ఉర్పీజాదేవ్ ప్ర‌యాణం వెనుక క‌ష్టాలు..క‌న్నీళ్లు!

ఇటీవల నటి సోహా అలీ ఖాన్ నిర్వహించిన ఓపాడ్‌కాస్ట్‌లో ఉర్ఫీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా టెలివిజన్ నటి స్థాయి నుండి ఇంటర్నెట్ స్టార్‌గా ఎదిగిన క్రమాన్ని పంచుకున్నారు.

Update: 2026-05-30 01:30 GMT

ప్రస్తుత సోషల్ మీడియా సంచలనం.. విలక్షణమైన ఫ్యాషన్ ఐకాన్‌గా గుర్తింపు పొందిన ఉర్ఫీ జావేద్ ప్రయాణం వెనుక ఎన్నో ఆసక్తికరమైన విష‌యాలున్నాయి. ఇటీవల నటి సోహా అలీ ఖాన్ నిర్వహించిన ఓపాడ్‌కాస్ట్‌లో ఉర్ఫీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా టెలివిజన్ నటి స్థాయి నుండి ఇంటర్నెట్ స్టార్‌గా ఎదిగిన క్రమాన్ని పంచుకున్నారు. గ్లామర్ ప్రపంచంలోకి రాకముందు తాను ఎదుర్కొన్న సవాళ్లు, పరిశ్రమలో లభించిన గుర్తింపు, నటిగా ఎదుర్కొన్న వివక్ష గురించి మనసు విప్పి మాట్లాడారు. నక్షత్రాల వెలుగుల వెనుక దాగి ఉన్న చీకటి కోణాలను అమ్మ‌డు రివీల్ చేసింది.

ఉర్ఫీ జావేద్ ఆరంభ జీవితం ఏమాత్రం సాఫీగా సాగలేదు. ఇంట్లో తండ్రి వేధింపులను భరించలేక ఆమె ఇల్లు వదిలి పారిపోయారు. మనుగడ కోసం ఢిల్లీలో ఓ కాల్ సెంటర్‌లో పని చేస్తూ.. పిల్లలకు ట్యూషన్లు చెబుతూ జీవితాన్ని నెట్టుకొచ్చారు. అటుపై ముంబై చేరుకుని ఐదేళ్లలో పెద్ద స్టార్ అయిపోవాలని.. సొంతంగా ఇల్లు, కారు కొనుక్కోవాలని కలలు కనేవారు. అయితే కలల నగరమైన ముంబైలో అడుగుపెట్టిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఊహించిన దానికి పూర్తి భిన్నంగా కఠినంగా సాగాయి. తొలుత‌ బాలీవుడ్ చిత్రాలలో అవకాశాల కోసం ప్రయత్నించారు.

అయితే గాడ్ ఫాదర్ లేనిదే హిందీ సినిమా పరిశ్రమలో రాణించడం అసాధ్యమని త్వరగానే అర్థమైంది. దీంతో తన అందానికి టెలి విజన్ రంగంలో సులభంగానే అవకాశాలు వస్తాయనే నమ్మకంతో టీవీ ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించారు. కానీ అక్కడ కూడా ఆమెకు సహాయక పాత్రలు మాత్రమే దక్కాయి. `బడే భయ్యా కీ దుల్హనియా`తో ప్రారంభించి `చంద్ర నందిని`, `మేరి దుర్గా`, `బేపన్నా` వంటి పలు ధారావాహికలలో న‌టించింది. అక్క‌డా చాలా అవ‌మానాలు ఎదుర్కున్నారు.

టెలివిజన్ రంగంలో ప్రధాన పాత్రధారులు కానీ నటీనటుల పట్ల చూపే వైఖరి చాలా దారుణంగా ఉంటుందని ఉర్ఫీ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఒక స్టార్ లేదా లీడ్ యాక్టర్ కాకపోతే? సెట్స్‌లో ఎవరూ మిమ్మల్ని కనీసం మనుషు లుగా కూడా పరిగణించరని సైడ్ క్యారెక్టర్లకు సరైన మర్యాద దక్కదని పేర్కొన్నారు. ముంబై లాంటి ఖరీదైన నగరంలో ఇంటి అద్దె చెల్లించడానికి.. బ్రతకడానికి నెలకు 40000 రూపాయల ఖ‌ర్చు అవుతుంది. త‌న సంపాద‌నంతా అలాగే స‌రిపోయేది. ఆ పని మానసిక తృప్తిని ఇవ్వ‌క‌పోయినా? ఆర్థిక అవసరాల కోసం ఆ కష్టాలను భరించక తప్పలేదన్నారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా ఉర్పీ జీవితాన్ని మలుపు తిప్పింది. చిన్నప్పటి నుండి ఫ్యాషన్ రంగంపై ఉన్న ఆసక్తిని అమ్మ‌డు డిజిటల్ వేదికగా మార్చుకున్నారు. `బిగ్ బాస్ ఓటీటీలో ఆమె ప్రవేశం కీలక మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా వ్యర్థ పదార్థాలతో ఆమె తయారుచేసిన దుస్తులు నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. అటుపై ఎయిర్‌పోర్ట్‌లో వినూత్నమైన దుస్తుల వీడియో అకస్మాత్తుగా వైరల్ కావడంతో కంటెంట్ క్రియేటర్‌గా సరికొత్త పంథాను ఎంచుకున్నారు. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే తన సృజనాత్మకతతో సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

నెలకు 40000 రూపాయలతో మొదలైన సంపాద‌న నేడు ల‌క్ష‌లు తాకింది. బ్రాండ్ కొలాబరేషన్స్ - సోషల్ మీడియా వేదికల ద్వారా నెలకు 2 లక్షల రూపాయలకు పైగా ఆర్జిస్తున్నారు. దీంతో ఆర్దికంగా నిల‌దొక్కుకున్నారు. పరిశ్రమలో ఉర్పీజావేద్ పరపతి కూడా పెరిగింది. ఇటీవల `స్ప్లిట్స్‌విల్లా ఎక్స్6` వంటి ప్రముఖ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించే స్థాయికి చేరుకున్నారు. ఎలాంటి మద్దతు లేకుండా స్వయంకృషితో ఎదిగిన ఉర్ఫీ ప్రయాణం నేటి తరం క్రియేటర్లకు నిదర్శనంగా నిలుస్తుంది.

Tags:    

Similar News