అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో బయటపడ్డ మృత్యుంజయుడు.. ఆయన మానసిక స్థితి ఎలా ఉందంటే?

మరోవైపు గత నాలుగు నెలల క్రితం జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన మృత్యుంజయుడు రమేష్ శారీరకంగా కోలుకున్నా.. మానసికంగా కృంగిపోతున్నాడు.;

Update: 2025-11-04 04:07 GMT

గత కొన్ని రోజులుగా వరుస ప్రమాదాలు ఇటు ప్రజలకు.. ఆ ప్రమాదాల నుంచి బయటపడిన వ్యక్తులను మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదాలు వ్యక్తుల మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతున్నాయి అని.. సదరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్నామధ్య అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం ఏ స్థాయిలో ప్రజలను ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ప్రమాదం నుంచి బయటపడక ముందే పలు ప్రాంతాలలో విమాన ప్రమాదాలు ప్రజలను ఉలిక్కిపాటుకు గురి చేశాయి . విమానయానం చేయాలంటనే భయపడే స్థాయికి చేరుకున్నారు.

ఇక కనీసం బస్ లేదా రైలు ప్రయాణం బెటర్ అనుకుంటే ఇప్పుడు అక్కడ కూడా భద్రత లేకుండా ప్రమాదాలే ముంచుకొస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ - బెంగళూరు వెళ్లాల్సిన కావేరీ ట్రావెల్స్ కర్నూలుకి 10 కిలోమీటర్ల దూరంలో అగ్నికి ఆహుతి అయ్యి ఏకంగా 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే ఆ ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద జరిగిన మరో బస్సు ప్రమాదంలో ఇంకో 19 మంది తుది శ్వాస విడిచారు. ఇలా వరుస ప్రమాదాలు దేశాన్ని అట్టుడికిస్తున్నాయి.

ఇదిలా ఉండగా.. మరోవైపు గత నాలుగు నెలల క్రితం జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన మృత్యుంజయుడు రమేష్ శారీరకంగా కోలుకున్నా.. మానసికంగా కృంగిపోతున్నాడు. ప్రమాదంలో తన తమ్ముడిని కోల్పోయిన ఆయన.. ఆ ప్రమాదం నుండి బయటపడిన తర్వాత ఆ ఘటన పదేపదే గుర్తొస్తోందని, రాత్రంతా ఆలోచిస్తూ మేలుకొనే ఉంటున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నా భార్య, కొడుకుతో కూడా మాట్లాడడం లేదు. మానసికంగా వేదన అనుభవిస్తున్నాను. గత నాలుగు నెలలుగా మా అమ్మ కూడా మాట్లాడట్లేదు అంటూ ఒక ఇంటర్వ్యూలో తన బాధను వెళ్ళబుచ్చుకున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే ఆ ప్రమాద తాలూకా ప్రభావం ఈయనపై ఏ రేంజ్ లో పడిందో అర్థం చేసుకోవచ్చు.

ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ ప్రమాదాలను ప్రత్యక్షంగా చూసి ప్రమాదాల నుండి బయటపడిన ఎంతోమంది వ్యక్తులు ఇలాంటి మానసిక పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ విషయంపై మానసిక నిపుణులు కూడా స్పందిస్తున్నారు. సాధారణంగా సున్నిత మనస్కులు చిన్న చిన్న విషయాలకే ఎక్కువ ప్రభావితం అవుతూ ఉంటారు. కానీ ఇంత పెద్ద ఘటనలను ప్రత్యక్షంగా చూసి ఆ ప్రమాదం నుంచి బయటపడి, ఆ ఘటనలను మరిచిపోలేక మానసికంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారికి కౌన్సిలింగ్ తప్పనిసరి.. సాధ్యమైనంత వరకు నలుగురిలో కలిసేలా..నలుగురితో మాట్లాడేలా ముఖ్యంగా తమ మనసులోని బాధను బయటపెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అని సలహాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఆకస్మిక ప్రమాదాలు అటు శారీరక స్థితి పైనే కాకుండా ఇటు మానసిక స్థితిపై కూడా ప్రభావితం చేస్తున్నాయని చెప్పవచ్చు.

Tags:    

Similar News