మతం మారాలని కోరడం నేరమేనా? బాంబే హైకోర్ట్ సంచలన తీర్పు!
చందూర్ బజార్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థలో సోషల్ వర్కర్‌గా పనిచేస్తున్న ఫిర్యాదుదారుడు.. తనను..తన కుటుంబాన్ని క్రైస్తవ మతంలోకి మారాలని నిందితులు ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.
తమ సొంత మత ప్రచారం చేయడం వల్ల ఏ వర్గం మతపరమైన మనోభావాలు దెబ్బతిన్నట్లు కాదని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ స్పష్టం చేసింది. జోసెఫ్ ఎస్.ఓ విశ్వశ్రవ ఖుదావంత్ తదితరులు వర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వం కేసులో జస్టిస్ ఎం.డబ్ల్యూ. చంద్వాని నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారాలని కోరడం లేదా ఒత్తిడి చేయడం కేవలం మత ప్రచారం కిందకు వస్తుందని కోర్టు పేర్కొంది.
చందూర్ బజార్‌లోని ఒక స్వచ్ఛంద సంస్థలో సోషల్ వర్కర్‌గా పనిచేస్తున్న ఫిర్యాదుదారుడు.. తనను..తన కుటుంబాన్ని క్రైస్తవ మతంలోకి మారాలని నిందితులు ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. పిల్లల చదువుల ఖర్చులు భరిస్తామని... ఇల్లు కట్టిస్తామని ఆశ చూపి మత ప్రచారం కోసం ఒత్తిడి తెచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. ఈ ఆరోపణల ఆధారంగా నలుగురు వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 299, 302 - సెక్షన్ 3(5) కింద పోలీసులు కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈ కేసును విచారించిన హైకోర్టు.. ఫిర్యాదులోని అంశాలను పరిశీలిస్తే నిందితులు కేవలం తమ స్వంత మతాన్ని ప్రచారం చేయడానికి లేదా మత మార్పిడికి ప్రయత్నించారని స్పష్టమైందని తెలిపింది. కేవలం మత ప్రచారం చేయడం వల్ల ఏ వర్గం వారైనా మతపరమైన మనోభావాలు గాయపడ్డాయని భావించలేమని కోర్టు తేల్చిచెప్పింది. అందువల్ల బీఎన్ఎస్ సెక్షన్ 299 కింద ఎలాంటి నేరం రుజువు కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అలాగే బీఎన్ఎస్ సెక్షన్ 302 ప్రకారం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశంతో ఉద్దేశపూర్వక పదాలు, శబ్దాలు లేదా సైగలు ఉండాలని.. ఈ కేసులో అలాంటివేవీ లేవని కోర్టు వెల్లడించింది. అంతేకాకుండా సెక్షన్ 299 కింద చర్యలు తీసుకోవడానికి అవసరమైన చట్టబద్ధమైన ముందస్తు అనుమతి (శాక్షన్) కూడా ఈ కేసులో లేదని గుర్తుచేసింది. ఆరోపించిన సంఘటన జరిగిన కాలంలో మహారాష్ట్రలో మత మార్పిడిని నిషేధించే ప్రత్యేక చట్టం అమల్లో లేదని.. ఆ చట్టం ఆ తర్వాతే అమలులోకి వచ్చిందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కారణాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న బాంబే హైకోర్టు, దరఖాస్తుదారులపై మోపిన అభియోగాలు ఏవీ చట్టపరంగా నిలకడగా లేవని తేల్చింది. సెక్షన్ 299 , సెక్షన్ 302 కింద ఎలాంటి నేరం రుజువు కానందున నిందితులపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ - చార్జ్‌షీట్‌ను హైకోర్టు పూర్తిగా రద్దు చేస్తూ తుది తీర్పు వెలువరించడం సంచలనంగా మారింది.
ఆగస్టు 2026 నుంచి మత మార్పిడి నిషేధ చట్టం:
మహారాష్ట్రలో మత మార్పిడిని నిషేధించే చట్టం 2026 ఆగస్టు 28న అమల్లోకి వచ్చింది. ఇలాంటి మత మార్పిడి నిరోధక చట్టాలు భారతదేశంలో ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ , ఒడిశా వంటి పలు ఇతర రాష్ట్రాలలో కూడా వివిధ రూపాల్లో అమలులో ఉన్నాయి. బలవంతపు, మోసపూరిత లేదా ఆశ చూపి చేసే మత మార్పిడిలను అరికట్టే నిమిత్తం ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఈ చట్టాలను తెచ్చాయి. అయితే దేశవ్యాప్తంగా ఈ తరహాలో ఒకే చట్టం అమల్లో లేదు. ఉద్దేశపూర్వక మాట్లాడే పదాలు అదుపుతప్పడం.. ఇర్రిటేట్ చేసే శబ్దాలు లేదా సైగలు చేయడం వంటివి మత ప్రచారంలో నేరాలుగా పరిగణించబడతాయని బీఎన్ఎస్ సెక్షన్లు చెబుతున్నాయి. కేవలం మతం మారండి అని ప్రచారం చేస్తే తప్పు కాదని ఇప్పుడు హైకోర్టు తీర్పు వెలువరించింది.