దావూద్ తర్వాత లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్... కెనడా నిర్ణయం వెనుక..!
భారత్ సహా విదేశాల్లో హత్యలు, దోపిడీ, ఆయుధాలు, డ్రగ్స్ రవాణా వంటి నేర కార్యకలాపాలతో లారెన్స్ బిష్ణోయ్, అతని గ్యాంగ్ పేరుగాంచిన సంగతి తెలిసిందే.;
భారత్ సహా విదేశాల్లో హత్యలు, దోపిడీ, ఆయుధాలు, డ్రగ్స్ రవాణా వంటి నేర కార్యకలాపాలతో లారెన్స్ బిష్ణోయ్, అతని గ్యాంగ్ పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్ లో ఎన్.సీ.పీ నేత బాబా సిద్ధిఖీని దారుణంగా హత్య చేసింది. ఇటీవల కపిల్ శర్మ కేఫ్ పై రెండుసార్లు కాల్పులు జరిపింది. సల్మాన్ ఖాన్ కు ఈ ముఠా నుంచి థ్రెట్ ఉన్న పరిస్థితి.
మరోవైపు కెనడాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆగడాలు పెరుగుతుండటంపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని కోరుతూ మార్క్ కార్నీ ప్రభుత్వానికి కన్జర్వేటివ్ పార్టీ ఇటీవల లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేరుస్తున్నట్లు కెనడా ప్రకటించింది. తమ దేశంలో హింస, ఉగ్రవాద చర్యలకు స్థానం లేదని కెనడా ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో దేశ ప్రజా భద్రతా మంత్రి గ్యారీ ఆనంద సంగరీ వెల్లడించారు.
ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే..?:
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చడంతో దేశంలోని బిష్ణోయ్ ముఠాకు సంబంధించిన ఆస్తులు, నగదు, వాహనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు లేదా స్తంభింపజేయవచ్చు. ఇదే సమయంలో.. ఆ గ్యాంగ్ సభ్యుల నేరాలపై విచారణ జరపడానికి కెనడియన్ చట్ట సంస్థలకు మరిన్ని అధికారాలు కూడా లభిస్తాయి. అదేవిధంగా... అనుమానిత ముఠా సభ్యులను దేశంలోకి ప్రవేశించకుండా ఇమిగ్రేషన్ అధికారులు నిరోధించవచ్చు.
అజిత్ దోవల్ సంప్రదింపులు సక్సెస్!:
ఇటీవల భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్.ఎస్.ఏ) అజీత్ డోభాల్.. కెనడా ఎన్.ఎస్.ఏ నథాలీ డ్రౌయిన్ తో విస్తృత సంప్రదింపులు జరిపారు. ఇందులో ప్రధానంగా... ద్వైపాక్షిక సంబంధాల్లో సహకార స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఈ నేపథ్యంలో.. ఉగ్రవాదం, జాతీయ నేరాలపై జరిపే పోరులో కలిసి పనిచేయాలని రెండు దేశాలు ఈ సందర్భంగా అంగీకరించాయి.
ఈ క్రమంలో బిష్ణోయ్ గ్యాంగ్ పై కెనడా ప్రభుత్వం ఉగ్రముద్ర వేసింది! దీంతో ఈ చర్య మెరుగవుతున్న భారత్ - కెనడా సంబంధాలకు సూచన అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
దావూద్ ఇబ్రహీం తర్వాత ఇదే!:
1993 ముంబై వరుస పేలుళ్ల సూత్రధారి, నార్కో టెర్రరిజం ద్వారా భారతదేశాన్ని దెబ్బతీయడానికి పాకిస్తాన్ తో చేరి.. ఐక్యరాజ్యసమితి, అమెరికాలతో ఉగ్రవాదిగా గుర్తించబడిన దావూద్ ఇబ్రహీం తర్వాత.. ఒక విదేశీ ప్రభుత్వం ఒక భారతీయ నేరస్థుల ముఠాను ఉగ్రవాద సంస్థగా పేర్కొనడం ఇదే తొలిసారి!
కాగా... లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్ లోని సబర్మతి జైలులో ఉన్నాడు. అతని సహచరులు గోల్డీ బ్రార్, రోహిత్ గొడారా ఈ ముఠా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు!