క్యారీమెన్ స్టార్టప్ సంచలనం: మీరు షాపింగ్ చేయండి.. మీ సంచులు మేము మోస్తాం!
షాపింగ్ చేయడం అనేది చాలా మందికి ఒక మానసిక థెరపీ. అది ఇచ్చే సంతృప్తి వేరే లెవల్.
షాపింగ్ చేయడం అనేది చాలా మందికి ఒక మానసిక థెరపీ. అది ఇచ్చే సంతృప్తి వేరే లెవల్. ముఖ్యంగా మెట్రో నగరాల్లో రద్దీగా ఉండే మార్కెట్ వీధుల్లో తిరుగుతూ.. స్థానిక స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించడం ఒక అద్భుతమైన అనుభూతి. అయితే ఈ ఇరుకైన జనసంచారం ఎక్కువగా ఉండే వీధుల్లో షాపింగ్ చేసేటప్పుడు ప్రతీ ఒక్కరూ ఎదుర్కొనే అతిపెద్ద సమస్య `షాపింగ్ బ్యాగులను మోయడం`. చేతిలో మొబైల్ ఫోన్, డబ్బుల పర్స్ పట్టుకుని, దానికి తోడు భారీగా పెరిగిపోయే షాపింగ్ సంచులను మోస్తూ మార్కెట్‌లో స్వేచ్ఛగా తిరగడం, వస్తువుల నాణ్యతను పరిశీలించడం లేదా ప్రశాంతంగా పేమెంట్లు చేయడం ఎవరికైనా మహా కష్టంగా మారుతుంది.
ఈ ఇబ్బందిని గమనించి.. కస్టమర్ల షాపింగ్ భారాన్ని తగ్గించేందుకు ఢిల్లీ వేదికగా `క్యారీమెన్` అనే సరికొత్త స్టార్టప్ రంగంలోకి దిగింది. ``మీరు షాపింగ్ చేయండి.. మీ సంచులు మేము మోస్తాం`` అనే ఆకర్షణీయమైన ట్యాగ్‌లైన్‌తో ఈ సంస్థ వినూత్నమైన సేవలను అందిస్తోంది. కేవలం గంటకు రూ. 149 లకే షాపింగ్ అసిస్టెన్స్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ఇళ్లలోని పెద్దవారితో పాటు సంచులు మోయడానికి పిల్లలు వెళ్లడం లేదా మహిళలు భుజాన పెద్ద బ్యాగులు వేసుకుని ఇబ్బంది పడటం చూస్తుంటాం... కానీ ఇప్పుడు ఈ క్యారీమెన్ అసిస్టెంట్లను నియమించుకోవడం ద్వారా చేతులు ఖాళీగా ఉంచుకుని హ్యాపీగా షాపింగ్ చేయవచ్చు.
ఈ సంస్థ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. క్యారీమెన్ అందించే అసిస్టెంట్లు కేవలం సంచులు మోయడానికే పరిమితం కారు. వారు మార్కెట్ వీధుల్లో కస్టమర్ల వెంటే నడుస్తూ పార్కింగ్ ఏరియా లేదా సమీప మెట్రో స్టేషన్ వరకు బ్యాగులను సురక్షితంగా చేరవేస్తారు. అంతేకాదు.. మార్కెట్లలో దొరికే ఫేమస్ స్నాక్స్, ఫుడ్ కౌంటర్ల వద్ద లాంగ్ క్యూలలో నిలబడి కస్టమర్లకు ఆహారాన్ని తెచ్చిపెట్టడంలోనూ సహాయపడతారు. అదనపు ఛార్జీలతో బేబీ క్యారియర్, బేబీ ప్రామ్, మొబైల్ ఛార్జింగ్ వసతి, గొడుగు, ఫోల్డబుల్ సీటింగ్ (కూర్చోవడానికి కుర్చీ) వంటి విలువైన సేవలను కూడా కస్టమర్లు ఇక్కడ యాడ్-ఆన్ చేసుకోవచ్చు.
ఈ సరికొత్త బిజినెస్ ఐడియాను ఖుష్ మహాజన్ అనే యూజర్ ఎక్స్ వేదికగా షేర్ చేయడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు ``మా అమ్మలకిక సంచులు మోసే ప్రత్యామ్నాయం దొరికేసింది`` అంటూ జోకులు పేలుస్తుంటే.. మరికొందరు ``ఇది మిలియన్ డాలర్ ఐడియా ఏమీ కాదు.. మానవ వనరులను తప్పుడు దిశలో వాడుకోవడమే`` అని పెదవి విరుస్తున్నారు. ఒక యూజర్ వేసిన ``ఈ అసిస్టెంట్లు నాతో కలిసి సినిమా డేట్‌కు వస్తారా?`` అనే ప్రశ్నకు.. ``వీరు కేవలం షాపింగ్ హెల్పర్లు మాత్రమే, బాయ్‌ఫ్రెండ్ పాత్ర పోషించి సినిమా డేట్‌లకు రారు`` అని ఖుష్ మహాజన్ స్పష్టత ఇవ్వడం సోషల్ మీడియాలో నవ్వులు పూయించింది.
అయితే ఈ వినూత్న సర్వీసుపై ఆర్ధిక పరమైన, నైతిక పరమైన సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్లాట్‌ఫారమ్ కట్ చేసుకునే కమిషన్లు పోను, గంటకు రూ. 149 లో గ్రౌండ్ లెవెల్‌లో పనిచేసే ఆ అసిస్టెంట్లకు ఎంత మిగులుతుంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. శ్రమకు తగ్గ వేతనం లభిస్తే ఈ సర్వీసు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నిరంతరం బిజీగా ఉంటూ విలాసవంతమైన షాపింగ్ అనుభవాన్ని కోరుకునే నగరవాసులకు ఈ `క్యారీమెన్` సేవలు ఎంతవరకు ఉపయోగపడతాయో.. ఈ సరికొత్త స్టార్టప్ మోడల్ భవిష్యత్తులో మిగిలిన నగరాలకు ఎలా విస్తరిస్తుందో వేచి చూడాలి.