ఎక్సైజ్ లో వసూళ్ల పర్వం.. ప్రభుత్వ అనుకూల మీడియాలో సంచలన కథనం!

ఏపీలో ఎక్సైజ్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలను సర్కారు నిర్వహించడంతో ఎక్సైజ్ అధికారులకు పెద్దగా పనిలేకుండా పోయింది.;

Update: 2025-10-19 11:30 GMT

ఏపీలో ఎక్సైజ్ శాఖ తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలను సర్కారు నిర్వహించడంతో ఎక్సైజ్ అధికారులకు పెద్దగా పనిలేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ శాఖకు మళ్లీ అధికారాలు దక్కడంతో ఉద్యోగులు ఝూలు విధిల్చుతున్నారని, గత ఐదేళ్లలో అక్రమ మార్గంలో ఒక్క రూపాయి అందుకోలేక అల్లాడిపోయిన ఉద్యోగులు.. ఇప్పుడు రెట్టింపు మొత్తంలో వసూళ్లకు తెగబడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఎక్సైజ్ శాఖలో కిందిస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వసూళ్లపై ప్రభుత్వ అనుకూల మీడియాలో తాజాగా వెలువడిన కథనం సంచలనంగా మారింది. ఎక్సైజ్, పోలీసు శాఖ కలిపి మద్యం దుకాణాల నుంచి ఏటా దాదాపు రూ.400 కోట్లు దండుకుంటున్నారని ఆ కథనంలో ఆరోపించడం విశేషం.

రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలు ఉండగా, ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.65 వేలు చొప్పున ఎక్సైజ్, పోలీసు శాఖ అధికారులు వసూలు చేస్తున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ విషయం నిజమేనంటూ మద్యం లైసెన్సీలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఏ ప్రభుత్వంలో అయినా మద్యం దుకాణాల నుంచి మామూళ్లు దండుకోవడం ఎక్సైజ్, పోలీసు అధికారులకు పరిపాటని, కానీ, ఈ సారి మరింత శ్రుతిమించి వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తమకు ఇస్తామన్న 20 శాతం కమీషన్ ఇవ్వలేదని, కానీ ఎక్సైజ్ అధికారులు మాత్రం తమ కమీషన్ మొత్తాన్ని మాత్రం పెంచేశారని గగ్గోలు పెడుతున్నారు.

రాష్ట్రంలో మద్యం దుకాణాల నుంచి స్థానిక ఎక్సైజ్ పోలీసులు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు లంచంగా సమర్పిస్తుండగా, పోలీసు స్టేషన్లకు రూ.10 వేల నుంచి రూ.15 వేల చొప్పున ముట్టజెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఎక్సైజ్ ఉప కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఈఎస్ స్క్వాడ్, రాష్ట్ర టాస్క్ ఫోర్సు, మద్యం డిపోలు ఇలా దశల వారీగా డబ్బు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న కమీషన్ తగ్గించేయడం వల్ల వ్యాపారంలో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అయినా కనికరం లేకుండా ఎక్సైజ్ శాఖ తమను పిండేస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పులు ఇచ్చిన వారు సైతం ఎక్సైజ్ అధికారులు మాదిరిగా డబ్బులు అడిగే పరిస్థితి ఉండదని, ముడుపులు సొమ్ము ఇచ్చేవరకు వదలకుండా వేధిస్తున్నారని మద్యం లైసెన్సీలు ఆరోపిస్తున్నారు. లంచాలు ఇచ్చుకోలేక కొన్ని దుకాణదారులు అక్రమ మార్గాలలో మద్యం విక్రయాలపై ద్రుష్టి పెట్టాల్సివస్తోందని అంటున్నారు. ములకలచెరువు, ఇబ్రహీంపట్నం వంటి ఉదంతాలకు కూడా లంచాలు ఒక కారణంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. టార్గెట్లు ప్రకారం మద్యం కొనుగోలు చేయడం, అధికారులకు లంచాలు ఇచ్చుకోవడం భారంగా మారడం వల్ల బెల్టుషాపుల నిర్వహణ, కల్తీకి పాల్పడటం వంటివి జరుగుతున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

గత ప్రభుత్వంలో మద్యం క్రయ, విక్రయాలు అన్నీ ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఉండిపోవడంతో క్షేత్ర స్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు ఉద్యోగులు, అధికారులు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోవాల్సివచ్చిందని, ఇప్పుడు అమ్మకాలు ప్రైవేటు పరం కావడంతో అధికారులు తమ ప్రతాపం చూపుతున్నారని అంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో లైసెన్సీలు ఏదో ఒక తప్పు చేయడం, ఆ తప్పును ఆసరాగా చేసుకుని అధికారులు మామూళ్లు వసూళ్లు చేస్తుండటం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని అంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఈ వసూళ్లపై ఫోకస్ చేసి నియంత్రించకపోతే.. చంద్రబాబు ప్రభుత్వం అప్రతిష్ఠపాలయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News