విశ్వక్‌ని వదలని లైలా...!

ఆ ప్రశ్న అడిగిన వాడిని ఉద్దేశించి కాస్త నన్ను మాట్లాడనివ్వురా బాబు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు.

Update: 2026-10-19 10:35 GMT

విశ్వక్‌ సేన్‌ ప్రస్తుతం 'కల్ట్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. తాజాగా ఈవెంట్‌ నిర్వహించి మరీ ట్రైలర్‌ లాంచ్ చేయడం జరిగింది. కల్ట్‌ సినిమాను స్వయంగా విశ్వక్‌సేన్‌ రాసుకుని, దర్శకత్వం వహిస్తున్నాడు. మొదట ఈ సినిమాకు మరో దర్శకుడు వర్క్ చేస్తాడనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా దర్శకత్వ బాధ్యతలను సైతం తానే నెత్తిన వేసుకున్నట్లుగా విశ్వక్‌ సేన్‌ చెప్పుకొచ్చాడు. ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ లో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ ఒక మంచి సినిమాను, ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని జోనర్‌లో సినిమాను చేసినట్లుగా చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఆయన గత చిత్రం 'లైలా' సినిమా గురించి ట్రోల్స్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది. ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో కూడా విశ్వక్‌సేన్‌కి 'లైలా' గొడవ తప్పలేదు. ఆ సినిమా ప్రస్తావన వచ్చింది.

విశ్వక్‌సేన్ కల్ట్‌ సినిమాతో...

కల్ట్‌ సినిమా ట్రైలర్‌ లాంచ్ సందర్భంగా విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతున్న సమయంలో ఆడియన్స్‌ నుంచి ఒకరు గట్టిగా అరుస్తూ అన్నా లైలా సినిమా ఎందుకు తీశావన్నా అంటూ ప్రశ్నించాడు. అందుకు విశ్వక్‌సేన్‌ విభిన్నంగా స్పందించాడు. లైలా గురించి ఎక్కువ స్పందించేందుకు ఆసక్తి చూపించని విశ్వక్‌సేన్‌.. అతడి ప్రశ్నకు సమాధానంగా 'లైలా తీశాకే ఇది తీయబుద్దేసిందిరా' అన్నాడు. ఆ ప్రశ్న అడిగిన వాడిని ఉద్దేశించి కాస్త నన్ను మాట్లాడనివ్వురా బాబు అంటూ సరదాగా వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం విశ్వక్‌సేన్‌ను లైలా సినిమా గురించి అభిమాని అడిగిన తీరు, దానికి విశ్వక్‌ సేన్‌ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. లైలా సినిమా వచ్చి ఏడాది దాటుతున్నా ఇంకా దాని నుంచి విశ్వక్‌ సేన్‌ బయట పడలేక పోతున్నాడు. లైలా సినిమా తర్వాత ఫంకీ అనే సినిమాను సైతం విశ్వక్‌సేన్‌ తీసుకు వచ్చాడు.

తరుణ్‌ భాస్కర్‌ డైలాగ్స్‌...

కల్ట్ సినిమాను ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్‌ టచ్ చేయని విభిన్నమైన జానర్‌లో విశ్వక్‌ సేన్ తీసినట్లుగా చెబుతున్నారు. ట్రైలర్‌ సైతం విభిన్నంగా ఉందనే టాక్‌ను దక్కించుకుంది. హర్రర్‌, కామెడీ సినిమాలను మించి ఈ సినిమా ఉండబోతుందని ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుంది. ఇప్పటికే విడుదల తేదీని కన్ఫర్మ్‌ చేశారు. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కల్ట్ సినిమాకు ప్రముఖ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ డైలాగ్స్ అందించాడు. ఆయన మార్క్‌ పంచ్ డైలాగ్స్‌తో పాటు, విభిన్నమైన స్క్రీన్‌ప్లే కారణంగా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అనే విశ్వాసం ను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. విశ్వక్‌ సేన్‌ గతంలోనూ దర్శకత్వ బాధ్యతలు చూసుకున్న విషయం తెల్సిందే. తన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలకు స్క్రిప్ట్‌ రచనలోనూ విశ్వక్‌సేన్‌ ముద్ర ఉంటుంది. కనుక కల్ట్‌ సినిమాకు ఆయన ఏ స్థాయిలో వర్క్ చేసి ఉంటాడు అనేది అర్థం చేసుకోవచ్చు.

గోవాలోని ఒక దీవిలో జరిగే కథ..

వాస్తవ జీవితంలోని కొన్ని భయానక సంఘటలను స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారని తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ ఇతర అంతర్జాతీయ భాషల్లోనూ విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు ఆ ప్రయత్నాలు కొనసాగుతున్నాయా, తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమా విడుదల అయ్యేనా అనేది చూడాలి. గోవాలోని ఒక నిర్మానుష్య ప్రదేశంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ సాగుతుంది. ఒక దీవిలో చిక్కుకు పోయి, ఆ దీవి చుట్టు ఎలక్ట్రిక్‌ కంచె ఉంటుంది. దాన్ని వారు ఎలా దాటి వచ్చారు, అసలు ఆ దీవి ప్రత్యేకత ఏంటి ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సాగుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కథ సింపుల్‌గానే ఉన్నా నేపథ్యం విభిన్నంగా ఉందంటూ మొదటి నుంచి పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉన్నారు. ట్రైలర్ చూశాకా సినిమాపై పాజిటివిటీ మరింతగా పెరిగిందని సోషల్‌ మీడియాలో టాక్‌ వినిపిస్తుంది. మరి విశ్వక్‌ సేన్‌ వరుస ఫ్లాప్స్‌కు కల్ట్‌ సినిమా బ్రేక్ వేసేనా అనేది చూడాలి.

Tags:    

Similar News