ఇంగ్లీష్ వెర్షన్‌తో 'బిలిబిలి' రాబోతోంది.. యూట్యూబ్‌కు కొత్త ఛాలెంజ్!

యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నప్పటికీ, బిలిబిలికి గ్లోబల్ మార్కెట్‌లో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది.

Update: 2026-08-22 12:30 GMT

ప్రపంచవ్యాప్తంగా వీడియో స్ట్రీమింగ్ రంగంలో శాసనం చేస్తున్న యూట్యూబ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు చైనాకు చెందిన ప్రముఖ ప్లాట్‌ఫామ్ ‘బిలిబిలి’ సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ప్రధానంగా చైనీస్ భాషకే పరిమితమైన ఈ యాప్, ఇప్పుడు అంతర్జాతీయంగా తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఇంగ్లీష్ వెర్షన్‌తో గ్లోబల్ ఎంట్రీ ఇస్తోంది. ఇక విదేశీ క్రియేటర్లను, గ్లోబల్ యూజర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఫీచర్లు మరియు మానిటైజేషన్ ఆప్షన్లను తీసుకువస్తూ సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది.

గ్లోబల్ ఆడియన్స్ కోసం బిలిబిలి ప్లాన్స్:

బిలిబిలి తన అంతర్జాతీయ యాప్‌ను సరికొత్తగా రీలాంచ్ చేయడమే కాకుండా, త్వరలోనే పూర్తిస్థాయి ఇంగ్లీష్ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇక అంతర్జాతీయ క్రియేటర్లను ప్రోత్సహించడానికి అమెరికా, యూరప్, జపాన్ వంటి ప్రధాన దేశాల్లో కమ్యూనిటీ మేనేజర్లను నియమించుకుంటోంది. అంతేకాకుండా, గ్లోబల్ యూజర్లు సులభంగా సైన్-అప్ అయ్యేలా గతంలో ఉన్న పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డుల నిబంధనను కూడా తొలగించి ప్రక్రియను చాలా సరళతరం చేసింది.

జెన్ జీ యూజర్లే టార్గెట్:

ప్రస్తుతం చైనాలో బిలిబిలికి దాదాపు 37.6 కోట్ల నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. మిస్టర్ బీస్ట్ వంటి ప్రముఖ గ్లోబల్ క్రియేటర్లు ఇప్పటికే ఇందులో కంటెంట్ పోస్ట్ చేస్తూ మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ముఖ్యంగా బాగా చదువుకుని, ఆధునిక ఆలోచనలు ఉన్న 'జెన్ జెడ్' యువతను టార్గెట్ చేస్తూ బ్రాండ్ స్పాన్సర్‌షిప్‌ల కోసం ప్రత్యేక మార్కెట్‌ప్లేస్‌ను కూడా బిలిబిలి డెవలప్ చేస్తోంది.

బిలిబిలి ముందున్న ప్రధాన సవాళ్లు:

యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నప్పటికీ, బిలిబిలికి గ్లోబల్ మార్కెట్‌లో అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇక ఇతర చైనీస్ యాప్‌ల మాదిరిగానే బిలిబిలికి కూడా సెన్సార్‌షిప్, డేటా సెక్యూరిటీ మరియు కంటెంట్ మోడరేషన్ వంటి విషయాల్లో అంతర్జాతీయ నియంత్రణ సంస్థల నుంచి గట్టి నిఘా ఎదురవుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు సింగపూర్ కేంద్రంగా పవర్ ఫుల్ AI కంటెంట్ మోడరేషన్ సిస్టమ్‌ను బిలిబిలి రూపొందిస్తోంది.

చైనా సరిహద్దులు దాటి ప్రపంచ వేదికపై యూట్యూబ్‌తో తలపడేందుకు బిలిబిలి వేస్తున్న అడుగులు డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలకు ఒక కొత్త అవకాశంగా మారనున్నాయి. ఇక మరి డేటా భద్రత, సెన్సార్‌షిప్ వంటి సవాళ్లను దాటుకుని ఈ చైనీస్ దిగ్గజం గ్లోబల్ మార్కెట్‌లో యూట్యూబ్‌ను ఎంతవరకు దాటగలదో వేచి చూడాలి.

Tags:    

Similar News