దేశంలో మొదటి జీరో వేస్ట్ ఈవెంట్...విశాఖ సమ్మిట్ కొత్త రికార్డు

విశాఖలో ఈ నెల 14 15 తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్న పెట్టుబడుల సదస్సు ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.;

Update: 2025-11-13 03:36 GMT

విశాఖలో ఈ నెల 14 15 తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్న పెట్టుబడుల సదస్సు ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం గత మూడు నెలలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సులో వందల సంఖ్యలో ఒప్పందాలు కుదరడం ఒక రికార్డు అయితే పది లక్షల కోట్ల దాకా పెట్టుబడులు కుదరడం మరో రికార్డు. వీటితో పాటు ఇంకో రికార్డు నమోదు కాబోతోంది. అదేంటి జీరో వేస్ట్ అన్న మాట. ఒక పెద్ద ఈవెంట్ చేసినపుడు వేస్టేజ్ గుట్టలుగా పేరుకుపోతుంది. సదస్సు ముగిసినా అది మాత్రం రోజులు నెలలు అయినా తొలగిపోదు. కానీ విశాఖ సమ్మిట్ దానికి కొత్త రూట్ కనుగొంది. ఈసారి జరిగే సమ్మిట్ లో వ్యర్థాలు అన్నవి జీరో అని చెబుతున్నారు. మరి ఇంత పెద్ద ఈవెంట్, వేల సంఖ్యలో పెట్టుబడిదారులు అలాగే అతిధులు ఎంతో మంది వస్తారు కదా అందరికీ రెండు రోజుల పాటు ఆతిధ్యం ఇతరత్రా అన్నీ చూస్తే మరో కొండ మాదిరిగా వేస్టేజ్ ఉండదా అంటే ఉండదు అని కచ్చితంగా చెబుతున్నారు. ఒక విధంగా అది ఎంతో ఇంట్రెస్ట్ గానే చూడాల్సి ఉంది.

గ్రేట్ అనాల్సిందే :

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సమ్మిట్ ఒక విధంగా దేశానికి గొప్ప సందేశం ఇస్తోంది. ఈ సదస్సు తర్వాత అంతా ఇదే తీరున చేయాలి, చేస్తారు కూడా. ఈ ఈవెంట్ ద్వారా వచ్చే ప్రతీ వ్యర్ధ పదార్ధం ఏదో విధంగా తిరిగి ఉపయోగించుకోవడమో రీసైకిల్ చేయడమో చేస్తారు. అంతే కాదు దానిని గుట్టగా పేర్చి భూమిలో పాతిపెట్టేది కానీ దాచిపెట్టేది కాని ఉండదట. అంతే కాదు పర్యవరణానికి విఘాతం కలిగించేది అసలు ఉండదని అంటున్నారు.

ఈ విధంగా చేస్తారు :

ఇక జీరో వేస్ట్ అన్న టార్గెట్ ని పెట్టుకున్న నిర్వాహకులు అందుకోసం ప్రత్యేక కంపోస్టింగ్ యూనిట్లని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వ్యర్థాల విభజన కౌంటర్లు కూడా ఉంటాయి. అధీకృత రీసైక్లర్లతో టైఅప్‌ చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఇక సదస్సు వేదిక వద్ద ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషేధించబడింది. దానికి బదులుగా బయోడిగ్రేడబుల్ కప్పులు వాడుతారు. అలాగే ప్లేట్లు, గాజు బంకమట్టి కంటైనర్లు పునర్వినియోగపరచదగిన వాటినే వినియోగిస్తారు. ఇవే సర్వింగ్ మెటీరియల్‌ గా ఉంటాయని అంటున్నారు. ఇక ఈ సదస్సు గురించిన ప్రచారం కానీ ఇతర విషయాలు కానీ పూర్తిగా బట్టతో తయారు చేయించారు. మరికొన్ని ముఖ్యమైనవి అయితే ఏకంగా డిజిటల్ స్క్రీన్‌లపై చూపిస్తారు. అలాగే కాగితం వ్యర్థాలను కూడా ఎలా తగ్గించడమో ఈ సదస్సు చాటి చెబుతోంది అంటున్నారు.

పర్యావరణ సహితంగా :

విశాఖ సదస్సు ఒక రోల్ మోడల్ గా పర్యావరణ సహితంగా ఉండబోతోంది. దీని వల్ల ఎటువంటి కాలుష్యం కానీ ఇబ్బందులు కానీ లేకుండా చేయడం అంటే గొప్ప ఆలోచన అని చెప్పాల్సిందే. రానున్న కాలంలో ఈ తరహాలో ఎన్ని అయినా ఈవెంట్లు చేయవచ్చు అన్నది విశాఖ సమ్మిట్ రుజువు చేయబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టిని దార్శనికతను ఈ తరహా సదస్సులు చాటి చెబుతున్నాయి. మొత్తానికి ఆర్ధికంగా పెట్టుబడులు సాధించడమే కాదు పర్యావరణంగా కూడా ఏమి చేయాలో మరో కొత్త సందేశాన్ని విశాఖ సదస్సు ఇస్తోంది. సో వెరీ ఇంట్రెస్టింగ్.

Tags:    

Similar News