ఆంధ్ర ప్రదేశ్ పేరు మార్చేయాలా ...ఎందుకలా ?
ఆంధ్రప్రదేశ్ గా ఉన్న పేరుని మార్చేయాలా. ఎందుకు అలా చేయాలి. దాని వెనక కారణాలు ఏమైనా ఉన్నాయా. అసలు ఆ అవసరం ఉందా.;
ఆంధ్రప్రదేశ్ గా ఉన్న పేరుని మార్చేయాలా. ఎందుకు అలా చేయాలి. దాని వెనక కారణాలు ఏమైనా ఉన్నాయా. అసలు ఆ అవసరం ఉందా. ఇది ఒక చర్చ. అసలు ఇదంతా ఎందుకు అంటే కేరళ రాష్ట్రం పేరుని కేరళంగా మార్చుతూ ఇటీవల కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో వివిధ రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తమ రాష్ట్రం పేరుని బంగ్లాగా మార్చాలని మరోసారి డిమాండ్ చేసింది. ఇప్పటికే ఈ పేరుతో ప్రతిపాదనలు కొన్ని సార్లు కేంద్రానికి వెళ్ళాయని చెబుతున్నారు.
అనేక రాష్ట్రాల పేర్లు :
ఇదిలా ఉంటే దేశంలో అనేక రాష్ట్రాల పేర్లు మారాయి. మద్రాస్ స్టేట్ తమిళనాడుగా మార్చుకుంది. బాంబే స్టేట్ కాస్తా మహారాష్ట్ర, గుజరాత్ గా మారింది. హైదరాబాద్ స్టేట్ తెలంగాణాగా మారింది. అలాగే మైసూర్ స్టేట్ కర్ణాటకగానూ, ఒరిస్సా ఒడిషాగానూ, ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్ గానూ యునైటెడ్ పావిన్సెస్ ఉత్తర ప్రదేశ్ గానూ మధ్య భారత్ కాస్తా మధ్య ప్రదేశ్ గానూ కాలక్రమంలో పేర్లు మార్చుకున్నారు. ఇలాగే అనేక రాష్ట్రాలు తమ పేర్లను మార్చాలని కోరుతున్న సందర్భాలు ఉన్నాయి. పేర్లు ఎందుకు అంటే స్థానిక అస్తిత్వం చాటి చెప్పేందుకు భాష ప్రాంతం గురించి మరింత గొప్పగా చెప్పుకునేందుకు అని అంటారు.
ఏపీ విషయంలో :
ఇక ఏపీ విషయంలో చూస్తే ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఆనాడు 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. ఆ సమయంలో పేరు ఆంధ్ర రాష్ట్రంగా ఉండేది. కర్నూల్ రాజధానిగా చేసుకుని మూడేళ్ళు పాలించాక 1956 నవంబర్ 1న నాటి హైదరాబాద్ స్టేట్ తో కలుపుకుని విశాలాంధ్రగా ఏర్పాడింది. ఆ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ అన్న పేరు వచ్చింది. ఈ పేరుని నాటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు సూచించారు అని చెబుతారు.అలా అరవై ఏళ్ళ పాటు ఆంధ్ర ప్రదేశ్ గానే చలామణీ అయింది. 2014లో ఏపీ తెలంగాణా రెండూ విడిపోయాయి. నాటి హైదరాబాద్ స్టేట్ పేరు కాస్తా తెలంగాణాగా నామకరణంతో స్థిరపడింది. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం అదే పేరుతో ఉండిపోయింది.
హిందీ పదంగా :
ఆంధ్ర తెలుగు పదం ప్రదేశ్ హిందీ పదం ఈ విధంగా కలయిక విచిత్ర పద సమాహారంగా ఉందని చాలా మంది విమర్శించారు. ఇప్పటికీ అదే అంటూంటారు. అంతే కాదు ఆంధ్ర ప్రదేశ్ పేరు కలసి రాలేదని అంటూంటారు ఉత్తరాన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ హిమాచలప్రదేశ్ ఉన్నాయి. దక్షిణాన అన్ని రాష్ట్రాలు స్థానిక అస్థిత్వంతో సొంత పదాలతో తమ ప్రాంతీయతను చాటుకునేలా పేర్లు రాష్ట్రానికి పెట్టుకుంటే ఆంధ్ర ప్రదేశ్ తో ఏపీ హిందీ వాసనలతో అలాగే కొనసాగుతోందన్న విమర్శలూ లేకపోలేదు.
ఆంధ్ర రాష్ట్రంగా లేదా :
ఇపుడు కేరళం పేరు మార్పుతో ఏపీ పేరుని కూడా అచ్చ తెలుగులోకి మార్చుకోవాలని డిమాండ్ అయితే వినిపిస్తోంది. అయితే ఇది సోషల్ మీడియాలోనే ఎక్కువగా డిబేట్ గా సాగుతోంది. ఆంధ్ర రాష్ట్రంగా పేరు ఉండాలని అత్యధికులు సూచిస్తున్నారు. మరి కొందరు ముందుకెళ్ళి ఆంధ్ర నాడు అన్న పేరుని కూడా పెట్టాలని అంటున్నారు. లేదా తెలుగు నాడు అయినా సబబుగా ఉంటుందని సూచిస్తున్నారు. తమిళనాడు పొరుగున తమ తమిళ భాష అస్థిత్వంతో ఉందని అలాగే తెలుగు నాడు లేదా ఆంధ్ర నాడు అంటే సబబుగా ఉంటుందని అంటున్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవంగా :
అంతే కాదు ఉమ్మడి మద్రాస్ నుంచి వేరు పడి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయింది కాబట్టి ఆ రోజుని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా చేయాలని కోరుతున్నారు. ఏపీకి ఇప్పటిదాకా అవతరణ దినోత్సవం అంటూ లేకపోవడం కూడా ఆక్షేపణీయం అని అంటున్నారు. మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది, కేంద్రంలో ఎన్డీయే ఉంది. ఈ పేరు మార్పు ప్రతిపాదన పంపిస్తే ఆమోదం పొందడం కష్టమేమీ కాదని అంటున్నారు. అంతే కాదు అక్షర క్రమంలో కూడా ఏపీ మొదటి స్థానం అలాగే ఉంటుందని చెబుతున్నారు. చూడాలి మరి ఇది కేవలం డిమాండ్లు డిబేట్లుగానే ఉంటుందా లేదా ఉద్యమంగా మారుతుందా అన్నది.