతాన్' గా పిలుస్తాయి. ఆ దాడిలో దీన్ని వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయని ఓ నివేదిక వెల్లడించింది. దీన్ని సాధారణ బాంబులా గుర్తించడం కష్టమని అంటున్నారు.
ఈ ఉగ్రకుట్రంలో అత్యధికంగా ఉన్న వైద్యులు.. తమ సైన్స్ విజ్ఞానాన్ని పేలుడు పదార్థాల తయారీకి ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఈ 'టీఏటీపీ'ని అమ్మోనియం నైట్రేట్ తో కలిపి పేలుడు పదార్ధాన్ని సిద్ధం చేశారని అంటున్నారు. దీన్నే.. ఫరిదాబాద్ లో దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకొన్నాయి. ఐ20 కారులో దీని కారణంగానే పేలుడు జరిగినట్లు చెబుతున్నారు.
ఇలా స్వాధీనం చేసుకున్న రసాయన సమ్మేళనం నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నప్పుడే జమ్మూకశ్మీర్ లోని నౌగాం పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు అని చెబుతున్నారు.
వైద్యులందు ఈ వైద్యులు వేరగా.. వీరు ఉగ్రమూకలయా!:
వైద్యో నారాయణో హరీ అంటారు.. తల్లి జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మ ఇస్తారని అంటారు.. అందుకే వైద్యులను భగవంతుడితో సమానంగా భావిస్తారు! అలాంటి వైద్యులే ఉగ్రవాదులుగా మారి, తమకున్న జ్ఞానాన్ని పేలుడు పదార్థాల సృష్టికి ఉపయోగించి, మనుష్యుల ప్రాణాలు తీస్తున్నారు! తాజాగా బయటపడిన ఫరిదాబాద్ ఉగ్రకుట్రంలోని ముఠాలో అత్యధిక మంది డాక్టర్లే కావడం గమనార్హం.
ప్రధానంగా ఢిల్లీ బాంబు పేలుడులోని ఆత్మాహుతి బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ ఒకడు కాగా... ఇతడితో పాటు డాక్టర్ ముజమ్మిల్ షేక్, డాక్టర్ ఆదిల్ అహ్మద్, డాక్టర్ షాహిన్ షహిద్ కీలక పాత్ర పోషించారు. వీరితో పాటు మరికొంతమంది వైద్యులు... డాక్టర్ పర్వేజ్ సయ్యద్ అన్సారీ, డాక్టర్ మొహియుద్దీన్ సయ్యద్, డాక్టర్ ముజఫర్ అహ్మద్ లు అనుమానితుల జాబితాలో ఉన్నారు.
మరోవైపు తాజాగా... పశ్చిమ బెంగాల్ లోని ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలో ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఒక ఎంబీబీఎస్ విద్యార్థిని అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని.. హర్యానాలోని అల్ ఫలా యూనివర్శిటీలో విద్యార్థి జనీసూర్ ఆలం అలియాస్ నిసార్ ఆలమ్ గా గుర్తించారు! ఇదే క్రమంలో ఆ యునివర్శిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ కనిపించకుండా పోయారు.
ఉగ్ర డాక్టర్లకు డాక్టర్ ఐపీఎస్ తో చెక్!:
ఇలా కొంతమంది డాక్టర్లు కలిసి ప్రజల ప్రాణాలు తీస్తుంటే.. మరో వైద్యుడు మాత్రం ప్రజల కొసం పని చేస్తున్నారు. ఐపీఎస్ అధికారి అయిన ఆ వైద్యుడు.. సందీప్ చక్రవరి. ఈయన శ్రీనగర్ ఎస్పీగా బాద్యతలు నిర్వహిస్తున్నారు. గత నెల 18-19 అర్ధరాత్రి జైషేకు మద్దతుగా శ్రీనగర్ లో కొన్ని పోస్టర్లు వెలిసినప్పుడు.. దీనిపై ఆయన నిఘా పెట్టారు. ఈ సమయంలో.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వీరిద్వారా... వీరికి పోస్టర్లు ఇచ్చింది మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ అని తెలిసింది. అతడిని ప్రశ్నించగా... ఈ ఉగ్ర డాక్టర్ల నెట్ వర్క్ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో... సందీప్ చక్రవర్తి బృందం ఉన్నతాధికారులను అప్రమత్తం చేసింది. ఫలితంగా.. ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు డాక్టర్లను అదుపులోకి తీసుకొంది.
ఎవరీ డాక్తర్ సందీప్ చక్రవర్తి?:
శ్రీనగర్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి డాక్టర్ సందీప్ చక్రవర్తి స్వస్థలం ఏపీలో కర్నూలు జిల్లా. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో రిటైర్డ్ డాక్టర్ జీవీ రామగోపాల్ రావు, రిటైర్డ్ డీ.ఎం.హెచ్.వో పీసీ రంగమ్మ దంపతుల కుమారుడే సందీప్. ఈయన విద్యాభ్యాసం అంతా కర్నూలులోనే సాగింది. కర్నూలు మెడికల్ కాలేజ్ లోనే వైద్యవిద్య పూర్తి చేశారు. 2014లో ఐపీఎస్ కు ఎంపికయ్యారు.
ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి నిందితులపై చేపట్టిన ‘ఆపరేషన్ మహదేవ్’ లో ముఖ్యపాత్ర పోషించిన సందీప్ చక్రవర్తి... ఐదుసార్లు రాష్ట్రపతి పతకాలు, నాలుగు సార్లు జమ్మూకశ్మీర్ పోలీసు పతకాలతో పాటు ఇండియన్ ఆర్మీ చీఫ్ పురస్కారం, ఏడుసార్లు సీఆర్పీఎఫ్, ఐటీబీపీ డీజీపీ పురస్కారాలు అందుకున్నారు.