ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగుల కంటే కార్మికుల జీతాల్లోనే వేగంగా పెరుగుదల ‘వర్క్ ఇండియా’ నివేదిక!..
మంచిగా చదివితే పెద్ద నౌకరి వస్తుంది.. మంచి జీతం వస్తుంది.. పెళ్లాం, పిల్లలతో దర్జాగా బతకచ్చు అని మన పెద్ద వారు చెప్పేవారు.;
మంచిగా చదివితే పెద్ద నౌకరి వస్తుంది.. మంచి జీతం వస్తుంది.. పెళ్లాం, పిల్లలతో దర్జాగా బతకచ్చు అని మన పెద్ద వారు చెప్పేవారు. కానీ ఈ పరిస్థితి మారిందని ఒక నివేదిక స్పష్టం చేసింది. వైట్ కాలర్ ఉద్యోగుల కంటే కార్మికుల వేతనాలే ఎక్కువని ఒక సంస్థ చేసిన సర్వేలో తేలింది. ఒకప్పుడు చదువుకున్న వారికి మాత్రమే మంచి జీతాలు వస్తాయని, శారీరక శ్రమ చేసే కార్మికులకు తక్కువ ఆదాయమే దక్కుతుందని భావించేవాళ్లం. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు భారతీయ ఉపాధి మార్కెట్‌లో ఒక విప్లవాత్మకమైన మార్పు చోటుచేసుకుంటోంది. తాజాగా ‘వర్క్ ఇండియా’ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఆఫీసుల్లో ఏసీల కింద కూర్చుని పనిచేసే ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగుల కంటే, ఎండనక, వాననక కష్టపడే బ్లూకాలర్ కార్మికుల జీతాలే వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామం అటు పరిశ్రమల్లోనూ, ఇటు నిరుద్యోగుల్లోనూ కొత్త చర్చకు దారితీస్తోంది. బ్లూకాలర్, వైట్ కాలర్ విభాగాల్లో వేతనాల పెరుగుదల తీరుతెన్నులపై ‘వర్క్ ఇండియా’ నివేదిక వెల్లడించిన ఆసక్తికరమైన అంశాలు చూస్తే షాక్ కావాల్సిందే..
బ్లూకాలర్ సిబ్బంది వేతనాల్లో భారీ జంప్
వర్క్ ఇండియా నివేదిక ప్రకారం.., డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, సెక్యూరిటీ గార్డులు, ఇతర క్షేత్రస్థాయి పనులు చేసే బ్లూకాలర్ సిబ్బంది వేతనాలు గతేడాదిలో గణనీయంగా పెరిగాయి.
పెరుగుదల శాతం: 2024లో బ్లూకాలర్ సిబ్బంది సగటు కనీస వేతనం రూ. 14,056 ఉండగా, 2025 నాటికి అది 8.6 శాతం పెరిగి రూ. 15,265కు చేరుకుంది.
డిమాండ్, సరఫరా: ముఖ్యంగా ఇ-కామర్స్ రంగం విస్తరించడం, క్విక్ కామర్స్ (10 నిమిషాల డెలివరీ) సేవలు పెరగడం వల్ల డెలివరీ భాగస్వాములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ డిమాండ్ వల్లే కంపెనీలు తమ కార్మికులను నిలుపుకోవడానికి జీతాలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. గిగ్ ఎకానమీ (Gig Economy) పెరగడం వల్ల బ్లూకాలర్ కార్మికులకు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
వైట్ కాలర్ ఉద్యోగుల పరిస్థితి
మరోవైపు, అడ్మినిస్ట్రేషన్, కస్టమర్ సపోర్ట్, డేటా ఎంట్రీ వంటి ఆఫీస్ పనులు చేసే ఎంట్రీ లెవెల్ వైట్ కాలర్ ఉద్యోగుల వేతన వృద్ధి రేటు మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.
వేతనాల వివరాలు: 2024లో వీరి సగటు జీతం రూ. 14,760 ఉండగా, 2025లో అది కేవలం 6.75 శాతం మాత్రమే పెరిగి రూ. 15,756గా నమోదైంది.
ఏఐ, ఆటోమేషన్ ప్రభావం: వైట్ కాలర్ ఉద్యోగాల్లో వృద్ధి తగ్గడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI). ఆఫీసుల్లో చేసే సాధారణ పనులను ఇప్పుడు ఏఐ సాఫ్ట్‌వేర్లు సులభంగా చేస్తున్నాయి. దీనివల్ల కంపెనీలు కొత్త ఉద్యోగులను తీసుకోవడం తగ్గించడమే కాకుండా.., ఉన్న వారికి కూడా నామమాత్రపు జీతాల పెంపు అందిస్తున్నాయి. బ్లూకాలర్ పనులకు శారీరక ఉనికి అవసరం కాబట్టి అక్కడ ఏఐ ప్రభావం తక్కువగా ఉంది, కానీ వైట్ కాలర్ పనులు డిజిటల్ పరమైనవి కావడంతో అక్కడ పోటీ విపరీతంగా పెరిగింది.
వర్క్ ఇండియా నివేదిక వెల్లడించిన ఈ అంశాలు భారతీయ యువతకు ఒక కనువిప్పు లాంటివి. కేవలం ఆఫీసు ఉద్యోగం కోసమే వేచి చూడకుండా, నైపుణ్యం ఉన్న ఏ పని చేసినా గౌరవప్రదమైన జీతం లభిస్తుందని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి. బ్లూకాలర్ సిబ్బంది వేతనాలు 8.6 శాతం పెరగడం అనేది మన ఆర్థిక వ్యవస్థలో క్షేత్రస్థాయిలో కదలిక వస్తోందనడానికి నిదర్శనం. అటు కంపెనీలు కూడా తమ బ్లూకాలర్ వర్క్ ఫోర్స్ పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించడం వల్ల దేశంలో ఉపాధి నాణ్యత పెరుగుతోంది. కష్టపడి పనిచేసే చేతులకు తగిన విలువ దక్కడం అనేది ఆరోగ్యకరమైన సమాజ లక్షణం.