వైసీపీకి ఇష్టం లేని మాట ఏకగ్రీవం !
అవును. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏకగ్రీవం అసలే వద్దు అంటోంది. ఆ మాట ఎక్కడ ఏ కోశానా ఏ మారు మూల పంచాయతీ వార్డు మెంబర్ ఎన్నికల్లో సైతం వినిపించకూడదు అని గట్టి పట్టుదలతో ఉంది.
అవును. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏకగ్రీవం అసలే వద్దు అంటోంది. ఆ మాట ఎక్కడ ఏ కోశానా ఏ మారు మూల పంచాయతీ వార్డు మెంబర్ ఎన్నికల్లో సైతం వినిపించకూడదు అని గట్టి పట్టుదలతో ఉంది. ఏం చేస్తారో తెలియదు, ఎలాంటి వ్యూహాలు పన్నుతారో కూడా తెలియదు, వైసీపీ అభ్యర్ధులు అన్ని చోట్లా పోటీ చేసి తీరాల్సిందే అంటూ వైసీపీ అధినాయకత్వం పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. డూ ఆర్ డై అన్న తీరున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాడాలని సూచించింది. బుధవారం స్థానిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిన నేపథ్యంలో వైసీపీ పూర్తి స్థాయిలో అప్రమత్తం అయింది అని అంటున్నారు. దాంతో ఏకగ్రీవాలు లేకుండా ప్రతీ చోటా వైసీపీ జెండా ఎగిరి తీరాల్సిందే అని స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించింది అని అంటున్నారు.
పార్టీ అండగా :
పార్టీ నాయకులకు అభ్యర్ధులకు ఈ విషయంలో వైసీపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని కూడా భరోసా ఇచ్చింది. మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంతవరకూ పార్టీ నేతలు అంతా అలెర్ట్ గా ఉండాలని వైసీపీ అధినాయకత్వం సూచించింది. నామినేషన్ల ఘట్టం నుంచి పోలింగ్ వరకూ అలాగే కౌంటింగ్ దాకా పార్టీ నాయకులు అంతా వేయి కళ్లతో పరిశీలించాలని సూచించింది. పార్టీ నాయకులు కూడా అభ్యర్ధులకు మద్దతుగా ఉంటూ పార్టీ విజయావకాశాలను పూర్తి స్థాయిలో పెంచాలని కోరింది. అలాగే అభ్యర్ధులకు దిశా నిర్దేశం చేస్తూ వారిలో ఆత్మ స్థైర్యం నిండుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత జగన్ కోరారు.
సమయం తక్కువగానే :
ఎన్నికల షెడ్యూల్ ని చూసిన వైసీపీ హైకమాండ్ సమయం తక్కువగా ఉందని అభిప్రాయపడుతోంది. దీని వల్ల వ్యూహాత్మకంగా అంతా వ్యవహరించాలని జగన్ కోరారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి, డాక్యుమెంటేషన్, నామినేషన్లు, ప్రచార సన్నాహాలు అన్నీ కూడా పూర్తి కో ఆర్డినేషన్ తో ఏకకాలంలో జరగాలని ఆయన అన్నారు. రాబోయే 15 నుంచి 20 రోజుల పాటు పరిశీలకులు నిరంతరం అభ్యర్థులకు అందుబాటులో ఉండి సమన్వయంతో పనిచేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే అభ్యర్థులను న్యాయ, మీడియా, డిజిటల్, సంస్థాగత బృందాలతో అనుసంధానించాలని అన్నారు. అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలు, బకాయిలు లేని ధృవీకరణ పత్రాలు ఇతర తప్పనిసరి పత్రాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఒకవేళ ఏవైనా జాప్యాలు జరిగితే అవసరమైన చోట న్యాయపరమైన జోక్యం కోసం కేంద్ర కార్యాలయానికి నివేదించాలని జగన్ సూచించారు.
త్వరగా నామినేషన్లు దాఖలు :
ఇక సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి చివరి నిముషం వరకూ ఆగకుండా వైసీపీ అభ్యర్ధులు త్వరగా నామినేషన్లు దాఖలు చేయాలని జగన్ కోరారు. ఇక ఏవైనా ఆటంకాలు, పోలీసుల జోక్యం లేదా పరిపాలనాపరమైన అవకతవకలను వీడియో సాక్ష్యాల ద్వారా నమోదు చేయాలని సూచించారు. వైసీపీకి చెందిన ఎన్నికల పరిశీలకులు ప్రచార కార్యకలాపాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సీసీటీవీ కవరేజ్, కౌంటింగ్ కేంద్రాలు ఇతర ఎన్నికల సంబంధిత ఏర్పాట్లను కూడా పర్యవేక్షించాలని అన్నారు. క్షేత్రస్థాయి బృందాలను పార్లమెంట్ పరిశీలకులు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు కేంద్ర కార్యాలయంతో అనుసంధానించే రోజువారీ నివేదన యంత్రాంగం పార్టీకి ఉంటుందని చెప్పారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అంతటా పరిశీలకుల క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యల పరిష్కారం, సమన్వయంతో పాటు అభ్యర్థులకు అందించే మద్దతు ఆధారంగా వారిని అంచనా వేస్తామని జగన్ చెప్పుకొచ్చారు.
పట్టుదలగానే :
వైసీపీ విషయానికి వస్తే ఆనాడు అంటే 2021లో ఏకగ్రీవాలు చేయాల్సిందే అన్న వైఖరిని ప్రదర్శించింది అని గుర్తు చేస్తున్నారు. ఇపుడు మాత్రం అసలు ఏకగ్రీవం అన్న పదం వినిపించకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. పోటీకి దిగాల్సిందే సత్తా చూపించాల్సిందే అని అంటోంది. మరి వైసీపీ అధినాయకత్వం వేడి ఒత్తిడి దిగువ స్థాయి క్యాడర్ ఏ మేరకు ఒంటబట్టించుకుంటుంది. గ్రౌండ్ లో ఏ మేరకు ఫైట్ ఇస్తుంది అన్నది రానున్న రోజులలో తెలియనుంది.