ఒక్క తప్పుతో ఆకాశం నుంచి అగాధంలోకి.. కీలక పోస్టింగ్ కోల్పోయిన ఐఏఎస్ విక్రాంత్
కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) ప్రాజెక్టు డైరెక్టర్ విక్రాంత్ మర్మత్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సహించ లేకపోతున్నారని అంటున్నారు.
కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడ) ప్రాజెక్టు డైరెక్టర్ విక్రాంత్ మర్మత్ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సహించ లేకపోతున్నారని అంటున్నారు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉంటూ క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడ్డారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తక్షణమే విక్రాంత్ మర్మత్ ను కడా ప్రాజెక్టు డైరెక్టర్ పదవి నుంచి రిలీవ్ చేయాలని, కొద్దిరోజుల వరకు ఆయనకు ఏ పోస్టింగ్ ఇవ్వరాదని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్ ను విధుల నుంచి తప్పిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కడ ప్రాజెక్టు డైరెక్టుగా విక్రాంత్ మర్మత్ రెండేళ్లకు పైగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అభివృద్ధి బాధ్యతలను ఆయనకు అప్పగించారు. రెండేళ్లుగా నమ్మకంగా పనిచేసిన విక్రాంత్ మర్మత్ అనూహ్యంగా బెంగళూరు పబ్ వివాదంలో కూరుకుపోవడంతో సీఎం ఆగ్రహానికి గురయ్యారని అంటున్నారు. ఈ నెల 9న అర్ధరాత్రి ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్, ఆయన స్నేహితులు ఒక పబ్ లో పోలీసులతో గొడవ పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విక్రాంత్ మర్మత్ తోపాటు ఆయన మిత్రులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిపై పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వెలువడ్డాయి.
రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి ప్రవర్తనపై గతంలో ఎన్నడూ లేనన్ని విమర్శలు రావడంతో ప్రభుత్వం కూడా సీరియస్ అయిందని అంటున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఆయన పనిచేస్తుండటం వల్ల ఘటనను బాధ్యతారాహిత్యంగా పరిగణిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి మిగిలిన అధికారులకు ఆదర్శంగా ఉండాల్సివుంటుందని, కానీ విక్రాంత్ మర్మత్ మాత్రం తన అధికారాన్ని హోదాను దుర్వినియోగం చేసినట్లుగా సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారని అంటున్నారు. దీంతో తక్షణమే విక్రాంత్ ను తప్పించాలని ఆదేశించినట్లు సమాచారం.
ఇక కడ పీడీగా విక్రాంత్ ను బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. ఎన్నికల షెడ్యూల్ అమలులోకి వచ్చినందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కడ ప్రాజెక్టుకు జిల్లా కలెక్టర్ చైర్మనుగా వ్యవహరిస్తున్నారు. వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతుండటంతో పర్యవేక్షణకు సమర్థులైన ఐఏఎస్ అధికారులు ఉండాలని ప్రభుత్వం భావించింది. దీంతో 2019 బ్యాచ్ కు చెందిన విక్రాంత్ మర్మత్ ను రెండేళ్ల క్రితం నియమించింది. ఈ రెండేళ్లలో ఆయన కుప్పం ప్రాంత అభివృద్ధికి అనేక ప్రణాళికలు తయారు చేసినట్లుగా చెబుతున్నారు. కానీ, దూకుడు స్వభావంతో అనవసర వివాదంలో చిక్కుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.