బక్రీద్ ముందే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: ప్రభుత్వానికి ముస్లిం సంస్థల అభ్యర్థన!
ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగకు కొన్ని రోజుల ముందే దేశంలో ఒక ఆసక్తికరమైన ప్రాధాన్యత కలిగిన పరిణామం చోటుచేసుకుంది.
ఈద్-ఉల్-అధా (బక్రీద్) పండుగకు కొన్ని రోజుల ముందే దేశంలో ఒక ఆసక్తికరమైన ప్రాధాన్యత కలిగిన పరిణామం చోటుచేసుకుంది. గోవును (ఆవు) `జాతీయ జంతువు`గా ప్రకటించాలంటూ జమియాత్ ఉలమా-యే-హింద్ (అర్షద్ మదానీ వర్గం) అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ చేసిన డిమాండ్‌కు ప్రస్తుతం పలు ముస్లిం సంస్థలు మద్దతుగా నిలుస్తున్నాయి. బక్రీద్ పండుగ కంటే ముందే కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా అధికారిక నిర్ణయం తీసుకోవాలని వారు కోరడంతో రాజకీయ, సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించడం ద్వారా గోహత్యల చుట్టూ జరుగుతున్న రాజకీయ దోపిడీకి.. ఆవు పేరుతో జరుగుతున్న మాబ్ లించింగ్స్ (దాడి చేసి చంపడం) వంటి దారుణాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయవచ్చని ఈ సంస్థలు భావిస్తున్నాయి.
భారతదేశంలో అత్యధిక జనాభా.. పెద్ద మొత్తంలో ముస్లిం ఓటు బ్యాంక్ కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ డిమాండ్ తెరపైకి రావడం విశేషం. సాధారణంగా హిందూ సంస్థల నుండి వచ్చే ఈ ప్రతిపాదన.. ఇప్పుడు ముస్లిం సమాజం నుండి బలంగా వినిపించడం వెనుక వ్యూహాత్మక అడుగులు కనిపిస్తున్నాయి. మునుముందు 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వస్తున్న చివరి బక్రీద్ కావడంతో ఈ పరిణామం రాజకీయ సమీకరణాలను వేగంగా మారుస్తోంది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ కూడా మదానీ డిమాండ్‌కు తాము పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై ముస్లిం సమాజంలో ఏకాభిప్రాయాన్ని నిర్మించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని.. యూపీ ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించడానికి కొందరు నేతలు సిద్ధమవుతున్నారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (AJUP) అధినేత హుమాయూన్ కబీర్ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ ముస్లిం సమాజానికి కీలక విజ్ఞప్తి చేశారు. పండుగ సందర్భంగా ఆవులను బలి ఇవ్వడం వల్ల సమాజంలో ఎలాంటి అశాంతి లేదా ఇబ్బందులు తలెత్తకూడదని..`గోమాతను చంపకూడదు` అని ఆయన కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న నిబంధనలను (రూల్ 195) ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం ఒక రోజు క్రితమే ఆంక్షలపై తీవ్రంగా స్పందించిన హుమాయూన్ ఆ తర్వాత ముస్లిం సమాజం ఇబ్బందుల్లో పడకూడదనే ఉద్దేశంతో గోమాతను రక్షించాలనే ధోరణిలో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
నిజానికి ప్రస్తుత భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం దేశ జాతీయ జంతువు `పులి`. అయినా కానీ.. హిందూ సమాజంలో ఆవును కేవలం ఒక జంతువుగా కాకుండా ప్రత్యక్ష దైవంగా, అమ్మ కంటే మిన్నగా భావిస్తారు. ఆవు పాలు శ్రేష్ఠమైనవని చిన్నప్పటి నుండి పాఠాలు నేర్చుకునే ఈ దేశంలో గోహత్యను ఒక మహాపాతకంగా పరిగణిస్తారు. పొరుగు దేశమైన నేపాల్ ఇప్పటికే 2015లోనే ఆవును తన అధికారిక జాతీయ జంతువుగా ధృవీకరించింది. ఆ తర్వాత భారత్‌లోనూ ఈ డిమాండ్ ఊపందుకుంది. సమాజంలో శాంతిభద్రతలను కాపాడటానికి గోవుకు అత్యున్నత గౌరవాన్ని కల్పించడానికి దానిని జాతీయ జంతువుగా ప్రకటించడమే సరైన న్యాయమని చాలా కాలంగా హిందూత్వవాదులు వాదిస్తున్నారు.
ఆవు చుట్టూ తిరిగే వివాదాలకు, క్రూరత్వానికి శాశ్వత ముగింపు పలకాలంటే దానికి జాతీయ హోదా ఇవ్వడమే ఏకైక మార్గమనే వాదన ఇప్పుడు ముస్లిం సంస్థల నుండి కూడా రావడం ఒక సానుకూల పరిణామంగా కనిపిస్తోంది. సమాజంలోని రెండు వర్గాల మధ్య సయోధ్యను కుదర్చడానికి.. మతపరమైన ఉద్రిక్తతలను తగ్గించడానికి ఈ ప్రతిపాదన ఒక వారధిలా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బక్రీద్ ముందే ముస్లిం లీడర్లు ఈ విధంగా కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు పంపడం.. ప్రధానిని కలవాలని నిర్ణయించుకోవడం దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది.