అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ కష్టాలు!
ఒక స్టోరీని నిర్మాత, హీరో, హీరోయిన్ అంగీకరించి సెట్స్‌పైకి వెళ్లాలంటే కొత్త దర్శకుడు పరిస్థితులతో యుద్ధమే చేయాల్సి వస్తోంది.;
ఒక స్టోరీని నిర్మాత, హీరో, హీరోయిన్ అంగీకరించి సెట్స్‌పైకి వెళ్లాలంటే కొత్త దర్శకుడు పరిస్థితులతో యుద్ధమే చేయాల్సి వస్తోంది. నిర్మాతని పట్టుకుని ఒప్పించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో హీరోని ఒప్పించడం అన్నది బిగ్ టాస్క్‌గా మారింది. ఎన్నో ప్రయాసలు, అవమానాలు, నిరీక్షణలు ఎదుర్కొని హీరో ఫైనల్‌గా ఓకే చెప్పినా కొన్ని సార్లు హీరోయిన్ ఆ ప్రాజెక్ట్‌కు స్పీడ్ బ్రేకర్‌గా మారి ఆ ప్రాజెక్ట్‌ని ప్రశ్నార్థంగా మారుస్తున్న సంఘనటలు ఇటీవల జరుగుతున్నాయి. ఆ సమస్యను కూడా అధిమించి హీరోయిన్‌ని ఒప్పించినప్పుడే ప్రాజెక్ట్ సాఫీగా పట్టాలెక్కుతోంది.
కెరీర్ ప్రారంభం నుంచి ఇలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంటున్నాడో యంగ్ డైరెక్టర్. కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించి అవకాశాలు రాకపోవడం, చేసిన చోట అవమానాలు, బ్రేక్‌లు రాకపోవడంతో ట్రాక్ మార్చుకుని డైరెక్టర్‌గా మారాలని తొలి ప్రాజెక్ట్ కోసం పెద్ద యుద్ధమే చేశాడు. చావు నేపథ్యంలో కథ రాసుకుని దానికి ఫైనల్ మెరుగులద్ది తనే హీరోగా సినిమా చేయాలని డిస్ట్రిబ్యూటర్‌కు కథ వినిపించాడు. అక్కడి నుంచి మొదలైన అతడి ప్రయాణం అడుగడుగునా ముళ్ల బాటగా సాగుతూ చివరికి స్టార్ ప్రొడ్యూసర్ వరకు వచ్చి చేరింది.
తను చెప్పిన కథ స్టార్ ప్రొడ్యూసర్‌కి నచ్చినా దాన్ని నిర్మించే కొత్త తరం ప్రొడ్యూసర్స్‌కి పెద్దగా అర్థం కాలేదు. దీంతో చావు చుట్టూ సినిమా ఏంటని?..ఇది వర్కవుట్ కాదని వాదించారు. ఫైనల్‌గా సినిమా మొదలైనా సెట్‌లో తను ఏం తీస్తున్నాడో తెలియక సదరు కమెడియన్‌కు డైరెక్షన్ రాదని, ఇలాంటి వ్యక్తిని నమ్మి ఎలా అవకాశం ఇచ్చాడని ప్రతీ రోజు సెట్‌లో ఇబ్బందికరంగా ప్రవర్తించారు. ఫైనల్‌గా నువ్వు అనుకున్నది కాదు..మేము చెప్పినట్టుగా తీయమని చెప్పడం మొదలు పెట్టారు. చేసేది లేక..తను చెప్పాలనుకున్న కథ డైల్యూట్ అవుతుందని తెలిసి చేసేది లేక మనసు అంగీకరించకపోయినా వారు చెప్పిందే చేయడం మొదలు పెట్టారు.
ఫలితంగా కాన్సెప్ట్ దారి తప్పింది. విషయం స్టార్ ప్రొడ్యూసర్ వద్దకు వెళ్లింది. కొత్త డైరెక్టర్‌ని, యువ ప్రొడ్యూసర్లని పిలిచి తను చెప్పిన కథ చెప్పినట్టుగానే తీయాలి..అలా కాకుండా మీరు చెప్పినట్టుగా తీస్తే అందులో సోల్ పోతుంది. తనని ఎవరూ డిస్ట్రబ్ చేయోద్దని చెప్పడంతో ఆ రోజు నుంచి యువ దర్శకుడు అనుకున్నకథని అనుకున్నట్టుగా తీయడం మొదలు పెట్టాడు. అయినా సరే ఇద్దరు యువ ప్రొడ్యూసర్లకు ఎక్కడా నచ్చలేదు. స్టార్ ప్రొడ్యూసర్ చెప్పాడని అడ్డు చెప్పలేదు. అలా యువ డైరెక్టర్ తాను అనుకున్నది చేసి అద్భుతం సృష్టించాడు. జాతీయ స్థాయిలో అవరాడ్లుతో పాటు ప్రశంసల్ని దక్కించుకున్నాడు.
ఇప్పడు అదే డైరెక్టర్‌కు అదే టీమ్ రెండవ సినిమా అవకాశం ఇచ్చింది. ఇది పక్కా రూటెడ్ స్టోరీ. హీరో క్యారెక్టర్ రూటెడ్‌గా ఉండాలి. హీరోయిన్ క్యారెక్ట్ కూడా ప్రధానమే. అయితే దీని కోసం కూడా యంగ్ డైరెక్టర్ ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇద్దరు హీరోలు మారారు. మరో వ్యక్తిని హీరోగా పరిచయం చేస్తూ సినిమా మొదలు పెట్టారు. అదే ఇప్పడు ప్రధాన సమస్యగా మారి ఈ ప్రాజెక్ట్ నుంచి హీరోయిన్ తప్పుకోవడంతో ఇబ్బందికర పరిస్థితులు మొదలయ్యాయి. దీంతో మొదటి సినిమాకే యుద్ధం చేసిన డైక్టర్ రెండవ సినిమాకు కూడా అంతకు మించిన కష్టాలని ఎదుర్కొంటుండటంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్, డైరెక్టర్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాడు. అతని కష్టాలు తీరి సినిమా సాఫీగా పూర్తవుతుందా? అన్నది ఇప్పుడు అందరి మదిని తొలుస్తోంది.