YRF: ఆల్ఫా ఎఫెక్ట్.. ఆ రెండు సినిమాల సంగతేంటి?
మొదట్లో ఆ ఫ్రాంచైజీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సినీ ఇండస్ట్రీలో స్పై సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. కథ, యాక్షన్ సరిగ్గా కుదిరితే స్పై సినిమాలను భారీ హిట్లుగా మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదే ఫార్ములాతో బాలీవుడ్ లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ను స్టార్ట్ చేశారు. మొదట్లో ఆ ఫ్రాంచైజీకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
సల్మాన్ ఖాన్ నటించిన ఏక్ థా టైగర్ తో వైఆర్ఎఫ్ స్పై సినిమాల జర్నీ మొదలైంది. ఆ తర్వాత వచ్చిన టైగర్ జిందా హై కూడా మంచి విజయాన్ని అందుకుంది. హృతిక్ రోషన్ వార్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన పఠాన్ భారీ వసూళ్లు సాధించింది. ఇలా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వైఆర్ఎఫ్ తన స్పై యూనివర్స్ రేంజ్ పెంచుకుంటూ వెళ్లింది.
ఒక సినిమాలోని హీరో మరో మూవీలో కనిపించడం, స్పై పాత్రలను ఒకే యూనివర్స్ లోకి తీసుకురావడం వంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చాయి. పఠాన్ లో టైగర్ కనిపించడం, టైగర్ 3లో పఠాన్ ఎంట్రీ ఇవ్వడం అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో స్పై యూనివర్స్ పై అంచనాలు పెరిగాయి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు ఆల్ఫా విషయంలో వస్తున్న విమర్శలు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ఫ్యూచర్ పై చర్చకు కారణమయ్యాయి. ఆలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఆ సినిమాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్పై సినిమా పేరుతో ఒకే తరహా కథలను చూపిస్తున్నారని, యాక్షన్ సీన్స్ ఉన్నంత మాత్రాన ప్రేక్షకులను ఆకట్టుకోవడం సాధ్యం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతి సినిమాలో పాకిస్థాన్ అంశాన్ని తీసుకురావడం, దాని చుట్టూనే కథలను నడిపించడం కూడా ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
స్పై యూనివర్స్ అంటే కేవలం భారీ యాక్షన్ సన్నివేశాలు, స్టార్ హీరోల అతిథి పాత్రలు మాత్రమే కాదని.. బలమైన కథ, కొత్తదనం కూడా అవసరమని చర్చ జరుగుతోంది. ఇకక్డే ఇప్పుడు వైఆర్ఎఫ్ ప్లాన్ చేస్తున్న మరో రెండు భారీ సినిమాలపై ఆసక్తి నెలకొంది. షారూఖ్ హీరోగా పఠాన్ 2 తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు సల్మాన్, షారూఖ్ ప్రధాన పాత్రల్లో టైగర్ వర్సెస్ పఠాన్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఆల్ఫాపై వస్తున్న విమర్శల వేళ, అందరి దృష్టి ఆ రెండు సినిమాలపైనే పడింది. ఇప్పటికే స్పై యూనివర్స్ సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతోందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పఠాన్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ లో వైఆర్ఎఫ్ ఎలాంటి మార్పులు చేస్తుందనేది కీలకంగా మారింది. ఆల్ఫా విషయంలో వస్తున్న విమర్శలను ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుందో చూడాలి. పాత ఫార్ములాను పక్కనపెట్టి కొత్తగా ప్రయత్నిస్తారా? లేదంటే అదే తరహా కథలతో ముందుకు వెళ్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.