ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్ల పరిస్థితి మరీ దారుణమా?
ఈ రోజుల్లో ప్రొడక్షన్ కంపనీలని పట్టుకోవడమే చాలా బిగ్ టాస్క్‌గా మారింది. ఓ ప్రముఖ ప్రొడక్షన్ కంపనీలో కథలు వినో ఓ వ్యక్తికి స్టోరీ చెప్పడానికి ప్రయత్నించాను. చాలా సార్లు ఫోన్ చేశాను. కానీ ఫలితం లేదు.;
ఇండస్ట్రీలోకి కొత్త నీరు ఎప్పుడూ వస్తుండాలి. న్యూ టాలెంట్‌కు ఇక్కడ గేట్లు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. టాలెంట్ ఉన్న వాళ్లు ఎవరైనా నిరభ్యంతరంగా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించవచ్చు. కొత్త కథలు రావడం లేదు. రైటర్ల కొరత ఇక్కడ చాలా ఉంది. ఎవరైనా కొత్త కథలతో వస్తే అవకాశాలు ఇవ్వడానికి మేం రెడీగా ఉన్నాం...ఇండస్ట్రీలో తరచూ వినిపించే డైలాగ్‌లివి. స్టేజ్ ఎక్కి మైక్ పట్టిన ప్రతి ఒక్కరూ గత కొన్ని దశాబ్దాలుగా చెబుతున్న మాటలివి. అయితే రియాలిటీ మాత్రం చాలా దారుణంగా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం.
అయితే ఇలాంటి చేదు నిజాన్ని బయటపెట్టడానికి ఎవరూ సాహసించరు. బయటపెడితే ఇండస్ట్రీలో తొక్కేస్తారని భయం. అయితే అప్పుడప్పుడు ఈ చేదు నిజాన్ని కొంత మంది బయటపెట్టేస్తుంటారు. తాము పడిన ఆవేదనని, అవమానల్ని తట్టుకోలేక బయటపెట్టేస్తుంటారు. తాజాగా ఓ యువ దర్శకుడు సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడట. ఓ పోడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ యంగ్ డైరెక్టర్ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కొత్త కథలు కావాలని, న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తామని చెబుతున్న ఇండస్ట్రీ వర్గాల్లోని కొంత మంది మాటలకు, చేతలకు ఎక్కడా పొంతన ఉండటం లేదని సదరు డైరెక్టర్ మాటల్లో స్పష్టమవుతోంది.
ఈ రోజుల్లో ప్రొడక్షన్ కంపనీలని పట్టుకోవడమే చాలా బిగ్ టాస్క్‌గా మారింది. ఓ ప్రముఖ ప్రొడక్షన్ కంపనీలో కథలు వినో ఓ వ్యక్తికి స్టోరీ చెప్పడానికి ప్రయత్నించాను. చాలా సార్లు ఫోన్ చేశాను. కానీ ఫలితం లేదు. వీళ్లు చెప్పేది ఒకటి చేసేది మరొకటి. కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తామంటారు కానీ రియాలిటీలో మాత్రం కలవడానికే ఇష్టపడరు. తరువాత మరో ప్రముఖ కంపనీలో కథ చెప్పాలని స్టోరీలు వినే వ్యక్తిని కలిశాను. ఎప్పుడు ఫోన్ చేసినా ఫలానా చోట కథ విందాం అనేవాడు. చెప్పడానికి వెళితే `అయ్యయ్యో చివరి నిమిషంలో పనిపడిందమ్మ వెళ్లిపోతున్నాను` అని చెప్పేవాడు.
ఒక రోజు వన్ అవర్‌లో కలుద్దాం అన్నారు. లొకేషన్ ఎక్కడ అని అడిగితే రిప్లై ఇవ్వలేదు. అయితే రెగ్యులర్‌గా కలిసే చోటే ఉంటాడు కదా అని అక్కడికే వెళ్లి చూస్తే అక్కడే కారులో ఉన్నాడు. డైరెక్ట్‌గా వచ్చామని చెబితే బాగుండదని తనకి ఫోన్ చేసి సర్ కలుస్తా అన్నారు అన్నాను. వెంటనే తను `లేను దూరంగా ఉన్నానమ్మా. తరువాత కలుస్తాను` అన్నాడు. వెంటనే లేదు సార్ నేను ఆఫీస్ దగ్గరే ఉన్నానని చెబితే నన్ను చూసే ఫోన్ చేశాడని భావించిన ఆయన `సరే వస్తున్నాను అక్కడే ఉండు` అని ఫోన్ పెట్టేసి వచ్చి `నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు.
అదేంటీ కథ చెప్పాల కదా సార్ అని చెబితే `నేను చెబుతాను కదా..అంత తొందరైతే ఎలాగా..ఇలాగైతే కష్టం అమ్మా` అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాని తరువాత మరో ఆఫీస్‌లో ట్రై చేశా. నన్ను ఉదయం 7 గంటలకు వచ్చి కథ చెప్పమన్నారు. ప్రిపేరై ఉదయం 6:45కు వెళ్లి ఆఫీస్‌లో కూర్చున్నాను. 8:45 వరకు ఎదురు చూసి కాల్ చేస్తే కట్ చేశాడు. ఆ తరువాత 8:50కి రిప్లై వచ్చింది. `నేను అర్జెంట్ పనుండి వైజాగ్ వచ్చాను. సో ఫ్లైట్‌లో ఉండటం వల్ల నా కాల్ కలవలేదు` అన్నాడు. ఆ మాటలు విని షాకయ్యాను. వైజాగ్ వెళుతున్నామంటే ముందు నుంచి ప్లాన్ ఉంటుంది కదా?..అలాంటప్పుడు నాకు పనుంది తరువాత కలుద్దాం అంటే నేను వెళ్లను కదా? అంటూ యువ డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కొత్త కథలతో కోటీ ఆశలతో డైరెక్టర్లు కావాలని ఒక్క ఛాన్స్ అంటూ ప్రొడక్షన్ కంపనీల చుట్టూ తిరుగులున్న యంగ్ టాలెంట్‌ని ఇలా అవమానించడం, అవకాశం ఇవ్వాలని లేకున్నా.. కలుస్తామని చెప్పి ఇలా షాడిస్టిక్‌గా బిహేవ్ చేయడం నిజంగా శోచనీయం. ప్రముఖ ప్రొడక్షన్ కంపనీల్లో స్టోరీ లిజనర్స్‌గా ఉంటున్న వాళ్లు చాలా వరకు ఇదే తరహా ప్రవర్తనతో ఎంతో మంది యంగ్ స్టర్లని ఆడుకుంటున్నారు. సదరు యంగ్ డైరెక్టర్ తరహాలో ఇప్పటి వరకు ఎంతో మంది ప్రొడక్షన్ కంపనీల్లో ఉండే స్టోరీ లిజనర్స్ కారణంగా ఇబ్బంది పడిన వారు చాలా మందే ఉన్నారు. ఇప్పటికైనా ఈ థోరణిలో మార్పులు రావాలని అంతా అంటున్నారు. ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, నిర్మాతలు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.