గచ్చుపలకల మ్యూజిక్.. నెటిజన్లను ఆకట్టుకున్న న్యూ ట్రెండ్!
ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, వస్తువులతో సంబంధం లేదని మహారాష్ట్రకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు దానిష్ షేక్ నిరూపించాడు.;
ప్రతిభకు పేదరికం అడ్డుకాదని, వస్తువులతో సంబంధం లేదని మహారాష్ట్రకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు దానిష్ షేక్ నిరూపించాడు. కేవలం రెండు గచ్చు పలకలను (ఫ్లోర్ టైల్స్) చేత్తో పట్టుకుని, వాటిని లయబద్ధంగా కొడుతూ అద్భుతమైన సంగీతాన్ని సృష్టిస్తున్నాడు. గుజరాత్‌కు చెందిన ప్రముఖ కళాకారుడు రాజు కళాకార్ వీడియోల స్ఫూర్తితో మొదలైన ఈ చిన్నారి ప్రయాణం, నేడు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుని ఒక వైరల్ సెన్సేషన్‌గా మారింది. చదువుతో పాటు ఈ వినూత్న కళను కూడా అలవర్చుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
స్ఫూర్తి నుంచి సృష్టి వరకు:
గుజరాత్‌కు చెందిన రాజు కళాకార్ అనే వ్యక్తి రెండు గచ్చు పలకలతో సంగీతం చేస్తూ పాటలు పాడటం మనం చూస్తుంటాం. ఆయన వీడియోలకు వేలల్లో అభిమానులు ఉన్నారు. మహారాష్ట్ర, ఛత్రపతి సంభాజీనగర్‌లోని మున్సిపల్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్న దానిష్ షేక్ కూడా ఆయనకు పెద్ద ఫ్యాన్. రాజు కళాకార్ వీడియోలను పదే పదే చూస్తూ, వాటిలో ఆయన ఆ పలకలను ఎలా ఉపయోగిస్తున్నారో గమనించాడు. కేవలం చూడటంతోనే ఆగిపోకుండా, తను కూడా రెండు పలకలు పట్టుకుని ఇంట్లో సాధన చేయడం మొదలుపెట్టాడు. అలా స్ఫూర్తిని పొంది తనదైన శైలిలో నేర్చుకున్నాడు.
పాఠశాల వేదికపై ప్రతిభా ప్రదర్శన:
దానిష్ నేర్చుకున్న ఈ విభిన్నమైన విద్య గురించి మొదట ఎవరికీ తెలియదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా అందరి ముందు తన టాలెంట్‌ను చూపించాలని నిర్ణయించుకున్నాడు. స్టేజ్ మీదకు వెళ్లి రెండు టైల్స్ పట్టుకుని లయబద్ధంగా మోగిస్తూ పాట పాడుతుంటే చూసేవారంతా ముక్కున వేలేసుకున్నారు. ఆ చిన్న చేతులతో పలకల మధ్య అంతటి నాదాన్ని ఎలా పుట్టిస్తున్నాడా అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ ప్రదర్శన స్కూల్ మొత్తాన్ని ఉర్రూతలూగించింది. టీచర్లు, తోటి విద్యార్థులు అతడి ప్రతిభను చూసి ఫిదా అయిపోయారు.
సోషల్ మీడియాలో వైరల్ సెన్సేషన్:
దానిష్ ప్రతిభను గుర్తించిన ఆ స్కూల్ ప్రిన్సిపల్ సంజీవ్ సోనార్, బాలుడి వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది, ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. పక్కా గ్రామీణ వాతావరణంలో, సాధారణ బాలుడు ఇంతటి వినూత్నమైన సంగీతాన్ని ఎలా చేస్తున్నాడో అని నెటిజన్లు ఆశ్చర్యపోయారు. నెల రోజుల్లోనే ఆ వీడియోకు ఏకంగా 50 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక లక్షలాది మంది ఆ బాలుడిని అభినందిస్తూ కామెంట్లతో ముంచెత్తారు. దీంతో ఆ చిన్నారి ఓ రాత్రిలో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు.
మనం ఏదైనా సాధించాలనుకుంటే ఖరీదైన వాయిద్యాలు, పెద్ద పెద్ద వేదికలు అవసరం లేదని దానిష్ నిరూపించాడు. మన చుట్టూ ఉండే సాధారణ వస్తువుల్లో కూడా సంగీతాన్ని వెతకవచ్చని ఈ బాలుడు చూపించాడు. రాజు కళాకార్ అనే కళాకారుడిని చూసి నేర్చుకున్న ఈ విద్య, నేడు దానిష్‌కు సొంత గుర్తింపును తీసుకువచ్చింది. ఇక కేవలం గచ్చు పలకల సంగీతంతోనే కాకుండా, తన గాత్రంతోనూ అందరినీ ఆకట్టుకుంటున్న ఈ బుడతడు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. ప్రతిభ ఎక్కడ ఉన్నా అది ఏదో ఒకరోజు తప్పకుండా వెలుగులోకి వస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం.