స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా నిర్ణయిస్తారు ?

ఆర్టికల్ 243డి 73వ సవరణ ప్రకారం పంచాయతీలలో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

Update: 2026-10-16 11:15 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందడి నేపథ్యంలో అసలు ఈ ఎన్నికల్లో అసలు రిజర్వేషన్లు ఎలా నిర్ణయిస్తారు ? అన్న చర్చ మొదలయింది. రిజర్వేషన్ల మూలంగా పోటీకి అవకాశం కోల్పోతున్న కొందరు ఏకంగా అప్పటికప్పుడు పెళ్లిళ్లు కూడా చేసేసుకున్నారు. అయినా కూడా అదృష్టం దక్కక అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అంటూ ఆవేదనగా పాటలు పాడుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి.

అసలు రిజర్వేషన్లు ఎలా కేటాయిస్తారు ?

ఆర్టికల్ 243డి 73వ సవరణ ప్రకారం పంచాయతీలలో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం సీట్లు కేటాయిస్తారు. అందులో 1/3వ వంతు మహిళలకు కేటాయిస్తారు. ఆర్టికల్ 243టి ప్రకారం ఇవే నిబంధనలు పట్టణ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలకు వర్తిస్తాయి. వీటినే రోటేషన్ పద్దతిలో కేటాయిస్తారు. సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాలకు, మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, జనరల్ అంటూ కేటాయింపు ఎలా జరుగుతుంది?

2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారం, రాజీవ్ రంజన్ మిశ్రా కమీషన్ రిపోర్టు ఆధారంగా బీసీలకు స్థానాలను కేటాయించడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరికీ కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేటాయించాలి. కేటాయించిన అన్ని స్థానాలలో 50 శాతం మహిళలకు కేటాయించాలి. రాజ్యాంగం కనీసం 1/3 కేటాయించాలని చెబుతుండగా, ఏపీలో ప్రయోగాత్మకంగా దాదాపు 50 శాతం అమలు చేస్తున్నారు. మహిళలకు రిజర్వ్ చేసే సమయంలో ఆ వార్డులలో మహిళా ఓటర్ల నిష్పత్తి, జనాభాను పరిగణనలోకి తీసుకుంటారు. జనాభా నిష్పత్తి, రొటేషన్ రూల్స్ తో పాటు అవసరం అయితే లాటరీ పద్దతి అవలంభిస్తారు.

రిజర్వేషన్ల రొటేషన్ విధానం ఎలా ఉంటుంది ?

ఒక వార్డులో పదవి ఎప్పటికీ ఒకే కేటగిరీకి ఉండకూడదు. ఈ ఎన్నికల్లో రిజర్వ్ అయిన వార్డు తర్వాతి ఎన్నికల్లో అదే కేటగిరీకి రాకూడదు. సైక్లింగ్ మాదిరిగా తిరుగుతూ వస్తుండాలి. ఒకే వార్డుకు రెండు సార్లు మహిళకే రిజర్వేషన్ రావచ్చు. కానీ వీలయినంత వరకు సైక్లింగ్ పద్దతి అనుసరిస్తారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో ఈ సారి రిజర్వేషన్లను కొత్త సైకిల్ గా పరిగణించారు.

ఏపీలో ప్రస్తుతం ఎవరెవరికి ఎలా రిజర్వ్ చేశారు ?

ఏపీలో ప్రస్తుత ఎన్నికల్లో సగటున 28.18 శాతం స్థానాలు బీసీలకు కేటాయించారు. అన్ని కేటగిరీలలో మహిళలకు 50 శాతం రిజర్వ్ చేశారు. 50 శాతం పరిమితి నేపథ్యంలో 34 శాతం బీసీ కోటా రద్దయింది. మొత్తం 3942 పట్టణ వార్డులలో 508 ఎస్సీ, 140 ఎస్టీ, 1319 బీసీ, 1073 జనరల్ మహిళ, 902 అన్ రిజర్వ్ డ్ కోటాగా నిర్ణయించారు.

మహిళా రిజర్వ్డ్ స్థానాలలో పురుషులు పోటీ చేయవచ్చా?

మహిళా రిజర్వ్డ్ వార్డులో కేవలం మహిళలే పోటీ చేయాలి. జనరల్ స్థానాలు, అన్ రిజర్వ్డ్ స్థానాలలో జనరల్ మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు చెందిన ఏ మహిళలు అయినా పోటీ చేయవచ్చు. కానీ ఎస్టీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన స్థానాలలో జనరల్ మహిళలు పోటీ చేయడనికి అవకాశం లేదు.

మున్సిపాలిటీ మరియు పంచాయతీ ఎన్నికలలో ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది ?

రెండింటిలోనూ ఒకే రాజ్యాంగ నిబంధనలు వర్తిస్తాయి. గ్రామపంచాయతీ, మండలం, జిల్లా స్థాయి యూనిట్లుగా, మున్సిపల్ లో వార్డు, మున్సిపాలిటీ కార్పోరేషన్ స్థాయిలో జిల్లా కలెక్టర్ రిజర్వేషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.

రిజర్వేషన్ల అధికారిక జాబితా ఎక్కడ చూడాలి?

రిజర్వేషన్ల అధికారిక జాబితా ఏపీ స్టేట్ ఎన్నికల కమీషన్ వెబ్సైటులో, జిల్లా కలెక్టర్ గెజిట్ నోటిఫికేషన్లలో చూడొచ్చు. ఈ నెల 13 వరకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

Tags:    

Similar News