కొత్త ఎయిర్ పోర్టు...వీర బాదుడే మరి !

కొత్త ఎయిర్ పోర్టు ముచ్చట ఇది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గురించి చాలా విశేషాలు ఇప్పటిదాకా చెప్పుకున్నారు.

Update: 2026-08-19 03:55 GMT

కొత్త ఎయిర్ పోర్టు ముచ్చట ఇది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ గురించి చాలా విశేషాలు ఇప్పటిదాకా చెప్పుకున్నారు. అది నాణేనికి ఒక వైపు మాత్రమే. రెండవ వైపు ఇపుడు అంతా చూస్తున్నారు, చెప్పుకుంటున్నారు. దేశంలోనే అత్యంత నాణ్యతతో అద్భుతంగా ఈ ఎయిర్ పోర్టుని కట్టారు అన్నది వాస్తవం. అదే సమయంలో ఈ ఎయిర్ పోర్టుని దూరం నుంచి చూసేందుకే కానీ దగ్గరకు వెళ్తే ధరతో వీర బాదుడు తప్పదని ద్వితీయ విఘ్నం లేకుండా ఆపరేషన్స్ స్టార్ట్ అయిన రెండవ రోజు నుంచే జనాలు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్తే చాలు భారీగానే షాక్ కొడుతోంది అని అంటున్నారు. ఎయిర్ ట్రావెలర్స్ నుంచే కాదు, టాక్సీల వారు, విజిటర్స్ ఇలా ఎవరు వెళ్ళినా వీర లెవెల్ లో బాదుడే బాదుడు అన్న సణుగుడు మొదలైంది. ఇంతకీ ఏమా కధ అంటే మ్యాటర్ బోలెడు అని అంటున్నారు.

వాహనం భారమేనా :

ఎవరైనా తమ వారికి సెండాఫ్ ఇచ్చేందుకు భోగాపురం ఎయిర్ పోర్టుకు వచ్చారే అనుకోండి. అక్కడ పార్కింగ్ ధరలు చూస్తే పేలిపోతూ వారిని హడలు కొడుతున్నాయి. ప్రైవేటు కార్లకు కేవలం అరగంటకు వంద రూపాయలు చార్జి వసూలు చేస్తున్నారు. 31 నిముషం దాటగానే అది కాస్తా నూటాభైకి ఆటోమేటిక్ గా చేరుకుంటోంది. రెండు గంటలు అయితే రెండు వందలు, ఒక వేల రోజంతా అయితే అక్షరాలా 450 రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారు అని అంటున్నారు. ఇక కమర్షియల్ కార్లకు వేరే రేటు ఉంది. ముఖ్యంగా జనాలకు విశాఖ నుంచి కానీ మరే ప్లేస్ నుంచి కానీ మోసుకుని వచ్చే టాక్సీల మీద పెను భారమే పడుతోంది అని అంటున్నారు. వారికి అరగంట పార్కింగ్ కి 200 వసూలు చేస్తున్నారు, గంట గడిస్తే 300 వందలు అవుతోంది. మూడు నాలుగు గంటలకు ఇలా ఆరు వందల దాకా చార్జీలు బాదుతున్నారని లబోదిబోమని అంటున్నారు.

బైకులకు బాదుడే :

ఈ ఎయిర్ పోర్టులో బైకులకు అర్ధ గంటకు 20 రూపాయలు గంటకు ముప్పయి రూపాయలు, రెండు గంటలకు 50, ఆ మీదట 130 రూపాయలు వసొలు చేస్తునారు. దీంతో ఇదేమిటి ఇంతలాగానా అని జనాలు అనుకునే పరిస్థితి ఉంది. మరో వైపు చూస్తే టాక్సీ డ్రైవర్లు అయితే లబోదిబోమంటున్నారు. తమకు విశాఖ నుంచి భోగాపురం ఎయిర్ పోర్టుకే ఏడు వందల రూపాయలు ఎయిర్ ట్రావెలర్స్ చెల్లిస్తూంటే అందులో నుంచి ఇన్ని వందలు ఇక్కడే ఇచ్చేయడమేంటి అని వారు ఆగ్రహిస్తున్నారు దీని మీద ఒక టాక్సీ డ్రైవర్ అయితే అక్కడ పార్కింగ్ స్టాఫ్ తో గొడవ పడుతున్న దృశ్యం కూడా వీడియో బైట్ రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతింత రేట్లు పెడితే ఎలాగా అని కూడా ఆటో డ్రైవర్లు ఆగ్రహిస్తున్నారు. ఒక వైపు దూరం మరో వైపు భారంతో ఇదేమి తీరు అని కూడా మండుతున్నారు.

అలవాటు పడేంత వరకూ :

ఏది ఏమైనా ధరలను నియంత్రించాలని కోరుతున్నారు. అయితే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అన్ని హంగులతో నిర్మించింది కాబట్టి ఈ ధరలు సమంజసమే అని ఆ వైపు నుంచి వినిపిస్తున్న మాట. పీపీపీ మోడ్ లో దీనిని నిర్మించారు. దాంతో పాటు లీజు కూడా దీర్ఘకాలం ఉంది. అందువల్ల ప్రైవేట్ నిర్వహణలో ఇలాగే ఉంటుందని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. మొత్తానికి భోగాపురం ఎయిర్ పోర్టు అంటే అందం ఆనందమే కాదు ఖరీదైనది కూడా అని జనాలు మెల్లగా అర్ధం చేసుకుని అలవాటు పడేంత వరకూ ఈ రుసరుసలు తప్పవని కూడా అంటున్నారు.



Tags:    

Similar News