విజయ్‌కు మంచి ఛాన్స్.. ఉత్తరాంధ్రకే కీలకం ..?
తాజాగా రాజ్యసభ స్థానాలకు సంబంధించి టీడీపీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు యువ నాయకులు. 42-47 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే.
తాజాగా రాజ్యసభ స్థానాలకు సంబంధించి టీడీపీ ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో ఇద్దరు యువ నాయకులు. 42-47 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే. దీంతో వీరిపై ఎక్కువగానే ఆశలు ఉన్నాయి. సానా సతీష్ తో పాటు చింతకాయల విజయ్ పాత్రుడు ఈ దఫా చోటు దక్కించుకున్నారు. నిజానికి పార్టీపరంగా ఎంతో పోటీ ఉంది. ఎంతో మంది నాయకులు ఈ పోటీలో ఉన్నారు. అయినా.. వారందరినీ దాటుకుని పార్టీ అధినేత చంద్రబాబు నుంచి బీ ఫారం అందుకోవడం అంటే ఈజీ కాదు.
మరీముఖ్యంగా విజయ్‌కు ఈ అవకాశం చిక్కడం మంచి ఛాన్సేనని పరిశీలకులు చెబుతున్నారు. కేవలం 42 ఏళ్ల వయసులో పెద్దల సభలోకి అడుగు పెట్టడం ఒక రికార్డేనని అంటున్నారు. అదే సమయంలో ఉత్తరాంధ్ర నుంచి ఇంత పిన్న వయసులో రాజ్యసభకు వెళ్తున్న నాయకుడిగా కూడా విజయ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా విజయ్ రాజకీయాలు ఉండ నున్నాయి.
రాజ్యసభ సభ్యుడికి పరిధి అంటూప్రత్యేకంగా ఉండదు. దేశవ్యాప్తంగా కూడా రాజ్యసభ సభ్యులకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంటాయి. లోక్‌సభ అయితే.. ఒక నియోజకవర్గానికి పరిమితం కావాల్సి ఉంటుంది. కానీ, రాజ్యసభ సభ్యుడిగా ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు.. ఎక్కడైనా పనులు చేసేందుకు విజయ్‌కు అవకాశం ఉంటుంది. ఇది ఉత్తరాంధ్రలో విజయ్‌కు మంచి ఫాలోయింగ్ పెంచే అవకాశం ఉంటుంది. యువనాయకుడిగా ఆయన.. మరింత పుంజుకునేందుకు ఛాన్స్ ఉంటుంది.
అయ్యన్న కుటుంబం పరంగా చూస్తే.. ఆయన లోక్‌సభలో అడుగు పెట్టారు. కానీ, రాజ్యసభలోకి తొలిసారి విజయ్ అడుగు పెడుతున్నారు. ఎంపీలకు ఇచ్చేనిధులే రాజ్యసభ సభ్యులకు కూడా ఇస్తారు. ఈ నిధులతో నియోజకవర్గం సహా.. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంతోపాటు ..ఉత్తరాంధ్ర సమస్యలపైనా ఆయన రాజ్యసభలో గళం వినిపించే ప్రయత్నం చేస్తే.. అది భవిష్యత్ రాజకీయాలకు ఆయనను మరింత రాటు దేలుస్తుందని అంటున్నారు పరిశీలకులు.