విజయవాడ టు అమరావతి జల ప్రయాణం : రోడ్డు రద్దీకి ప్రత్యామ్నాయంగా వాటర్ మెట్రో, రూట్లు, టెర్మినల్స్ పూర్తి వివరాలు
రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా జల రవాణాకు ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు.
ఇప్పటివరకు మనం దేశంలో రోడ్లపై నిర్మించిన వంతెనల మీదుగా వెళ్లే మెట్రో రైళ్లనే చూశాం.. ఇప్పుడు కొత్తగా నదులు, కాలువలు, సరస్సుల గుండా ప్రయాణించే వాటర్ మెట్రోను చూడనున్నాం. ప్రస్తుతం కేరళంలోని కొచ్చిలో విజయవంతంగా నడుస్తున్న వాటర్ మెట్రోను ఏపీ రాజధాని అమరావతిలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. విజయవాడ, అమరావతిని అనుసంధానించే ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని అమరావతిని అంతర్జాతీయ స్థాయి స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా సింగపూర్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా జల రవాణాకు ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు.
విజయవాడ నుంచి అమరావతి వెళ్లేందుకు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రత్యామ్నాయంగా జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తున్న వాటర్ మెట్రో ప్రాజెక్టుకు అనుగుణంగా ఉండటంతో తొందరగా అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో కొచ్చి వాటర్ మెట్రో విజయవంతంగా నడుస్తోంది. దీంతో తక్కువ ఖర్చు, పర్యావరణ హితమైన ఈ రవాణా సౌకర్యాన్ని దేశంలో మరిన్ని నగరాలకు విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ముంబై (మహారాష్ట్ర), గువాహటి (అస్సాం), శ్రీనగర్ (జమ్మూ కాశ్మీర్), పాట్నా (బీహార్), వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), గోవా తదితర సుమారు 18 ప్రధాన నగరాల్లో వాటర్ మెట్రో ప్రాజెక్టులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి అమరావతి వెంకటేశ్వరస్వామి ఆలయం, తాళ్లాయపాలెం శివాలయం, గుంటూరు జిల్లా అమరావతిలోని అమరేశ్వరాలయాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి వాటర్ మెట్రో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ మధ్యలో ఉన్న భవాని ఐల్యాండ్, పవిత్ర సంగమాలను ఈ ప్రాజెక్టులో చేర్చారు. విజయవాడ, అమరావతి మధ్య రోడ్డు ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల జల రవాణా మార్గం ఆ రద్దీని తగ్గిస్తుందని ఆశిస్తున్నారు. విజయవాడ నుంచి అమరావతికి సుమారు 30 కిలోమీటర్ల మేర వాటర్ మెట్రో నడపాలని ప్రతిపాదిస్తున్నారు. ఇందుకోసం ఎలక్ట్రిక్, హైబ్రిడ్ నౌకలను ఉపయోగించనున్నారు.
30 కిలోమీటర్ల జలమార్గాన్ని అనుసంధానిస్తున్న వాటర్ మెట్రో అలైన్మెంటులో మొత్తం ఆరు టెర్మినల్స్ నిర్మించనున్నారు. రెండు దశల్లో పూర్తి చేసేలా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. మొదటి దశలో విజయవాడ నుంచి రాయపూడి వరకు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దూరానికి ఎలాంటి డ్రెడ్జింగ్ చేయాల్సిన అవసరం ఉండదని అంటున్నారు. రాష్ట్ర జల రవాణా మండలి ఇటీవల కార్గో బూటుతో ట్రయల్ రన్ కూడా పూర్తి చేసిందని చెబుతున్నారు. దీనివల్ల ఏడాది పొడవునా ఎలాంటి అవరోధాలు లేకుండా జల రవాణా సాగించవచ్చు అంటున్నారు. రెండో దశలో రాయపూడి నుంచి అమరావతి వరకు ప్రతిపాదించారు. ఈ మార్గంలో నావిగేషణ్ చానల్, డ్రిజ్జింగ్ పనులు నిర్వహించాల్సివుందని అంటున్నారు.
ఇక వాటర్ మెట్రో ప్రాజెక్టుకు ఎంతమంది ప్రయాణికులు రావొచ్చని అంచనా వేస్తున్నారు. దీనికి రోడ్డు రవాణా నుంచి 60 శాతం మందిని వాటర్ మెట్రోవైపు తీసుకురావచ్చని జల రవాణా మండలి అంచనా వేస్తోంది. తక్కువ చార్జీలకే ఈ వాటర్ మెట్రో ప్రయాణం ఉంటుందని చెబుతున్నారు. వాటర్ మెట్రో ప్రాజెక్టుకు నిర్మిస్తున్న ఆరు టెర్మినల్స్ కు సీఆర్డీఏ నిధులు సమకూర్చనుందని చెబుతున్నారు. మొదటి టెర్మినల్ ను విజయవాడలో దుర్గా ఘాట్ దగ్గర ఉంటుంది. దుర్గగుడికి అత్యంత సమీపంలో కృష్ణా నదికి అనుసంధానంగా టెర్మినల్ నున నిర్మిస్తారని అంటున్నారు. రెండో టెర్మినల్ భవానీ ఐల్యాండ్ లో నిర్మిస్తారు. మూడోది వెంకటపాలెం టీటీడీ ఆలయ సమీపంలో నిర్మించనున్నారు. నాలుగోది సీఆర్డీఏ సమీపంలోను, ఐదోది అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెబుతున్నారు. ఇక చివరి టెర్మినల్ ఇబ్రహీంపట్నంలో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారికి అతి సమీపంలో నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు.