బొత్స కోటలో మొదలైన ప్రకంపనలు.. టెన్షన్ లో పెద్దాయన!

2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2015లో వైసీపీలో చేరిన బొత్స జిల్లాలో తన సొంత సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించుకున్నారని చెబుతున్నారు.

Update: 2026-09-28 11:03 GMT

వైసీపీ సీనియర్ నేత, మండలిలో విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో రాజకీయం గట్టి సవాల్ విసురుతోందని అంటున్నారు. చీపురుపల్లి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, దాదాపు 15 ఏళ్లపాటు మంత్రిగా పనిచేసిన బొత్స ఇప్పుడు తన రాజకీయ జీవితంలోనే ఎన్నడూ లేనంత విధంగా తిరుగుబాటు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ముందుగా మేనల్లుడు చిన్న శ్రీను ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా, ఇప్పుడు కేడర్ కూడా బొత్సకు బైబై చెప్పేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

విజయనగరం జిల్లా చీపురుపల్లి బొత్స సొంత నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004, 2009, 2019ల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బొత్స ఆ మూడు సార్లు మంత్రి పదవి దక్కించుకున్నారు. అమాత్య పదవితో జిల్లాలో తిరుగులేని ఆధిపత్యం చెలాయించడంతోపాటు రాష్ట్రాస్థాయి నాయకుడిగానూ ఎదిగారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఉత్తరాంధ్రలో మిగిలిన నాయకులు అందరికంటే ఎక్కువగా ప్రచారం దక్కించుకున్నారు. ఇక వైసీపీ చేరిన తర్వాత కూడా బొత్స హవాకు ఎదురు ఉండేది కాదని చెబుతున్నారు.

2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత 2015లో వైసీపీలో చేరిన బొత్స జిల్లాలో తన సొంత సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించుకున్నారని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఉంటే.. విజయనగరం జిల్లాలో మాత్రం బొత్స పార్టీ అన్నట్లుగా రాజకీయాలు నడిపారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రపైనా పట్టుసాధించి గత ఎన్నికల్లో ఓడిపోయినా ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికల ముందు బొత్స పూర్తిగా ఎదురుగాలి అనుభవిస్తున్నట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తన కుమార్తెకు జడ్పీ చైర్మన్ పదవి అంటూ ఆయన చేసిన ప్రకటనతో మేనల్లుడు చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిపోగా, ఇప్పుడు బొత్స అనుచరులు కూడా చిన్న శ్రీను వెంట నడుస్తామని రాజీనామా ప్రకటనలు చేస్తుండటం ప్రకంపనలు రేపుతోందని చెబుతున్నారు.

జడ్పీ మాజీ చైర్మన్ చిన్నశ్రీనుకు మద్దతుగా వైసీపీకి చెందిన ఐదుగురు జడ్పీటీసీ మాజీ సభ్యులు ఒకేసారి వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించగా, ఆదివారం బొత్స సొంత నియోజకవర్గంలోని మెరకముడిదాం మండలంలో దాదాపు 13 గ్రామాలకు చెందిన వైసీపీ నాయకులు పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. వీరి రాజీనామాతో ఆయా గ్రామాల్లో వైసీపీ తరఫున పోటీచేయడానికి సరైన నాయకుడు లేని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఇదేవిధంగా గరివిడి, గుర్ల, చీపురుపల్లి మండలాల్లో కూడా త్వరలో రాజీనామాలు ఉంటాయని చెబుతున్నారు.

ఇలా సొంత నియోజకవర్గంలో బొత్స పునాదులు కదిలేలా పావులు కదుపుతున్న చిన్న శ్రీను జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోనూ తన అనుచరులను టీడీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది. ముఖ్యంగా తన మేనమామలు అయిన బొత్స సత్యనారాయణతోపాటు ఆయన సోదరుడు బొత్స అప్పలనరసయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి భారీ వలసలు ఉండేలా చిన్నశ్రీను పాచికలు వేస్తుండటమే హాట్ టాపిక్ అవుతోంది. చిన్న శ్రీను దూకుడుకి బొత్స కళ్లెం వేయాలని, లేనిపక్షంలో వైసీపీ పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని కార్యకర్తలు కోరుకుంటున్నారు. అటు బొత్స కూడా నష్టనివారణకు ఎన్నడూ లేనివిధంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని చెబుతున్నారు. ఏదిఏమైనా అధికార పార్టీలో చేరడంతో చిన్నశ్రీనుకు అన్నివిధాలా కలిసివస్తుందని చెబుతున్నారు.

Tags:    

Similar News