స్థానికంలో 'సూప‌ర్' సిక్స్‌.. !

దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ‘సూపర్ సిక్స్’ హామీలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయ‌ని చెబుతున్నారు.

Update: 2026-10-17 05:14 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా ప్రచార అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో ఓటర్లు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామీణ/పట్టణ అభివృద్ధిని ప్రధానంగా చూస్తారు. కూటమి నాయకుల విశ్లేషణలు, పార్టీ శ్రేణుల ప్రచారం ప్రకారం ఈ ఎన్నికల్లో కూటమికి ప్రధానంగా కలిసి వచ్చే పథకాలు ఇవేన‌ని అంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైన ‘సూపర్ సిక్స్’ హామీలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయ‌ని చెబుతున్నారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు: సామాజిక పింఛన్లను ఒకేసారి రూ.4,000లకు పెంచి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు పంపిణీ చేస్తుండటం కూటమికి అతిపెద్ద సానుకూల అంశం. అలాగే దివ్యాంగులకు పింఛన్‌ను రూ. 6,000 కు పెంచడం గ్రామీణ, పట్టణ ఓటర్లలో కూటమిపై నమ్మకాన్ని పెంచింది.

ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం (దీపం): దీపావళి కానుకగా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రక్రియకు కార్యాచరణ సిద్ధం చేయడం మహిళా ఓటర్లలో సానుకూలత తెస్తోంది. ప్ర‌స్తుతం ఈ ప‌థ‌కం నిధుల‌ను ముందుగానే జ‌మ చేయ‌నున్నారు.

తల్లికి వందనం-ఉచిత బస్సు ప్రయాణం: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు ఇచ్చే ‘తల్లికి వందనం’, మహిళ లకు ఉచిత బస్సు ప్రయాణ హామీలపై ప్రజల్లో ఉన్న అంచనాలు కూటమికి కలిసొచ్చే అంశాలు. ప్ర‌స్తుతం ఇవి నిర్విఘ్నంగా అమ‌ల‌వుతున్నాయి.

‘ట్రిపుల్ ఇంజిన్ సర్కార్’ - కేంద్ర నిధుల అస్త్రం

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటంతో పాటు.. స్థానిక సంస్థల్లోనూ కూటమిని గెలిపిస్తే ‘ట్రిపుల్ ఇంజిన్ సర్కార్’ గా మారి గ్రామాలకు, నగరాలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయని కూటమి ప్రచారం చేస్తోంది. ఇది కూడా భారీగానే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని అంటున్నారు.

ఉపాధి హామీ అనుసంధానం: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని స్థానిక అభివృద్ధి పనులకు అనుసంధానించడం, పెండింగ్ బిల్లుల చెల్లింపులు గ్రామీణ ఓటర్లలో పట్టు పెంచుకోవడానికి సాయపడతాయి. ప్ర‌స్తుతం భారీ ఎత్తున గ్రామాల్లో ప‌నులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఉపాధి హామీ ద్వారా వేల మంది ల‌బ్ధి పొందుతున్నారు.

అమరావతి, పోలవరం ప్రాజెక్టులు: కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు లభించిన భారీ ఆర్థిక ప్యాకేజీలను కూటమి అభివృద్ధికి చిహ్నంగా చూపిస్తోంది. ప్ర‌స్తుతం ఆయా ప్రాజెక్టుల ప‌నులు వ‌డివ‌డిగా ముందుకు సాగుతున్నాయి. ఎన్నిక‌ల్లో వీటి ప్ర‌భావం కూడా ఉండ‌నుంది.

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు

గత ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను అధికారంలోకి రాగానే రద్దు చేయడం భూయజమానులలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతుల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్ని బలపరిచింది. ఇది ఇప్పుడు కూట‌మికి సానుకూల ఓటు బ్యాంకుగా మారుతుందని అంచ‌నా వేస్తున్నారు.

బీసీలకు 40% కేటాయింపు

స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ, కూటమి తరఫున 40 శాతం టిక్కెట్లను బీసీలకే కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఈ వ్యూహాత్మక నిర్ణయం బీసీ ఓటు బ్యాంకును కూటమి వైపు తిప్పుకోవడానికి పెద్ద ఊతంగా మారుతుందని భావిస్తున్నారు.

అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ: పట్టణ, నగర ప్రాంతాల్లో పేద ప్రజలు, కూలీల ఆకలి తీర్చడం కోసం రూ. 5లకే భోజనం అందించే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమికి పట్టణ ఓటర్ల మద్దతు కూడగట్టడానికి ఉపయోగపడనుంది. మొత్తంగా స్థానిక ఎన్నిక‌ల్లో కూట‌మికి సూప‌ర్ సిక్స్ విజ‌యాన్ని తీసుకువ‌స్తుంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News