రూ.200 కోట్లు కొట్టిన మలయాళం మూవీ.. తెలుగులో క్లిక్కయ్యేనా?
సరదా సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు, నాస్టాల్జియా.. అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది.;
మలయాళంలో సంచలనం సృష్టించిన వాలా 2 ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. కేవలం రూ.10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఆ చిత్రం, విడుదలైన రెండున్నర వారాల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. చిన్న సినిమాగా మొదలై భారీ విజయాన్ని అందుకున్న ఆ మూవీ.. ఇప్పుడు తెలుగులోనూ అదే స్థాయి రెస్పాన్స్ పొందుతుందా అన్న ఆసక్తి నెలకొంది.
ఏప్రిల్ 24న తెలుగు రాష్ట్రాల్లో వాలా 2 మూవీ విడుదల అవ్వనుంది. రీసెంట్ గా విడుదలైన తెలుగు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆ ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని విడుదల చేయడం విశేషం. ట్రైలర్ ను బట్టి చూస్తే, స్కూల్, కాలేజ్ జీవితం చుట్టూ తిరిగే కథగా ఈ చిత్రం ఉండబోతోందని అర్థమవుతోంది. నలుగురు స్నేహితుల జీవితాల్లో విద్యార్థి దశ ఎంత ముఖ్యమో, ఆ సమయంలో ఎదురైన అనుభవాలు వారి భవిష్యత్తును ఎలా ప్రభావితం చేశాయో సినిమాలో చూపించారు.
సరదా సన్నివేశాలు, భావోద్వేగ క్షణాలు, నాస్టాల్జియా.. అన్నీ కలిసి ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. యూత్ ను టార్గెట్ చేస్తూ సినిమా తీసినట్లు తెలుస్తోంది. ఆ చిత్రానికి సావిన్ SA దర్శకత్వం వహించారు. ఇందులో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వి వంటి యువ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
వీరి నటనకు ఇప్పటికే మలయాళ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభించాయి. అలాగే అనుభవజ్ఞులైన బిజు కుట్టన్, సుధీష్, విజయ్ బాబు వంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇది ముందుగా వచ్చిన వాలా సినిమాకు సీక్వెల్ గా రూపొందింది. మొదటి భాగం ముగిసిన దగ్గర నుంచి కథ కొనసాగుతూ, ప్రధాన పాత్రల జీవితాల్లో వచ్చిన మార్పులు రెండో భాగంలో చూపించారు.
కాలేజ్ జీవితం, మారుతున్న స్నేహాలు, అనూహ్య మలుపులు కథను ఆసక్తికరంగా మలిచాయి. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా ప్రేమమ్ చిత్రానికి నివాళి అర్పించిన సన్నివేశాలు ఉండటం గమనార్హం. ఆ సినిమా ఇచ్చిన ఫీలింగ్ ను గుర్తు చేసే కొన్ని క్షణాలు ఇందులో కనిపిస్తాయని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. తెలుగులో ఆ సినిమాను సాహు గారపాటి తన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు మలయాళ హిట్ మూవీని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుండటం ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద, యూత్ ఫుల్ కంటెంట్, ఎమోషనల్ టచ్, నాస్టాల్జిక్ మూమెంట్స్ తో వాలా 2 తెలుగు ప్రేక్షకులను అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఆ చిత్రం.. టాలీవుడ్ లో కూడా అదే మ్యాజిక్ చేస్తుందా.. క్లిక్ అవుతుందా లేదా అన్నది విడుదల తర్వాత తేలనుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.