డిప్లమాలో చేరిన 75 ఏళ్ల కుర్రాడు.. మార్కులు తెలిస్తే వావ్ అంటారు
కొందరు మాత్రం ఆ మాటను నిజం చేస్తుంటారు.వయసుతో సంబంధం లేకుండా తాము అనుకున్న పనుల్ని ఇట్టే పూర్తి చేస్తారు.;
వయసు అన్నది కేవలం ఒక నెంబరు మాత్రమే అన్న మాటను తరచూ వింటుంటాం. కొందరు మాత్రం ఆ మాటను నిజం చేస్తుంటారు.వయసుతో సంబంధం లేకుండా తాము అనుకున్న పనుల్ని ఇట్టే పూర్తి చేస్తారు.ఈ క్రమంలో వారు చూపే టాలెంట్ కు ఫిదా కావాల్సిందే. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే. 70 ఏళ్ల వయసులో ఐటీఐ డిప్లమా చేయాలన్న ఆసక్తి కలగటమే కాదు.. ఆ వెంటనే కాలేజీ చేరి.. తన మనమలు వయసున్న పిల్లలతో కలిసి కాలేజీకి వెళ్లటమే కాదు.. పరీక్షల్లో వారికి మించి మార్కులు సాధించిన వైనం చూస్తే.. వావ్ అనకుండా ఉండలేం.
తమిళనాడులోని కాంచీపురం జిల్లా వలత్తూర్ గ్రామానికి చెందిన మణి 1950లో జన్మించారు. పాఠశాల విద్య తర్వాత ఐటీఐ చేశారు. అనేక ప్రైవేటు కంపెనీల్లో ఎలక్ట్రికల్ విభాగంలో పని చేశారు. ఆయనకు భార్య, కొడుకు..కుమార్తె ఉన్నారు. కొడుకు రామచంద్రన్ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ లో జాబ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రెండేళ్ల క్రితం మణికి చదువుకోవాలన్న ఆసక్తి కలిగింది.
దీంతో.. డిప్లమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 2023లో చెన్నై తరమణిలోని పాలిటెక్నిక్ కళాశాలలో చేరారు. మిగిలిన కాలేజీ విద్యార్థుల మాదిరే క్లాస్ రూంకు కాలేజీ యూనిఫాం ధరించి ఎంతో ఉత్సాహంగా పాఠాలు వినేవారు. ప్రస్తుతం థర్డ్ ఇయర్ చదువుతున్న ఆయనకు మొదటి ఏడాది 91 శాతం.. రెండో ఏడాది 88 శాతం మార్కుల్ని సాధించటం విశేషం. 75 ఏళ్ల వయసులో ఉరకలెత్తే ఉత్సాహంతో.. తన మనమలు వయసున్న కుర్రాళ్లతో పోటీ పడి.. మార్కులు సాధించటం చూస్తే.. ఆయన పట్టుదలకు ఫిదా కాకుండా ఉండలేం కదా?