తొలిరోజే రణరంగం.. రాయలసీమలో తీవ్ర ఉద్రిక్తత
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల తొలిరోజే యుద్ధకాండ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల తొలిరోజే యుద్ధకాండ నెలకొంది. మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గమైన పుంగనూరులో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. ఇక మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సొంత నియోజకవర్గం రాయచోటిలో వైసీపీ కార్యాలయంలో పలు కార్లు దహనమయ్యాయి. ఈ సంఘటనలు పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చేశాయని అంటున్నారు.
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు. నామినేషన్ల దాఖలకు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ఒకేసారి వస్తుండటంతో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. నామినేషన్ల తొలిరోజే యుద్ధకాండ నెలకొనడంతో వచ్చే నెల రోజులు శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రాయలసీమలోని పలుచోట్ల ముఠా తగాదాల ఆనవాళ్లు ఈ ఎన్నికల సందర్భంగా భయపడుతున్నాయని అంటున్నారు.
పుంగనూరు రణరంగం
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పుంగనూరు పట్టణంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకేసారి నామినేషన్ వేసేందుకు కార్యాలయంలోకి వెళ్లడంతో ఘర్షణ చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. పరస్పరం తోపులాటతో మొదలైన గొడవ రాళ్లు విసురుకునే వరకు వెళ్లింది. ఒకానొక సమయంలో రాడ్లు, దుడ్డ కర్రలు రంగం ప్రవేశం చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఇరుపార్టీలు కూడా తమ వారు గాయపడ్డారని చెబుతున్నాయి. వైసీపీకి మద్దతుగా ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని అంటున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాలిలోకి కాల్పులు జరపాల్సివచ్చిందని అంటున్నారు.
రాయచోటిలో అగ్నీకీలలు
మున్సిపల్ ఎన్నికల్లో రాయలసీమ జిల్లాలోనే ఘర్షణ వాతావరణం కనిపిస్తోందని చెబుతున్నారు. ప్రధానంగా అన్నమయ్య జిల్లాలో పరిస్థితులు అదుపులో కనిపించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జిల్లాలోని పుంగనూరులో రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. ఇదే సమయంలో అటు రాయచోటి పట్టణంలో వైసీపీ కార్యాలయంలో ఒకేసారి నాలుగు కార్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లుగా చెబుతున్నారు. ఇది టీడీపీ మద్దతుదారుల పనే అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ ఇంచార్జి శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన కొద్దిసేపటికే కార్లకు నిప్పు పెట్టడం గమనార్హం. ఈ ఘటనకు ఎవరు బాధ్యులు అన్న విషయం తేల్చేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అటు తిరుపతిలోనూ రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం అందుతోంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల తొలిరోజే వివాదాలు పరిస్థితిని వేడెక్కించాయి.