15 ఏళ్ల వయసులో గోళీలు..కర్రాబిళ్లే ఆడలేకపోయేవాళ్లం!
బిగ్ బి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సామాజిక మాధ్యమాల ద్వారా వైభవ్‌కు తన పూర్తి మద్దతును ప్రకటిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.
ఇండియన్ ప్రీమీయర్ లీగ్ (ఐపీఎల్) వంటి ప్రతిష్టాత్మక వేదికలపై ప్రతి ఏటా సరికొత్త ప్రతిభావంతులు వెలుగులోకి వస్తూనే ఉంటారు. అయితే పదిహేనేళ్ల ప్రాయంలోనే ఓ క్రీడాకారుడు యావత్ దేశాన్ని తన వైపు తిప్పుకోవడం అనేది అత్యంత అరుదైన విషయం. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత లీగ్‌లో అలాంటి అద్భుతానికే తెరతీసాడు. క్రీడా ప్రపంచంలో అతి పిన్న వయసులోనే అత్యంత ఆకర్షణీయమైన ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలకమైన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓటమిని చవిచూసి టోర్నీ నుండి నిష్క్రమించింది.
అయితే ఈ ఓటమి కంటే కూడా ఆ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు సాధించి సెంచరీకి కొద్ది దూరంలో నిలిచిపోయిన వైభవ్ దూకుడు, అంతర్జాతీయ స్థాయి బౌలర్లను సైతం ఒత్తిడిలోకి నెట్టేసింది. ఈ చిన్న వయసులోనే అతడు చూపిన పరిణతి -అసాధారణ నైపుణ్యం చూసి క్రికెట్ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ హృదయవిదారక దృశ్యం మైదానంలో కనిపించింది. తాను అంతటి అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ జట్టు ఓడిపోవడాన్ని వైభవ్ తట్టుకోలేకపోయాడు.
కూర్చుని తీవ్ర భావోద్వేగానికి లోనవుతూ కన్నీరు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీని జట్టు సిబ్బంది ఓదార్చవలసి వచ్చింది. గెలుపోటములను సమానంగా స్వీకరించే అనుభవం ఇంకా రాని ఆ వయసులో ఆట పట్ల అతడికి ఉన్న అంకితభావం, గెలవాలనే తపన ఆ కన్నీళ్లలో స్పష్టంగా కనిపించింది. ఇది క్రీడాభిమానుల హృదయాలను కదిలించింది. ఈ యువ ఆటగాడి అద్భుతమైన ప్రదర్శన .. అతడి భావోద్వేగ క్షణాలు సినీ రంగానికి చెందిన ప్రముఖులను కూడా ఆకర్షించాయి. బిగ్ బి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సామాజిక మాధ్యమాల ద్వారా వైభవ్‌కు తన పూర్తి మద్దతును ప్రకటిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు.
వైభవ్ ప్రతిభను అద్భుతం అని అభివర్ణించిన అమితాబ్ ఆటపై చిన్నారి చూపిన పట్టును చూసి తాను ఎంతగానో ముగ్ధుడనయ్యానని పేర్కొన్నారు. తాము ఆ వయసులో ఉన్నప్పుడు వీధుల్లో ఆడే గోళీలు, బిళ్ళంగోడు వంటి చిన్న చిన్న ఆటలను కూడా సరిగ్గా ఆడలేకపోయేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. కానీ 15 ఏళ్ల వయసులోనే వైభవ్ ఇంతటి ప్రపంచ స్థాయి క్రికెట్ లీగ్‌లో అసాధారణమైన రీతిలో బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కానిదని కొనియాడారు.
వైభవ్ కెరీర్ ఇప్పుడే ప్రారంభమైన నేపథ్యంలో ఇండియా టీమ్ లో ఎంతో భవిష్యత్ ఉంది. 15 ఏళ్ల ప్రాయంలోనే హిట్టర్ గా దూసుకుపోతున్నాడు. భారత్ ప్యూచర్ కెప్టెన్ కూడా వైభవ్ సూర్య వంశీ అనడంలో అతిశయోక్తి లేదు.