ఫస్ట్ టైం బాబు అక్కడికి వెళ్తున్నారు !
అల్లూరి జిల్లాగా ఏర్పాడిన తరువాత తొలిసారి బాబు పాడేరుకు వస్తున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది.;
ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. ఆయన తొలిసారి వెళ్ళడమేంటి అని అనుకోవచ్చు. సుదీర్ఘకాలం ఉమ్మడి ఏపీకి విభజన ఏపీకి సీఎం గా ఉన్న బాబు పర్యటించని ప్రాంతాలు లేవు అని అంతా అంటారు. ఇక ఒకసారి కాదు అనేక సార్లు బాబు ఏపీలో చాలా ప్రాంతాలలో పర్యటించారు. అయితే ఆయన నాలుగవ సారి సీఎం అయిన తరువాత తొలిసారి ఆ ప్రాంతానికి వస్తున్నారు అన్నదే ఇక్కడ వార్తా విశేషం. ఇంతకీ ఆ ప్రాంతం ఏంటి అంటే ఉమ్మడి ఏపీలోని గిరిజన ప్రాంతం అయిన పాడేరు.
అల్లూరి జిల్లాకు సీఎం గా :
అల్లూరి జిల్లాగా ఏర్పాడిన తరువాత తొలిసారి బాబు పాడేరుకు వస్తున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఈ నెల 9న అంటే శనివారం బాబు పాడేరులో పర్యటిస్తారు. దానికి తగిన ఏర్పాట్లు అయితే పూర్తి అయ్యాయి. ప్రపంచ ఆదీవాసీ దినోత్సవం సందర్భంగా బాబు పాడేరుకు వస్తున్నారు. గిరిజన ప్రాంతం నుంచే ఆయన ఆదివాసీలకు పెద్ద ఎత్తున వరాలు ప్రకటిస్తారు అని అంటున్నారు.
ఇదీ షెడ్యూల్ :
ఇక చూస్తే కనుక ముఖ్యమంత్రి శనివారం ఉదయం పది గంటలకు పాడేరు మండలం లగిసపల్లిలో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. ఆయన అక్కడ నుంచి 10.25 గంటలకు వంజంగి గ్రామానికి బయలుదేరి వెళతారు. వంజంగి గ్రామంలో దేవాలయ సందర్శన తో పాటు ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో భాగంగా గిరిజనులతో భాగస్వామ్యం ఉంటుంది. వారి గృహాలను సైతం బాబు ముఖ్యమంత్రి హోదాలో సందర్శిస్తారు. అంతే కాదు గిరిజనులు స్వయంగా పండిస్తున్న పంటలను అడిగి తెలుసుకుంటారు. కాఫీ తోటల రైతులతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
అనేక ప్రారంభోత్సవాలు
అదే విధంగా చంద్రబాబు దాదాపు మూడు గంటల పాటు వంజంగి గ్రామంలోనే ఉంటారు. అక్కడ ప్రజావేదిక నుంచే ముఖ్యమంత్రి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ఇక చంద్రబాబు బహిరంగ సభలో గిరిజనులకు ఎన్నో వరాలు ఇస్తారని అంటున్నారు. ఇలా విశాఖ జిల్లా ఏజెన్సీలో సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్ ఉండనుంది. ఆయన మధ్యాహ్నం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి మధ్యాహ్నం రెండున్నర గంటలకు లగిసపల్లిలోని హెలిప్యాడ్ కు చేరుకొని విజయవాడకు బయలుదేరి వెళతారు.
ఫోకస్ అటు వైపే :
ఉత్తరాంధ్ర మొత్తం అసెంబ్లీ సీట్లూ ఎంపీ సీట్లూ కూటమి వశం అయినా పాడేరు అరకు అసెంబ్లీ సీట్లూ అలాగే అరకు ఎంపీ సీటూ వైసీపీకి దక్కాయి దాంతో గిరిజనంతో మమేకం కావడం ద్వారా వాతిని తమ వైపు తిప్పుకోవాలన్న ఆలోచన అయితే కూటమిలో ఉందని అంటున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పాడేరు అరకు పర్యటనకు చేపట్టారు. చంద్రబాబు మాత్రం నాలుగవ సారి సీఎం అయ్యాక రావడం ఇదే తొలిసారి. దాంతో వైసీపీకి కంచుకోట లాంటి ఏజెన్సీలో బాబు పర్యటన ఆసక్తిని రేపుతోంది.