కూటమి వర్సెస్ వైసీపీ : బీసీ ఓట్లు గంపగుత్తగానే ?

ఏపీలో మొత్తం జనాభా అయిదు కోట్లు పై చిలుకు ఉంటే యాభై శాతం దాకా బీసీలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి.

Update: 2026-10-03 00:30 GMT

ఏపీలో మొత్తం జనాభా అయిదు కోట్లు పై చిలుకు ఉంటే యాభై శాతం దాకా బీసీలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రసుతం దేశంలో జన గణన కుల గణన సాగుతోంది. ఆ వివరాలు 2027 మధ్యలో వస్తాయి. అపుడు పూర్తి స్థాయి వివరాలు సమగ్రంగా వస్తాయి. అయినప్పటికీ బీసీలే సగం దాకా ఉన్నారు అన్న దాని మీదనే ఇపుడు ఏపీ రాజకీయాల్లో రాజకీయం సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముంగిట ఉన్న వేళ బీసీ ఓట్లను గంప గుత్తగా తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీ కూటమి అలాగే వైసీపీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నాయి.

కొత్త జీవోలతో :

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఆగస్టు నెలలో జరిగిన శాసన సభ సమావేశాలలో కూటమి ప్రభుత్వం తీర్మానం ఆమోదించింది. ఈ క్రమంలో 105, 1065 ల పేరుతో రెండు జీవోలను జారీ చేసింది. ఈ జీవోల ప్రకారం చూస్తే గ్రామీణ ప్రాంతాలలో 34 శాతం రిజర్వేషన్లు, అలాగే పట్టణాలలో 33.33 శాతం రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేయాలన్నది ఉంది. అయితే దీని మీద హైకోర్టు విచారించి ఈ రెండు జీవోలను కొట్టేసింది. దాంతో కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ కేసు వేయనుంది. సుప్రీం కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుంది అన్నది పక్కన పెడితే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసే విషయంలో తమ చిత్తశుద్ధిని కూటమి ప్రభుత్వం రుజువు చేసుకుంటోంది అని అంటున్నారు. న్యాయ పోరాటాన్ని ఎక్కడా ఆపకుండా చేస్తోంది అని అంటున్నారు.

బీసీ చాంపియన్ గా :

తెలుగుదేశం బీసీల పార్టీ అని తమ్ముళ్లు అంటున్నారు. టీడీపీ వచ్చాకనే బీసీలకు ఎక్కువగా రాజకీయ అవకాశాలు వచ్చాయని ఇది అక్షర సత్యం అని చెబుతున్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి బీసీల ప్రయోజనం కోసం కట్టుబడి ఉన్నది టీడీపీయే అని అంటోంది. బీసీల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించిన పార్టీగా టీడీపీకి ఉన్న క్రెడిబిలిటీ వేరు అని అంటోంది. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తామంటే వైసీపీ మోకాలడ్డు తోందని కోర్టులో కేసులు వేయించిందని కూడా ఆరోపిస్తోంది. అదే విధంగా బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చామని సామాజిక న్యాయం చేశామని వైసీపీ అంటోంది. తమ హయాలోనే బీసీలకు కార్పోరేషన్లు తెచ్చామని లోక్ సభతో పాటు రాజ్యసభలో కూడా ఎక్కువ ప్రాతినిధ్యం ఇచ్చామని వైసీపీ అంటోంది. మంత్రి పదవులు, ఎమ్మెల్సీ స్థానాలు నామినేటెడ్ పదవులు అన్నీ బీసీలకు ఇచ్చిన క్రెడిట్ తమది అని వైసీపీ వాదిస్తోంది.

ట్రంప్ కార్డు గానే :

ఇదిలా ఉంటే బీసీ ట్రంప్ కార్డుతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాలు సాధించాలని టీడీపీ వైసీపీ చూస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు బీసీలకు తాము చేసిన మేలు ఏమిటి అన్నది చెబుతున్నాయి. అయితే యాభై శాతం లోపు రిజర్వేషన్లు ఉండాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టి బీసీల కోసం జీవోలు తెచ్చినా ప్రయోజనం ఏమిటి అని వైసీపీ అంటోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది కాబట్టి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తించేలా పార్లమెంట్ లో చట్టం చేయించాలని డిమాండ్ చేస్తోంది. టీడీపీ అయితే వైసీపీది అంతా మభ్యపెట్టే వైఖరి అని తాము బీసీల ప్రయోజనాలను కాపాడుతున్నామని అంటోంది. ఇంతకీ ఏపీలో రెండున్నర కోట్ల మద్ని జనాభాగా బీసీలు ఉన్నారు. అందులో రెండు కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. వారంతా గంపగుత్తగా ఏ పార్టీకి ఓటు చేస్తారు అన్నది స్థానిక పోరులో తేలనుంది అని అంటున్నారు. ఇకపోతే 2014లో వైసీపీకి బీసీల మద్దతు తక్కువగా ఉన్నా 2019లో మెరుగుపరుచుకుంది. 2024 లో ఓటమి పాలు అయినా బీసీల ఓట్లు కూడా ఆ పార్టీకి పడ్డాయి. ఈసారి ఆ ఓట్ షేర్ ని పెంచుకోవాలని చూస్తోంది. వైసీపీకి ఎక్కడా ఈ చాన్స్ ఇవ్వకూడదని టీడీపీ పట్టుదలగా ముందుకు సాగుతోంది.

Tags:    

Similar News