నాడు అర కిలో రాయి రూ.16వేలు.. నేడు ఒక టైల్ రూ.1.87 లక్షలు!

ఇప్పుడంతా ఆన్ లైన్ షాపింగ్ హవా నడుస్తోన్న సంగతి తెలిసిందే. రోజువారీ బిజీ లైఫ్ కారణంగా షాపులకు వెళ్లి వస్తువులు కొనేవారి కంటే ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.;

Update: 2025-10-31 06:39 GMT

ఇప్పుడంతా ఆన్ లైన్ షాపింగ్ హవా నడుస్తోన్న సంగతి తెలిసిందే. రోజువారీ బిజీ లైఫ్ కారణంగా షాపులకు వెళ్లి వస్తువులు కొనేవారి కంటే ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అయితే ఈ క్రమంలో పలు ఎదురుదెబ్బలు కూడా తగులుతున్నాయి. ఒక వస్తువు ఆర్డర్ పెడితే.. ఊహించని స్థాయిలో అన్నట్లుగా రాళ్లు, రప్పలు డెలివరీ అవుతున్నాయి.

అవును... ఆన్‌ లైన్ షాపింగ్‌ లో కొన్ని తప్పులు దొర్లుతున్న సంగతి తెలిసిందే. అది పొరబాటా, మోసమా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. కస్టమర్ ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ అవుతున్న క్రమంలో దిమ్మతిరిగే షాకులు ఇస్తుంది. ఈ క్రమంలో గతంలో ఓ ఫోన్ ఆర్డర్ చేస్తే అరకిలో రాయి డెలివరీ అవ్వగా, తాజాగా సుమారు రెండు లక్షల రూపాయల ఫోన్ ఆర్డర్ పెడితే టైల్ పంపారు!

నాడు ఎం.ఐ. ఏ3 ఫోన్ బుక్ చేస్తే.. రాయి వచ్చింది!:

అనంతపురం జిల్లా ఉరవకొండలో గతంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఇందులో భాగంగా ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆన్ లైన్ లో ఫోన్ బుక్ చేయగా.. రాయి వచ్చింది. రూ.16 వేలు పెట్టి ఎం.ఐ. ఏ3 ఫోన్ బుక్ చేయగా.. డెలివరీ బాయ్ అతడికి పార్శిల్ ఇచ్చాడు. ఓపెన్ చేసి చూస్తే అందులో ఫోన్ లేదు సరికదా.. ఓ అరకిలో బరువున్న రాయి మాత్రం ఉంది.

నేడు శాంసంగ్ ఫోన్ బుక్ చేస్తే.. టైల్స్ పంపారు!:

ఇక, తాజాగా బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్ ఆన్‌ లైన్ షాపింగ్ ప్లాట్‌ ఫామ్ అమెజాన్ ద్వారా ఆర్డర్ చేసిన రూ. 1.87 లక్షల శామ్‌ సంగ్ స్మార్ట్‌ ఫోన్‌ కు బదులుగా టైల్ ముక్కను అందుకున్న ఘటన తెరపైకి వచ్చింది. దీంతో అతడు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశాడు. ఈ సమయంలో అమెజాన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

వివరాళ్లోకి వెళ్తే... ప్రేమానంద్ అనే వ్యక్తి అక్టోబర్ 14న అమెజాన్ యాప్ ద్వారా స్మార్ట్‌ ఫోన్ కోసం ఆర్డర్ చేసి, తన క్రెడిట్ కార్డ్ ద్వారా పూర్తి మొత్తాన్ని చెల్లించాడు. ఈ క్రమంలో.. అక్టోబర్ 19న డెలివరీ వచ్చింది. ఈ నేపథ్యంలో.. ఆ సీల్డ్ ప్యాకేజీని అన్‌ బాక్స్ చేస్తున్న సమయమో వీడియోను రికార్డ్ చేశాడు. ఆ సమయంలో ఆ ప్యాక్ లో స్మార్ట్‌ ఫోన్‌ కు బదులుగా టైల్ ముక్కను అతడు కనుగొన్నాడు.

ఈ సందర్భంగా స్పందించిన ప్రేమానంద్... తాను రూ. 1.87 లక్షల విలువైన శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7ని ఆర్డర్ చేసినట్లు చెప్పాడు. అయితే.. తనకు షాక్ ఇచ్చేలా, దీపావళికి ఒక రోజు ముందు ఫోన్‌ కు బదులుగా పాలరాతి రాయి వచ్చిందని.. ఈ సంఘటన ఏడాది పొడవునా జరుపుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ స్ఫూర్తిని పూర్తిగా నాశనం చేసిందని తెలిపాడు.

అనంతరం.. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశాడు. తర్వాత అధికారిక ఫిర్యాదు నమోదు నిమిత్తం కుమారస్వామి లేఅవుట్ పోలీస్ స్టేషన్‌ ను సంప్రదించాడు. ఈ సందర్భంగా ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నందున అమెజాన్ ఆ మొత్తాన్ని ప్రేమానంద్‌ కు తిరిగి చెల్లించింది.

Tags:    

Similar News