కాంగ్రెస్.. బీజేపీలు గెలిచినా పండుగ చేసుకోలేని పరిస్థితి
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకున్న వేళ.. బీజేపీ ఆనందం అంతా ఇంతా కాదన్నట్లుగా మారింది.;
ఒళ్లు మరిచి చిందులు వేసేంత ఆనందం.. అంతకు మించిన సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే విజయాల్ని సొంతం చేసుకున్న తర్వాత కూడా సంబరాలు చేసుకోలేని సిత్రమైన పరిస్థితి కాంగ్రెస్.. బీజేపీల్లో నెలకొంది. ఈ రెండు జాతీయ పార్టీలకు ఒకే రోజు ఓవైపు సంతోషం.. మరోవైపు విషాదం కలగలిసి కమ్మేసిన పరిస్థితి. అయితే.. ఇదంతా జాతీయ స్థాయిలో ఉంటుందని చెప్పట్లేదు. తెలంగాణలో మాత్రం పక్కాగా ఉందని చెప్పక తప్పదు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలకు మించిన విజయాన్ని సొంతం చేసుకున్న వేళ.. బీజేపీ ఆనందం అంతా ఇంతా కాదన్నట్లుగా మారింది. ఇక తమ తర్వాతి బెంగాల్ మీదనే అంటూ అప్పుడే రణనినాదం చేస్తున్నారు కమలనాథులు. దేశమంతా ఇలాంటి పరిస్థితి ఉంటే.. ఒక్క తెలంగాణలో మాత్రం కక్కా లేక మింగా లేని పరిస్థితి. తొలుత బీజేపీ సంగతే తీసుకుంటే.. బిహార్ లో ఎగ్జిట్ పోల్ అంచనాలకు మించి విజయాన్ని సొంతం చేసుకున్న ఆనందంలో బీజేపీ శ్రేణులు ఫుల్ హ్యాపీలో ఉన్నాయి. రాష్ట్రం ఏదైనా తాము తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తున్నామని చెప్పుకునే పరిస్థితి.
అందుకు భిన్నంగా తెలంగాణలో పరిస్థితి నెలకొంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి మహా ఘోరంగా ఉంది. డిపాజిట్ వస్తుందా? లేదా? అన్న సందేహం. మొదటి రెండు రౌండ్లలో అయితే ఇది మరింత దారుణ పరిస్థితి. మరో ముఖ్యమైన అంశం ఏమంటే.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ స్థానంలోనే ఉంది. అలాంటిది బీజేపీ అభ్యర్థి గెలవకున్నా సరే.. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని దీనస్థితిలో ఉండటం కమలనాథుల్ని వేదనకు గురి చేసే అంశం. బిహార్ లో గెలుపు సంబరాలకు ఈ దారుణ ఓటమి అడ్డుకుంటుందని చెప్పక తప్పదు.
ఇక.. అధికార కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. కష్టసాధ్యమవుతుందనుకున్న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానాన్ని గౌరవప్రదమైన మెజార్టీతో సొంతం చేసుకోవటమే కాదు.. తమకు తిరుగులేదన్న విషయాన్ని ఈ గెలుపుతో స్పష్టం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి మెజార్టీ రావటం ఆ పార్టీ నేతలకు.. కార్యకర్తలకు సంతోషాన్ని కలిగించేదే. అయితే.. ప్రతిష్టాత్మకంగా జరిగిన బిహార్ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవటంతో.. జూబ్లీ గెలుపు ఆనందాన్నిఎంజాయ్ చేయలేని పరిస్థితి. ఒకే రోజు వెల్లడైన ఈ ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్.. బీజేపీ నాయకత్వానికి.. క్యాడర్ కు భిన్నంగా తెలంగాణలోని రెండు పార్టీల ఎమోషన్ ఉందని చెప్పక తప్పదు.