నామినేషన్ల చివరి రోజు ట్విస్టు.. మూడు చోట్ల వైసీపీకి షాక్

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు.

Update: 2026-10-18 14:02 GMT

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఆ తర్వాత సమయం మించిపోయిందని పలుచోట్ల అభ్యర్థులను వెనక్కి పంపారు. రాష్ట్రంలో మొత్తం వంద పట్టణ సంస్థలకు నామినేషన్లు స్వీకరించారు. ఇందులో 13 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు ఉన్నాయి. అయితే రాయలసీమతోపాటు ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులతో నామినేషన్ల ప్రక్రియకు ఆటంకం కలిగింది. మిగిలిన ప్రాంతంలో సజావుగా ముగిసింది. అధికార, విపక్షాల మధ్య ఘర్షణలతో రాయచోటి, దర్శి, పిడుగురాళ్లలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని చెబుతున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో తొలి ఘట్టం ముగిసింది. ఈ నెల 14న షెడ్యూల్ విడుదల కాగా, 16వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించారు. సోమవారం నామినేషన్లను పరిశీలిస్తారు. 21వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. 26వ తేదీవరకు అభ్యర్థులు ప్రచారం చేసుకునేందుకు గడువు ఉంది. 28న పోలింగ్, 30న ఫలితాలు విడుదల అవుతాయి. మూడు రోజులుగా వంద పట్టణ సంస్థల్లో నామినేషన్లు స్వీకరించగా, రాయలసీమలోని ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

తొలిరోజు పుంగనూరులో మొదలైన గొడవ పులివెందులలో పతాకస్థాయికి చేరింది. చివరికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సైతం జోక్యం చేసుకోవాల్సివచ్చింది. ఈ పరిణామాల మధ్యే ఆదివారం పలుచోట్ల ఘర్షణలు జరుగుతుండగానే వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం మూడు గంటలలోపు నామినేషన్ కేంద్రంలోకి వచ్చిన వారికే అధికారులు అనుమతిచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో రాయచోటిలో వైసీపీ చైర్మన్ అభ్యర్థితోపాటు కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయలేకపోయారని అంటున్నారు.

రాయచోటిలో మూడు రోజులుగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. 16వ తేదీన వైసీపీ కార్యాలయంలో వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. అప్పుడు మొదలైన ఉద్రిక్తతలు మూడు రోజు వరకు కొనసాగాయి. ఈ పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్ కేంద్రానికి సమయం లోగా వెళ్లలేకపోయారని అంటున్నారు. ఇక దర్శిలోనూ ఇదే పరిస్థితి నెలకుందని చెబుతున్నారు. దర్శిలో నామినేషన్ వేయలేక 25 మంది అభ్యర్థులు వెనుదిరిగారు. పిడుగురాళ్లలో వైసీపీ చైర్మన్ అభ్యర్థి 20 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఎన్నికల అధికారులు అనుమతించలేదు.

ఈ పరిణామాలతో మూడు చోట్ల వైసీపీ పోటీ లేకుండానే మున్సిపల్ ఎన్నికలు జరిగే పరిస్థితి ఉందని అంటున్నారు. అయితే అక్కడ ఇప్పటికే నామినేషన్ వేసిన అభ్యర్థులకు వైసీపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ కూటమికి వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన వారితో ఉపసంహరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తొలి ఘట్టం ముగియడంతో నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిళ్లు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో రాజకీయం ఉత్కంఠ రేపుతోందని అంటున్నారు.

Tags:    

Similar News