బెంగళూరులో నెలకు రూ.15 వేలే ఖర్చా..? యువతి బడ్జెట్ చూసి షాక్ అవుతున్న నెటిజన్లు
దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా పేరున్న బెంగళూరులో నెలకు కేవలం రూ.15 వేలతో జీవనం సాగిస్తున్నానని ఓ యువతి చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.;
దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ఒకటిగా పేరున్న బెంగళూరులో నెలకు కేవలం రూ.15 వేలతో జీవనం సాగిస్తున్నానని ఓ యువతి చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. బెంగళూరులో జీవన వ్యయం అమాంతం పెరిగిపోయిందని చాలామంది వాపోతున్న సమయంలో, “నెలకు నా మొత్తం ఖర్చు రూ.15 వేలు మాత్రమే” అని ఆమె చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
ధర్షిణి అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో బెంగళూరులో తాను ఎలా ఖర్చులను నియంత్రిస్తూ జీవిస్తున్నానో వివరించింది. అయితే ఈ బడ్జెట్ ప్రతి ఒక్కరికీ వర్తించదని.. జీవనశైలి ఆధారంగా ఖర్చులు మారుతాయని కూడా ఆమె స్పష్టం చేసింది. “నేను చెప్పేది కేవలం ఒక అంచనా మాత్రమే. దయచేసి ఎవ్వరూ పోల్చుకోకండి. కొందరికి ఎక్కువ ఖర్చవచ్చు.. ఇంకొందరికి తక్కువ కావచ్చు” అంటూ ఆమె వీడియోను ప్రారంభించింది.
ధర్షిణి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు నెలలో అతిపెద్ద ఖర్చు పేయింగ్ గెస్ట్ రూం అద్దె. ప్రస్తుతం ఆమె ఇద్దరుండే షేరింగ్ గదిలో ఉంటుండగా దానికి నెలకు రూ.9,500 చెల్లిస్తున్నట్లు తెలిపింది. “బెంగళూరులో చాలా పేయింగ్ రెంట్ ల్లో ఇదే రేంజ్‌లో రెంట్ ఉంటుంది” అని ఆమె చెప్పింది.
ఆహార ఖర్చుల విషయంలో కూడా తాను జాగ్రత్తగా వ్యవహరిస్తానని ధర్షిణి వెల్లడించింది. “లంచ్ ఎక్కువగా ఆఫీసులోనే చేస్తాను. పీజీ ఫుడ్ అంతగా బాగోలేదు కాబట్టి అక్కడి భోజనంపై ఎక్కువగా ఆధారపడను. అప్పుడప్పుడు స్నాక్స్, గుడ్లు కొనుక్కుంటాను. బయట తినడం, ఆఫీస్ భోజనం కలిపి నెలకు దాదాపు రూ.2 వేల వరకు ఖర్చవుతుంది” అని వివరించింది.
ఇక వీకెండ్ అవుటింగ్స్, నెలలో ఒకసారి ఇంటికి వెళ్లడం వంటి ప్రయాణ ఖర్చులు కలిపి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు అవుతాయని తెలిపింది. మొత్తం అన్ని ఖర్చులు కలిపి గరిష్ఠంగా రూ.15 వేల వరకు మాత్రమే అవుతాయని చెప్పింది.
అయితే బెంగళూరులో స్వంతంగా ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటే ఖర్చులు భారీగా పెరుగుతాయని ఆమె అభిప్రాయపడింది. “చాలా రీల్స్‌లో బెంగళూరు చాలా ఖరీదైన నగరమని చెబుతుంటారు. నిజంగానే స్వంతంగా ఇల్లు తీసుకుంటే ఖర్చులు చాలా ఎక్కువ అవుతాయి. జీవనశైలి బట్టి కూడా ఖర్చులు మారుతాయి” అని ఆమె పేర్కొంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అనేక మంది నెటిజన్లు ఆశ్చర్యకరమైన కామెంట్లు చేస్తున్నారు. “ఇది ఎలా సాధ్యం?”, “బెంగళూరులో ఇంత తక్కువ బడ్జెట్ అంటే నమ్మలేకపోతున్నాం”, “రూ.15 వేలలో మేనేజ్ చేయడం నిజంగా గొప్ప విషయం” అంటూ స్పందిస్తున్నారు. మరికొందరు సరదాగా “నేను ఒక్కరోజులో గేమ్ కోసం రూ.20 వేలు ఖర్చు చేశా” అంటూ కామెంట్లు పెట్టారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. బెంగళూరులో పెరుగుతున్న జీవన వ్యయాల మధ్య ధర్షిణి చెప్పిన ఈ ‘లో బడ్జెట్ లైఫ్’ అనేక మందిలో ఆసక్తి రేకెత్తిస్తోంది.