ఆటోడ్రైవర్ అవతారంలో సీఎం భార్య.. అందరికీ షాక్
ముంబై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి, సెలబ్రెటీ సింగర్ అమృత అందరినీ ఆశ్చర్యపరిచారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సతీమణి, సెలబ్రెటీ సింగర్ అమృత అందరినీ ఆశ్చర్యపరిచారు. ముంబై రోడ్లపై ఆటోడ్రైవర్ అవతారం ఎత్తిన అమృత.. అలవోకగా ఈ-రిక్షాను నడిపి తనలో మరో కోణాన్ని ఆవిష్కరించారని ప్రశంసలు అందుకుంటున్నారు. ముంబై లాంటి మెట్రో నగరంలో ముఖ్యమంత్రి భార్య స్వయంగా ఆటో నడిపిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అసలే సెలబ్రెటీ, పైగా ముఖ్యమంత్రి భార్య హోదాలో ఉన్న ఆమె పబ్లిసిటీ కోసం కాకుండా.. సామాజిక దృక్పథంతో చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అసలు ఏం జరిగింది?
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైకి చెందిన ప్రముఖ సామాజిక సంస్థ 'భామ్లా ఫౌండేషన్' ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళల స్వయం ఉపాధి, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా 'పింక్ ఈ-రిక్షా' ప్రాజెక్టును నిన్న ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమృతా ఫడణవీస్, కేవలం రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోకుండా స్వయంగా రంగంలోకి దిగారు. మరికొందరు మహిళలను ఎక్కించుకుని ఓ ఆటోను స్టార్ట్ చేసి తనే డ్రైవ్ చేసి అందరినీ ఆశ్యర్యానికి గురిచేశారు.
మహిళా డ్రైవర్లలో జోష్
మహిళా డ్రైవర్లలో ఆత్మవిశ్వాసం నింపడానికే అమృత స్వయంగా రంగంలోకి దిగారని అంటున్నారు. ఈ రంగంలో మహిళలు ఉపాధి పొందేలా ప్రోత్సహించడానికి ఆమె ఇలా డ్రైవర్ అవతారమెత్తి ఆటో హ్యాండిల్ పట్టారని చెబుతున్నారు. సీఎం భార్య స్వయంగా ఆటో నడపడం చూసి అక్కడి మహిళా డ్రైవర్లు కేరింతలు కొడుతూ ఆమెను ఉత్సాహపరిచారు. పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడంతో పాటు, 'మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదు' అనే బలమైన సందేశాన్ని ఇవ్వడానికి అమృత చొరవ తీసుకోవడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
వెయ్యి మంది మహిళలకు ఉపాధి
భామ్లా ఫౌండేషన్ ప్రారంభించిన ఈ 'పింక్ ఈ-రిక్షా' ప్రాజెక్ట్ ద్వారా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని సుమారు 1,000 మంది నిరుపేద, ఒంటరి మహిళలకు ఉపాధి దక్కనుందని చెబుతున్నారు. పర్యావరణ అనుకూలమైన ఈ-రిక్షాలను నడపడం ద్వారా మహిళలు ఆర్థికంగా స్థిరపడడమే కాకుండా, ముంబైలో కాలుష్య నియంత్రణకు కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.