బాబు విజ‌న్‌పై 'సుంకాల' ఎఫెక్ట్‌.. !

అమెరికా విధించిన 50% సుంకాలు ప్రభావం ఏపీ పై ఎక్కువగా కనిపిస్తోంది. ఇది చాలా చిత్రంగా ఉన్నప్పటికీ వాస్తవం.;

Update: 2025-08-29 03:36 GMT

విజన్ -2047 పేరుతో సీఎం చంద్రబాబు భవిష్యత్తును ఆవిష్కరించిన విషయం తెలిసిందే. 2047 నాటికి ఏపీ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా దేశంలో పేరు తెచ్చుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈ క్రమంలోనే అమరావతిని పరుగులు పెట్టించ‌డంతోపాటు ప్రాజెక్టులు..అదేవిధంగా ఐటీ, ఏఐ వంటి రంగాల్లో అభివృద్ధి చెందాలన్నది ఆయన పెట్టుకున్న లక్ష్యం. ఇదే సమయంలో ఇంటికో పారిశ్రామికవేత్త నినాదాన్ని కూడా వినిపిస్తున్నారు. 4-ఫోర్ పథకంలో దీన్ని కీలకమైన కార్యక్రమంగా మలిచారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు కేంద్రంలో మారుతున్న పరిణామాలు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడిలు వంటివి చంద్రబాబు లక్ష్యంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అమెరికా విధించిన 50% సుంకాలు ప్రభావం ఏపీ పై ఎక్కువగా కనిపిస్తోంది. ఇది చాలా చిత్రంగా ఉన్నప్పటికీ వాస్తవం. ఎందుకంటే ఆక్వా పరిశ్రమకు ఏపీ పుట్టినిల్లుగా ఉంది. ఇక్క‌డ నుంచి మేలు జాతి రొయ్యలు మేలు జాతి చేపలు అమెరికాకు ఎగుమ‌తి అవుతున్నాయి. ఇదే సమయంలో పొందూరు, మంగళగిరి, చీరాల ప్రాంతాల నుంచి వస్త్రాలు అమెరికాకు వెళ్తాయి. ఇప్పుడు ఈ రెండు రంగాల పైన సుంకాల ప్రభావం భారీ స్థాయిలో ఉంది. దీంతో ఈ రెండు రంగాలకు చెందిన రైతులు, అదేవిధంగా చేనేతకారులు తీవ్ర సంక‌టంలో మునిగిపోయారు.

ఇప్పటికిప్పుడు తమను ఆదుకోకపోతే ఈ రెండు రంగాలు మూతపడే పరిస్థితి ఉందన్నది వారు చెబుతున్న మాట. అయితే వీరిని ఆదుకోవాలంటే కనీసం వందల కోట్ల రూపాయలు కేటాయించాలి. అమెరికా విధిస్తున్న సుంకాలను భరించే పరిస్థితికి రావాలి. కానీ, అలా చూసుకుంటే రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు, ఇతర ఆదాయ పరిస్థితులు దానికి సహకరించే పరిస్థితి లేదు. దీంతో ఈ రెండు రంగాలను ఆదుకోవాలని తాజాగా సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అమెరికా విధిస్తున్న సుంకాల కారణంగా ఈ రెండు రంగాలు దెబ్బతినే పరిస్థితి ఉందన్నది చంద్రబాబు చెబుతున్న మాట.

అయితే ఈ రెండు రంగాలు దెబ్బతిన్నంత మాత్రాన విజన్ -2047పై ఏ మేరకు ప్రభావం పడుతుంది అనేది చూస్తే తీవ్ర ప్రభావమే పడుతుందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. రెండు కీలక రంగాలు దెబ్బతింటే రాష్ట్రానికి వచ్చే అదాయం తగ్గిపోవడంతో పాటు ఇతర పెట్టుబడులు కూడా పెట్టే అవకాశాలు ఉండకపోవచ్చు అన్నది వారి అంచనా. ఇప్పటికే రాష్ట్రంలో సాగు పరిస్థితి ఇబ్బందిగా ఉంది. రైతులకు పెట్టిన పెట్టుబడులు వెనక్కి రావడం లేదు. పైగా ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి కూడా పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేయటం, రైతుల నుంచి కొనుగోలు చేయటం వంటివి సవాలుగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో కీలకమైన చేనేత ఆక్వా పరిశ్రమలపై అమెరికా సుంకాలు ప్రభావం చూపిస్తుండడంతో 2047 లక్ష్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల తో పాటు ఆర్థిక నిపుణులు కూడా వ్యాఖ్యానిస్తూ ఉండడం గమనార్హం. అయితే, దీనికి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలోనే వినియోగం పెంచాల్సిన అవసరం ఉందని ఆక్వా ఉత్పత్తులను స్థానిక వినియోగంలోకి తీసుకురావడం అదేవిధంగా చేనేత ఇతర జౌళి పరిశ్రమలను దేశీయంగా మార్కెటింగ్ చేసుకునేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వారు చెప్తున్నారు. ఏదేమైనా ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చింది అన్నట్టుగా అమెరికా విధించిన సుంకాలు ఏపీపై ప్రభావం చూపిస్తుండడం గమనార్హం.

Tags:    

Similar News