కాక్రోచ్ జనతా పార్టీకి అన్నా హజారే ఆశీస్సులు..! జాతీయ రాజకీయాల్లో 'యువశక్తి' ఆవిర్భావానికి సంకేతమా?

సోషల్ మీడియా సంచలనం ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నుంచి అనూహ్య మద్దతు లభించింది.

Update: 2026-05-26 07:31 GMT

సోషల్ మీడియా సంచలనం ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నుంచి అనూహ్య మద్దతు లభించింది. పార్టీ పేరు బాగా లేకపోయినా, యువత ఉద్దేశం బాగుందని అన్నాహజారే కితాబునిచ్చారు. గతంలో లోక్ పాల్ బిల్లు కోసం ఉద్యమించి ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావానికి కారణమైన అన్నా హజారే ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని ప్రశంసించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాక్రోచ్ పార్టీతో ఇప్పుడు మళ్లీ అలాంటి సంచలనానికి పునాది పడుతోందా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మార్మోగిపోతున్న ‘కాక్రోచ్’

ఇటీవల సోషల్ మీడియాలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరు మార్మోగిపోతోంది. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, విద్యావ్యవస్థలో లోపాలు, ప్రభుత్వాల వైఫల్యాలపై యువత తమ నిరసనను వ్యక్తం చేయడానికి మీమ్స్ చేస్తూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలను వదిలిపెడుతున్నారు. ఎక్స్ లో కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్‌ను బ్యాన్ చేసినప్పటికీ, ‘కాక్రోచెస్ నెవర్ డై’ అంటూ ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’ పేరుతో సరికొత్త ప్రచారాన్ని యువత ఉధృతం చేసింది. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ డిజిటల్ విప్లవంపై సీనియర్ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించడం ఆసక్తికరంగా మారింది. ‘‘ఈ పార్టీకి పెట్టిన 'జురాల్' (బొద్దింక) అనే పేరు సరైనది కాకపోవచ్చు. కానీ, ఈ పేరు వెనుక ఉన్న దేశ యువత ఆక్రోశాన్ని, ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. యువశక్తే దేశ శక్తి. యువత అంతా ఏకమైనప్పుడు ప్రభుత్వం వారిని విస్మరించకూడదు, వారిని ప్రోత్సహించాలి.’’ అని అన్నా హజారే స్పష్టం చేశారు. అంతేకాకుండా రాజకీయ, సామాజిక అంశాలపై యువత ఇలా చురుగ్గా స్పందించడం శుభపరిణామమని ఆయన కొనియాడారు.

కొత్త పార్టీ ఆవిర్భావానికి సంకేతమా?

గతంలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం తేలికగా తీసుకుంది. కానీ ఆ వేదిక నుంచే కేజ్రీవాల్ నేతృత్వంలో 'ఆప్' పుట్టి సాంప్రదాయ రాజకీయ పార్టీలకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు దేశంలో నిరుద్యోగం, పరీక్షల లీకేజీల వంటి సమస్యలపై యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. డిజిటల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' ఉద్యమానికి అన్నా హజారే వంటి పెద్దల మద్దతు లభించడంతో, ఇది కేవలం సోషల్ మీడియా మీమ్స్‌కే పరిమితం కాకపోవచ్చని విశ్లేషకులు సందేహిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యువతను ఏకం చేస్తూ, భవిష్యత్తులో ఇదొక బలమైన రాజకీయ శక్తో లేదా కొత్త పార్టీగానో రూపాంతరం చెందే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.

Tags:    

Similar News