జూబ్లీహిల్స్ గెలుపు.. రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెంచుతుందా?
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అసాధారణ విజయం కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది.;
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అసాధారణ విజయం కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. నగరంలో అసలు ప్రాతినిధ్యమే లేని కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించింది. ఈ రెండు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సాధించిన విజయం కన్నా, జూబ్లీహిల్స్ లో దక్కిన గెలుపు కాంగ్రెస్ పార్టీని అమితానందానికి గురిచేస్తోందని అంటున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి దక్కిన విజయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని అంటున్నారు. గత మూడు ఎన్నికల్లో ఈ స్థానంలో ఎదురుదెబ్బలు తిన్న కాంగ్రెస్ పార్టీ విజయం అంచనాలకు మించినదిగా వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ సంస్థాగత బలం, అభ్యర్థి మాగంటి సునీతపై సానుభూతిని అధిగమించి 51 శాతం ఓట్లతో కాంగ్రెస్ విజయం సాధించడమంటే చిన్న విషయం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా బలం పెంచుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు అవుతోంది. ఆరు గ్యారెంటీ హామీలతోపాటు అనేక వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి అంతంతమాత్రమే సహకారం లభిస్తున్నా, ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్నారనే అభిప్రాయం ఉంది. అయితే సీఎం సమస్యలు క్షేత్రస్థాయిలో ప్రజలు పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండకపోవడంతో చాలా హామీలు అమలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని ప్రచారం జరిగింది. ఎన్నికల సమయంలో తమకు వాగ్దానం చేశారు కనుక హామీలు అమలు చేయాల్సిందేనని ప్రజలు పట్టుబడుతున్నారనే చర్చ జరిగింది. ఈ పరిస్థితుల్లో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఇబ్బంది పడే అవకాశం ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సందేహించారు.
కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ చాణక్యంతో ఈ సమస్యను అధిగమించారని జూబ్లీహిల్స్ ఫలితాలు రుజువు చేశాయని అంటున్నారు. సగం హామీలు అమలు చేయలేదన్న విమర్శలు ఉన్నప్పటికీ, బాకీ కార్డు అంటూ బీఆర్ఎస్ పార్టీ మాటల దాడి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తట్టుకుని నిలబడ్డారని అంటున్నారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలోనూ నమ్మకం కలిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ నెగ్గుకురాగల సమర్థత ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల రానున్న స్థానిక ఎన్నికల్లోనూ గెలిచేస్తామన్న నైతిక బలాన్ని జూబ్లీహిల్స్ విజయం ఇచ్చిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విజయయాత్ర భవిష్యత్తులోనూ కొనసాగుతుందనే ధీమా కాంగ్రెస్ లో కనిపిస్తోందని అంటున్నారు.