'చైనా టైమ్ తారుమారుకు అమెరికా కుట్ర'.. అసలేం జరిగిందంటే..!
అవును.. అమెరికా జాతీయ భద్రతా సంస్థ చాలా కాలంగా తమ నేషనల్ టైమ్ సర్వీస్ సెంటర్ పై సైబర్ దాడి ఆపరేషన్ నిర్వహిస్తోందని చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.;
తమ దేశంలో ప్రామాణిక సమయాన్ని పర్యవేక్షించే 'నేషనల్ టైమ్ సెంటర్'పై అమెరికా సైబర్ డాడి చేసిందని తాజాగా చైనా ఆరోపించింది. తద్వారా కమ్యూనికేషన్ నెట్ వర్క్ లు, ఆర్థిక వ్యవస్థలు, విద్యుత్ సరఫరా, అంతర్జాతీయ ప్రామాణిక సమయానికి అంతరాయం కలిగించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది.
అవును.. అమెరికా జాతీయ భద్రతా సంస్థ చాలా కాలంగా తమ నేషనల్ టైమ్ సర్వీస్ సెంటర్ పై సైబర్ దాడి ఆపరేషన్ నిర్వహిస్తోందని చైనా రాష్ట్ర భద్రతా మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. 2022 మార్చిలో తొలిసారి ఈ సైబర్ దాడులు మొదలైనట్లు పేర్కొంది. నేషనల్ టైమ్ సెంటర్ లోని ఉద్యోగుల ఫోన్లు, కంప్యూటర్ల నుంచి సున్నితమైన సమాచారాన్ని తస్కరించినట్లు చెప్పింది.
ఇదే సమయంలో... 2023, 2024లో ఈ కేంద్ర అంతర్గత నెట్ వర్క్ వ్యవస్థలపై అమెరికా దాడులు చేసిందని.. అధిక ఖచ్చితమైన గ్రౌండ్ బేస్డ్ టైమింగ్ వ్యవస్థపై దాడి చేయడానికి ప్రయత్నించిందని మంత్రిత్వ శాఖ దర్యాప్తులో తేలినట్లు తెలిపింది. ఇదే సమయంలో.. టైమ్ సెంటర్ ఉద్యోగులు వాడే విదేశీ ఫోన్లలోని మెసేజింగ్ యాప్ లో ఉన్న బలహీనతలను ఆధారంగా చేసుకొని హ్యాకింగ్ కు పాల్పడినట్లు పేర్కొంది.
బీజింగ్ లో అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు యునైటెడ్ స్టేట్స్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్.ఎస్.ఏ) తరచుగా దాడులను ప్రారంభించిందని.. అమెరికా, యూరప్, ఆసియాలోని వర్చువల్ ప్రైవేట్ సర్వర్ లను ఉపయోగించి దాడుల మూలాన్ని అస్పష్టం చేసిందని చైనా జాతీయ భద్రతా సంస్థ కూడా కనుగొందని తెలిపింది.
చైనా అరుదైన ఖనిజాల ఎగుమతి నియంత్రణలను విస్తరించడం, చైనా వస్తువులపై సుంకాలను మరింత పెంచుతామని అమెరికా బెదిరించడం వంటి వ్యవహారాలపై తిరిగి వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో తాజా ఆరోపణలు రావడం గమనార్హం. అయితే... ఈ ఆరోపణలపై అగ్రరాజ్యం నుంచి ఇంకా స్పందన రాలేదు.
కాగా... నేషనల్ టైమ్ సెంటర్ అనేది చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కింద ఉన్న ఒక పరిశోధనా సంస్థ. ఇది చైనా ప్రామాణిక సమయాన్ని ఉత్పత్తి చేస్తుంది, నిర్వహిస్తుంది, ప్రసారం చేస్తుంది. చైనాలోని షాంక్సీ ప్రావిన్స్ లోని షియాన్ నగరంలో ఈ సెంటర్ ఉంది.